మెగాస్టార్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్కడ.?

ఓ సినీ అభిమాని హత్య జరిగింది. ఓ హీరో అభిమాని, ఇంకో హీరో అభిమానిని చంపేశాడు. ఇరువురు అభిమానుల మధ్య తమ అభిమాన హీరో గొప్ప.. అన్న విషయమై జరిగిన వాగ్యుద్ధం ఏకంగా ఓ అభిమాని ప్రాణాన్ని తీసేసింది. అత్యంత దురదృష్టకరమైన, దారుణమైన ఘటన ఇది. ఈ ఘటనపై ఓ హీరో స్పందిస్తే సరిపోదు, మొత్తం సినీ పరిశ్రమలో అభిమానుల పేరు చెప్పి పండగ చేసుకునే ప్రతీ హీరో స్పందించి తీరాల్సిందే. 

అభిమానులకి ఎమోషన్‌ తప్ప.. ఇంకేమీ వుండదని ఓ తెలుగు సినిమాలో హీరో డైలాగ్‌ చెబుతాడు. ఆ ఎమోషనే ఓ అభిమాని ప్రాణాన్ని తీసేసింది. ఆ ఎమోషనే ఓ అభిమానిని నేరస్తుడ్ని చేసింది. చనిపోయింది పవన్‌కళ్యాణ్‌ వీరాభిమాని. పవన్‌కళ్యాణ్‌తోపాటు ఆ అభిమాని చిరంజీవిని కూడా అభిమానించాడు. అసలు అభిమానం మొదలయ్యిందే చిరంజీవి నుంచి.. అని మృతుడి తల్లి వాపోతోంది. దశాబ్దాలుగా చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులుగా వుంటున్నామని మృతుడు వినోద్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

పవన్‌కళ్యాణ్‌ ఈ రోజు వినోద్‌ కుటుంబ సభ్యుల్ని పరామర్శించినప్పుడు, బాధిత కుటుంబం పవన్‌ జనసేన జెండాతో కాదు, చిరంజీవి ప్రజారాజ్యం జెండాతో కనిపించింది. చిరంజీవి ఎప్పుడో తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని మర్చిపోయారు.. కానీ, అభిమానులు ఇంకా ఆ పార్టీని మరువలేకపోతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అయినా, ఈ హత్యపై ఇప్పటదాకా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించలేదు. 'తమ్ముడు వెళ్ళాడు కదా..' అని అన్న సరిపెట్టుకుంటే, ఇక మాట్లాడటానికేమీ లేదు. చిత్రమేంటంటే, రేపు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 

ఇదిలా వుంటే, వినోద్‌ని హత్య చేసింది జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని అక్షయ్‌కుమార్‌. దాంతో, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ ఘటనపై స్పందించాల్సి వుంది. 'అభిమానులూ మా కోసం చచ్చిపోవద్దు.. చంపుకోవద్దు..' అన్న సందేశం జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు ప్రతి ఒక్క స్టార్‌ హీరో ఇచ్చి తీరాల్సిన సందర్భమిది. హద్దులు తెలియని అభిమానమే హీరోలుగా తమ స్టార్‌డమ్‌ని పెంచుతోందని ఏ హీరో అయినా మురిసిపోతే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. Readmore!

Show comments