జగన్ కు ఈ సభలైన కలిసొచ్చేనా..?!

ఏపీ ప్రత్యేకహోదా పోరాటాన్ని కొత్త పుంతలతో జనాల్లోకి తీసుకెళ్తున్నామని ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల మోసపూరిత వైఖరిని ఎండగతామని అంటోంది. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా హామీని ఇచ్చి.. పది, పదిహేనేళ్ల పాటు ఏపీకి ఆ హాదాను ఇప్పిస్తామని ప్రగల్బాలు పలికి.. ఇప్పుడు మాత్రం  బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయని ప్యాకేజీ పేరుతో స్వలాభాన్ని చూసుకొంటూ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని వైకాపా అంటోంది.

ఇప్పటికే ఈ వాదనను వైకాపా వినిపించింది.. వినిపిస్తోంది. జగన్ ఏమో యువభేరీలు అంటూ.. యూత్ ను కలుపుకొంటూ ఈ వాదన వినిపిస్తున్నాడు. ఇంతే కాదట.. ఇప్పుడు ప్రత్యేకహోదా కోసం పోరాటంలో భాగంగా బహిరంగ సభలను నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ముందు వైజాగ్ లో సభ నిర్వహిస్తామని.. దానికి ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ అని పేరు పెట్టామని ప్రకటించారు. ఆ మేరకు పోస్టర్లు ఆవిష్కరించారు.

మరి ఇదంతా చూస్తుంటే.. గత పరిణామాలు కొన్ని గుర్తుకురాక మానవు. ప్రత్యేకహోదా విషయంలో ఇప్పటి సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగినట్టే.. విభజనతో కూడా ఇదే ప్రాంతానికి అన్యాయం జరిగింది. అప్పుడు అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ విభజనకు పాల్పడింది. తమది సమైక్యవాదం అని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ వాదాన్ని వినిపించడానికి సభలను ఏర్పాటు చేసింది!

జగన్ స్వతహాగా చేసిన దీక్షలు, ఆ పార్టీ  నిర్వహించిన బంద్ లే కాకుండా.. హైదరాబాద్ లో సమైక్యాంధ్ర నినాదాన్ని ఇస్తూ వైకాపా సభలు నిర్వహించింది. విభజనకు వ్యతిరేకమని ప్రకటించింది.. అయితే, వైకాపా సభలతో విభజనా ఆగలేదు, ఆ పార్టీకి సీమాంధ్రలో పొలిటికల్ గా మైలేజీ రాలేదు! Readmore!

విభజనకు అనుకూలంగా లేఖలిచ్చిన చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు.. విభజనకు మద్దతు పలికిన బీజేపీ ఏపీలో తన స్థాయికి మించి సీట్లను గెలుచుకోగలిగింది! ఇక ఎన్నికల ప్రచార సమయంలో కూడా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ.. డ్యూయల్ టోన్ నే పలికాయి. సమైక్యాంధ్ర.. సభలు అన్న జగన్ మాత్రం అధికారానికి బోలెడంత దూరంలో నిలిచిపోయాడు! విభజనకు పాల్పడ్డ కాంగ్రెస్ మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. 

మరి సమైక్య వాద సభల అనుభవం అలా ఉంది.. ఇప్పుడు ఈ ప్రత్యేకహోదా సభల పరిణామాలు, ఫలితాలు ఎలా ఉంటాయో!

Show comments