చంద్రబాబు లక్ష కోట్ల లెక్క చెప్పలేదేమో.!

అదిగదిగో చంద్రబాబు చైనాకి వెళ్ళొచ్చారు.. 50 వేల కోట్ల పైన విలువ చేసే ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఇదిగిదుగో చంద్రబాబు రష్యాకి వెళ్ళారు.. లక్ష కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చారు.. ఆగండాగండీ.. మొదటి సగం పూర్తయ్యింది, రెండో సగం అతి త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రచారమేంటంటారా.? చంద్రబాబుకన్నా తొందర ఈ భజనగాళ్ళకి. ఆ భజనగాళ్ళు ఎవరు.? అనడక్కండి.. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కాదు, ఆ పార్టీకి మద్దతిస్తున్న మీడియా సంస్థల అధిపతులు. 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణం వంటి విషయాల్లో విదేశీ సహకారం కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు. రెక్కలు కట్టుకుని విదేశాలకు వెళ్ళివస్తున్నారాయన. ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అంతకు మించి, అమరావతిపై ఆయా దేశాలు ప్రత్యేకంగా చూపించే శ్రద్ధ మాత్రం కన్పించడంలేదు. ఒప్పందాలనేవి చాలా చిన్నమాట. ఆ ఒప్పందాలకు ముందు 'అవగాహన' అనే మాట ఒకటి వుంటుంది.. దాంతో అది ఇంకా చిన్న మాట అయిపోతుంటుంది. 

పెట్టుబడులు పెట్టడం వేరు, దానికోసం ఒప్పందాలు కుదుర్చుకోవడం వేరు, అవగాహనా ఒప్పందాలు ఇంకా వేరు. అవగాహన కుదిరాక, ఒప్పందాలు చేసుకున్నాక, పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంటుంది. ఒక్కోసారి పెట్టుబడులు పెట్టినట్లే, పెట్టి వెనక్కి తీసేసుకుంటుంటారు. కథ ఇంత పెద్దది మరి. కానీ, చంద్రబాబు విమానమెక్కితే చాలు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రాజెక్టులు వచ్చేసినట్లు, అమరావతి నిర్మాణం పూర్తయిపోయినట్లు ఊహాగానాలతో కూడిన కథనాలు టీడీపీ అనుకూల మీడియాలో తెరపైకొస్తుంటాయి. 

రష్యా పర్యటనలో వున్న చంద్రబాబు, ఈ పర్యటనలో బాగంగా పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫలానా దేశం పరిస్థితి అచ్చం ఆంధ్రప్రదేశ్‌ లాంటిదే.. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసా.? అంటూ ముందే ప్రిపేర్‌ చేసిన కథనాల్ని వండి వడ్డించేస్తోంది ఓ మీడియా సంస్థ. ఇంకో మీడియా సంస్థ అయితే, చంద్రబాబు ప్రసంగాలకు దేశాధినేతలే ముక్కున వేలేసుకుంటున్నారంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తోంది.  Readmore!

రెండేళ్ళయ్యింది.. చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారు, వస్తున్నారు.. అమరావతికి సంబంధించి మాత్రం కొత్తగా ఒక్క ముందడుగు కూడా పడిన పరిస్థితి లేదు. తాత్కాలిక సచివాలయం మనం కట్టుకుంటున్నదే.. అంతకు మించి, అమరావతిలో ఏ నిర్మాణం జరిగినట్లు.? విదేశీ సంస్థలు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌ మొత్తమ్మీద ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు.? ఆ ఒక్కటీ అడగొద్దు.. ఎందుకంటే చంద్రబాబుకీ, ఆయనకి వంత పాడే మీడియాకీ కోపమొచ్చేస్తుంది. 

రేపు కాకపోతే ఎల్లుండి.. లక్ష కోట్లు.. అంటూ చంద్రబాబు రష్యాకి వెళ్ళి సాధించిన 'ఘనత'గా టీడీపీ అనుకూల మీడియా పబ్లిసిటీ చెయ్యకుండా వుండగలదా.? చంద్రబాబు ఆ దిశగా సమాచారం వారికి మాత్రమే 'ప్రత్యేకంగా' ఇవ్వకుండా వుంటారా.? వేచి చూడాల్సిందే.

Show comments