నటి హేమ.. కాపుల నేత అయిపోయింది!

ఇది వరకే రాజకీయాలు మొదలుపెట్టిన నటి హేమ ఇప్పుడు కుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తోంది! గత ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి “జై సమైక్యాంధ్ర పార్టీ’’ తరపున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే డిపాజిట్ ను కూడా సంపాదించుకోలేకపోయింది. కేవలం ఏడువందల చిల్లర ఓట్లకు పరిమితం అయ్యింది. కిరణ్ కుమార్ రెడ్డికే దిక్కులేని నేపథ్యంలో.. ఆ పార్టీ తరపున హేమ బరిలోకి దిగి తన వంతు కామెడీని పూర్తి చేసింది.

నాటికి కిరణ్ కు సన్నిహితుడు అయిన హర్షకుమార్ ఆశీస్సులతో హేమ అప్పుడు పోటీ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె తరపున వ్యయ ప్రయాసలు అన్నీ హర్షకుమారే భరించినట్టు సమాచారం. అయితే ఆ ఎన్నికల తర్వాత హేమ తిరిగి సినిమాలకే పరిమితం అయినా.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె చాలా హడావుడే చేసింది. రాజేంద్ర ప్రసాద్ కు వ్యతిరేకంగా  ఆమె గళం విప్పింది. నడి రోడ్లో పెద్ద  రచ్చే చేసింది. అయితే ఆమె సపోర్ట్ చేసిన జయసుధ ప్యానల్ ఓడిపోవడంతో.. హేమ అవాక్కయ్యింది.

ఈ సంగతులలా ఉంటే.. ఇప్పుడు హే మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సారి ఆమె.. కాపు సంఘం నేతగా నిలుస్తోంది! కాపులకు రిజర్వేషన్ల ఉద్యమం నిర్వహిస్తున్న ముద్రగడకు ఆమె మద్దతుగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన కాపు సంఘం ముఖ్య నేతల సమావేశంలో హేమ నాయకురాలి హోదాలో పాల్గొంది! కాపు ప్రముఖులు.. దాసరి, బొత్స, అంబటి స్థాయిలో… హేమ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది.

కాపు ఉద్యమం భవిష్యత్తు కార్యాచరణ విషయంలో హేమ కూడా తన వంతు సలహాలు, సూచనలు ఇచ్చిందట!  మొత్తానికి హేమ ఆ విధంగా ముందుకు వెళ్తోంది!

Show comments