నయీం ఎన్‌కౌంటర్: కెసిఆర్‌కు అసలైన పరీక్ష ఇప్పుడే

పేరుమోసిన నేరగాడు నయీముద్దీన్ ఎన్‌కౌంటర్‌పై వస్తున్న కధనాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. మన రాజకీయ వ్యవస్థ, మన పోలీసు వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది  ఈ ఘటన తెలియచేస్తుంది. అదికారం కోసం, స్వార్దం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తులు ఏ వ్యవస్థలలో ఉన్నా పరిస్థితి ఇంత ఘోరంగానే ఉంటుందని అనుకోవాలి. నయీముద్దీన్ అన్నవాడు గత రెండున్నర దశాబ్దాలుగా నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడంటే ఎంత అద్వాన్న పరిస్థితి. చివరికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను బెదిరించే దశకు చేరుకున్నాడంటే ఎంత ప్రమాదకరం. వేలకోట్లు నయీం కొల్లగొట్టడమే కాదు, వాడిని అడ్డం పెట్టుకుని నేతలు, పోలీసు అధికారులు ఆర్జించిన తీరు దారుణంగా ఉంది. సీ

పీఐ నేత నారాయణ చెప్పినట్లు నిజంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందినవారిని బెదిరించడం వల్లే ఈ ఎన్‌కౌంటర్ జరిగినా, లేక ఒక పారిశ్రామిక వేత్తను ఏభైకోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినందువల్లకాని, ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తానని బెదిరించినందువల్ల కాని, మరే కారణం వల్ల కాని ఎన్‌కౌంటర్ జరిగినా మొత్తం మీద కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించవలసిందే. అదే సమయంలో ఇంతకాలంగా పట్టుకోకుండా, అలాంటి దుర్మార్గుడిని వాడుకుంటూ తమ అక్రమ సంపాదనకు కూడా అడ్డుపెట్టుకున్న కొందరు నేతలు, పోలీసుల అధికారుల సంగతి ఏమిటని ప్రశ్న వస్తుంది. 

ఐపీఎస్‌లు కొందరికి నెలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తున్నాడట. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఈ విషయంలో గతంలో ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా  పనిచేసిన, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆయన పెంచిన విషనాగే నయీం అని అన్నారు. ఒక టీడీపీ మాజీ మంత్రితో నయీం సంబందాలు కొనసాగించడన్న సమాచారంతో సోలిపేట ఆరోపణలకు బలం ఏర్పడింది. ఒకప్పుడు చిన్న వర్కర్‌గా జీవితాన్ని ఆరంభించి, మావోయిస్టులలో చేరి, తదుపరి బయటకు వచ్చి, మావోయిస్టులేక వ్యతిరేకంగా తయారై, ప్రభుత్వానికి అంటే పోలీసులకు కోవర్టుగా అవతారం ఎత్తి, వారితో ఏర్పడిన స్నేహాన్ని అడ్డు పెట్టుకుని వేలకోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు సంపాదించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 

సంచుల నిండా బంగారం, వందల కొద్ది డాక్యుమెంట్లు, కోట్ల రూపాయల నగదు దొరికిన తీరు చూస్తే ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధించి, హింసించి ఈ ఆస్తులు కూడగట్టింది అర్ధం అవుతుంది. రెండున్నర దశాబ్దాలుగా సాగుతున్న ఈ అరాచానికి ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలన్నీ బాద్యత వహించవలసిందే. చంద్రబాబు టైమ్‌లో నయీం దుష్టశక్తిగా ఎదిగినా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయన్న ప్రశ్న వస్తుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమను నయీం చంపుతాడని, అతని విషయం ఏదో ఒకటి తేల్చాలని మొరబెట్టుకున్న తర్వాతే ప్రభుత్వం కదిలిందన్నదానికి కూడా రామలింగారెడ్డి జవాబు ఇవ్వవలసి ఉంటుంది. 

ఒక ప్రముఖుడి భార్యను సైతం కిడ్నాప్ చేశాడంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. నయీం చివరకు చేయని నేరం, చేయని ఘోరం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఘటన గురించి టీవీలలో చూడడానికే భయం వేస్తోంది. ఈ సమాచారాన్ని పత్రికలలో చదవడమే కలవరం కలిగిస్తుంది. ఉగ్రవాదికన్నా భయంకరమైన నేరస్తుడు ఇంతకాలం మన మద్యే ఉన్నాడంటే, ఇష్టారాజ్యంగా వ్యవహరించాడంటే, యధేచ్చగా చెలామణి అయిపోయాడంటేనే మన సమాజం ఇంతగా మొద్దుబారిపోయిందా అన్న ఆవేదన కలుగుతుంది. 

నయీముద్దీన్ అనే క్రూరమైన నేరగాడు ఎందరిని చంపాడు. ఎంతమందిని బెదిరించాడు. ఎంతమందిని క్రిమినల్స్‌గా తయారు చేశాడు? వీటికి సంబందించి వస్తున్న కథనాలు అచ్చం డిటెక్టివ్ నవలలో మాదిరే ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. ఇరవైమూడేళ్ల క్రితం అప్పట్లో అత్యంత ప్రజాదరణ కలిగిన పోలీసు అధికారి కె.ఎస్.వ్యాస్‌ను హైదరాబాద్‌లో దారుణంగా కాల్చిన ఘటన ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తుంది. తెలంగాణ పోలీసులు నయీంను ఎన్ కౌంటర్ చేసినందుకు అన్నివైపుల నుంచి, అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయి. నిజంగానే మెచ్చుకోవలసిన అంశమే. 

సమాజానికి చీడపురుగులు మాదిరి మారిన ఇలాంటి సంఘవ్యతిరేక శక్తుల వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో చెప్పలేం. వందకు పైగా కేసులు ఇతనిపై ఉన్నాయంటేనే అర్దం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే రాజకీయాలలోకి కూడా నయీం వచ్చేసేవాడట. అది జరగకపోవడం ప్రజల అదృష్టం అనుకోవాలి. పోలీసులు ఇప్పటికైనా అతనిని ఎన్‌కౌంటర్ చేయడం అభినందనీయమే అయినా, రెండున్నర దశాబ్దాలుగా పట్టుకోలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. నయీంను ప్టుటకున్న తర్వాత మొత్తం అతగాడి నేర సామ్రాజ్యం అంతటిని కూల్చుతారా? లేక అతని వారసులుగా మరికొందరు డాన్‌లు తయారవుతారా అన్నది తేలడానికి కొంత సమయం పడుతుంది. 

అలాగే ఈకేసులో సంబంధం ఉన్న రాజకీయ నేతలు, ఐపీఎస్, ఇతర పోలీసు అదికారులు అందరి జాతకాలు బయటపడతాయా? లేక కొందరు అనుమానిస్తున్నట్లుగా ఓటుకు నోటు కేసు మాదిరి తూతూ మంత్రంగా సాగి అసలు సూత్రధారులంతా బయటపడిపోతారా అన్నది చూడాల్సి ఉంటుంది. కేసీఆర్‌పై రాజకీయంగాను, అధికారుల పరంగాను తీవ్రమైన ఒత్తిడి రావచ్చు. వాటన్నిటిని కేసీఆర్ తట్టుకుని నిలబడతారా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. ఇది కేసీఆర్‌కు అసలైన పరీక్ష అవుతుంది.

కొమ్మినేని శ్రీనివాస్ రావు , సీనియర్ జర్నలిస్ట్ 

Show comments