వెంకయ్య అంతే.. వెంకయ్య అంతే!

దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్‌ పాత్రలో ఉన్న కమల హాసన్‌ ఓ అద్భుతమైన డైలాగు సందిస్తాడు. తన గురించి తాను డబ్బా కొట్టుకుంటూ.. ''ఐ స్పీక్‌ సెవెన్‌ లాంగ్వేజెస్‌ ఇన్‌ టామిళ్‌..ళ్‌'' అని సెలవిస్తాడు. తన మాతృభాష యాసలోనే తాము ఎరిగిన అన్ని భాషలనూ మాట్లాడేసే వారి గురించి తరచూ వినిపించే జోకు ఇది. నిజానికి వెంకయ్య నాయుడుకు ఇలాంటి సమస్య లేదు. ఆయన ఉత్తరాది వారి హిందీ భాషను, ఏ రాష్ట్రం వారు తన వద్దకు వస్తే.. ''వారి వారి యాసలోనే '' మాట్లాడగల ఘనాపాటి అని పేరుంది. అయితే అలాంటి భాషా పాండిత్యం ఉన్న వెంకయ్యనాయుడు ఓ సరదా పనిచేశారు. 

ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అల్లర్లతో ఉడికిపోతున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలతోనూ ప్రత్యక్షంగా ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు. ఆయన ఇరు రాష్ట్రాల వారికి పిలుపు ఇచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని.. ప్రస్తుత వ్యవహారంలో సామాన్య ప్రజానీకానికి సంబంధించినదేమీ లేదని, అలాంటి వారి దైనందిన జీవితానికి ఇబ్బంది లేని రీతిలో ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో ఉండాలని వెంకయ్యనాయుడు చాలా సుహృద్భావ దృక్పథంతో పిలుపు ఇచ్చారు. అందుకు అభినందించాల్సిందే. 

అయితే ఆ విషయం గురించి హైదరాబాదులో ప్రెస్‌ మీట్‌ పెట్టి ఆయన ఎంచక్కా.. తెలుగులో రెండు నాన్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సందేశం ఇచ్చేశారు. పొరుగు రాష్ట్రాల వారికోసం తెలుగులో సందేశం ఇవ్వడమే ఒక చిత్రం అనుకుంటే.. వెంకయ్యప్రెస్‌ మీట్‌ అంటే చాలు.. పూనకం వచ్చినట్లుగా ఊగిపోయే టీవీ ఛానెళ్లు అన్నీ ఏకంగా లైవ్‌లో ఆయన భరతవాక్యం పలికే వరకు సదరు తెలుగు ప్రసంగాన్ని చూపించాయి. చాలా భాషల్లో పాండిత్యం ఉన్న వెంకయ్యనాయుడు.. ఆ ఇరు రాష్ట్రాల భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల వ్యక్తే. కనీసం ఇరువురికీ అర్థమయ్యేలా.. ఇంగ్లీషులోనైనా చెప్పి ఉండొచ్చు కదా.. తమిళ కన్నడిగుల కోసం.. మన సారు తెలుగులో సందేశం ఇవ్వడం ఏమిటి కామెడీ కాకపోతే.. అని మీడియా వాళ్లే జోకులేసుకున్నారు మరి!!

Readmore!
Show comments