5 రాష్ట్రాల ఎన్నికలు.. క్లైమాక్స్ మార్చి 11న!

ఉత్తరప్రదేశ్, పంజాబ్ , గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల హంగామా మొదలైంది. దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికల సంగ్రామానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్టుగా ఈసీ ప్రకటించింది.  

తొలి విడతగా ఫిబ్రవరి నాలుగో తేదీన పోలింగ్ జరుగుతుంది. పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ విడతలోనే ఎన్నికలు పూర్తి అవుతాయి. ఫిబ్రవరి 15వ తేదీ పోలింగ్ తో ఉత్తరాఖండ్ లో పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇక యూపీలో మాత్రం మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ఒక్కో విడతగా కొన్ని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న యూపీ తొలి దశ ఎన్నికలు జరగుతాయి. మార్చి ఎనిమిదో తేదీతో ఈ రాష్ట్ర ఎన్నికల సంగ్రామం ముగుస్తుంది.

మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలనూ మార్చి 11వ తేదీన ప్రకటిస్తారు. దీన్ని బట్టి మార్చి 11న క్లైమాక్స్ అనుకోవాలి. యూపీ ఎన్నికలు బీజేపీ కి ప్రతిష్టగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో తొంబై శాతం సీట్లను సాధించిన రాష్ట్రంలో కమలం తన పట్టేమిటో ఇప్పుడు నిరూపించుకోవాల్సి ఉంది. అలాగే పంజాబ్ కాంగ్రెస్ కు చావోరేవో అన్నట్టుగా మారింది. అక్కడ బీజేపీ ఊసులో కనిపించడం లేదు. ప్రధాన పోటీ కాంగ్రెస్- ఆప్ ల మధ్య కనిపిస్తోంది.

గోవాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అమితుమి తేల్చుకోనుంది. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్- బీజేపీల మధ్య, మణిపూర్ లో కాంగ్రెస్- తృణమూల్ కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. 

Show comments