'బాహుబలి'ని భారీ మార్జిత్‌తో కొట్టెయ్యాలి

'బాహుబలి ది కంక్లూజన్‌' అలా ఇలా కాదు, బంపర్‌ మెజార్టీతో బాలీవుడ్‌ సినిమా 'దంగల్‌'ని దాటేసింది. చైనాలో 'దంగల్‌' విడుదల కాకపోయి వుంటే, 'బాహుబలి ది కంక్లూజన్‌', 'దంగల్‌' కంటే రెండింతల వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కేది.

అనూహ్యంగా చైనాలో 'దంగల్‌' వసూళ్ళ దుమ్ముదులిపేసింది. ఓ ఇండియన్‌ సినిమా భారీ స్థాయిలో చైనాలో వసూళ్ళు సాధించిందంటే, దేశమంతా గర్వించే విషయమే. దాదాపు వెయ్యి కోట్ల వసూళ్ళు చైనాలో 'దంగల్‌' సాధించిందన్నది తాజా ఖబర్‌. 

అయితే, సమస్య ఎక్కడొస్తోందంటే, 'బాహుబలి ది కంక్లూజన్‌'ని దాటేసిన 'దంగల్‌' అంటూ బాలీవుడ్‌లో ఓ వర్గం మీడియా ప్రచారం షురూ చేసింది. అదీ, 'బాహుబలి' విజయాన్ని దక్కువ చేస్తూ కావడమే వివాదానికి అసలు కారణం. నిజానికి 'బాహుబలి' ఇంకా చైనాలో విడుదలవలేదు.

కానీ, చైనాలో 'బాహుబలి ది బిగినింగ్‌' తేడా కొట్టేయడంతో, 'బాహుబలి ది కంక్లూజన్‌' చైనాలో విడులయినా, 'దంగల్‌' రికార్డుకి వచ్చే నష్టమేమీ లేదన్నది సోకాల్డ్‌ బాలీవుడ్‌ మేధావుల వాదన. ఈలోగా ’దంగల్‘ భారీ మార్జిన్ సాధిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతానికైతే అత్యధిక వసూళ్ళను సాధించిన చిత్రంగా 'దంగల్‌' రికార్డులకెక్కింది. 1700 కోట్ల పైచిలుకు వసూళ్ళు 'దంగల్‌' ఖాతాలో వున్నాయి (చైనాతో కలుపుకుని). వెయ్యి కోట్లు సాధించిన తొలి భారతీయ సినిమా 'బాహుబలి'. 1100 కోట్లు, 1200 కోట్లు, 1300 కోట్లు, 1400 కోట్లు, 1500 కోట్లు.. ఈ రికార్డులన్నీ 'బాహుబలి' పేరిటే వున్నాయి. 1700 కోట్ల రికార్డుకి వచ్చేసరికి, 'బాహుబలి ది కంక్లూజన్‌' కాస్త నెమ్మదించింది. 

ఏదిఏమైనా, మన ఇండియన్‌ సినిమా హాలీవుడ్‌ స్థాయిలో వసూళ్ళను సాధించడం చిన్న విషయం కాదు. ఆ ఘనతని మన ఇండియన్‌ సినిమాలు రెండు, ఒకదానితో ఒకటి పోటీ పడి దూసుకుపోతున్నాయంటే ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిందే. అది మానేసి, వివాదాలేంటి కామెడీ కాకపోతే.?

Show comments