త్రిపురను గెలుచుకోవడం సాధ్యమా?

పూర్వకాలంలో మహారాజులు, చక్రవర్తులు పొరుగు రాజ్యాల మీద యుద్ధాలు చేసి, దండయాత్ర సాగించి సామ్రాజ్యాలను విస్తరించి రాజులను సామంతులుగా చేసుకునేవారు. అంటే తమకు ఎదురు లేకుండా చేసుకునేవారు. ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ధోరణి, దృక్పథం ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు అమిత్‌షా ద్వయం కలిసి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన మాత్రమే ఉండాలని కంకణం కట్టుకున్నారు. 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' పేరుతో కాంగ్రెసు ప్రభుత్వాలే కాకుండా, కాంగ్రెసేతర పార్టీల ప్రభుత్వాలూ ఉండకూడదని బీజేపీ భావిస్తోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీ ప్రభుత్వ పగ్గాలు చేతబట్టాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అక్కడ విఫలమైనా మొన్న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బదులు తీర్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లో పాగా వేసింది. మెజారిటీ రాకపోయినా గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. ఉత్తరాఖండ్‌ చేజిక్కించుకుంది.

గుజరాత్‌ సహా ఇతర రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని అసోంలో ఇదివరకే అధికారం దక్కించుకుంది. మణిపూర్‌ ప్రస్తుతం కమలం చేతుల్లోనే ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ ఏలుబడిలోనే ఉంది. మోదీ-అమిత్‌షా ద్వయం కన్ను ఈశాన్యంలో కీలక రాష్ట్రమైన, సీపీఎం కంచుకోట అయిన త్రిపుర మీద పడింది. అక్కడ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరుగుతాయి. అయినప్పటికీ ఇప్పటినుంచే అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 'చిన్న పామునైనా పెద్ద కరత్రో కొట్టాలి' అన్నట్లుగా చిన్న రాష్ట్రామా, పెద్ద రాష్ట్రమా అనేదాంతో నిమిత్తం లేకుండా ఏడాది లేదా ఏడాదిన్నర ముందే ఎన్నికల ప్రచారంలోకి దిగాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయం పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు పోతోంది. దేశమంతా 95 రోజుల టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు అమిత్‌ షా. అందులో భాగంగా రెండు రోజులపాటు త్రిపురలో పర్యటించి రోడ్‌షోలు నిర్వహించారు. సభలు పెట్టారు. త్రిపురను గెలుచుకోవాలన్నేదే తమ లక్ష్యమని స్పష్టంగా ప్రకటించారు.

2018లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో త్రిపుర మాత్రమే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని బీజేపీ గెలుచుకోవడం సాధ్యమా? అని ప్రశ్నించుకుంటే కాదని చెప్పొచ్చంటున్నారు విశ్లేషకులు. 1998 నుంచి మాణిక్‌ సర్కార్‌ త్రిపుర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మచ్చలేని ముఖ్యమంత్రి. అత్యంత నిజాయితీపరుడు. నిరాడంబర జీవితం గడుపుతున్న నాయకుడు. రోజు వంద తప్పులు చేస్తూ కూడా నిజాయితీపరులమంటూ గుండెలు బాదుకునే సీఎంలు ఉన్న ఈ కాలంలో తాను ఎలాంటివాడో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేని ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌. కాని ఈయన పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ ప్రచారం చేస్తోంది. కమ్యూనిస్టు పాలనతో త్రిపుర ప్రజలు విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అమిత్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ తన సభ్యత్వాన్ని పెంచుకుంది. 2014లో 15 వేలున్న సభ్యత్వం ప్రస్తుతం 21 లక్షలుందని నాయకులు చెబుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నిలబెట్టిన 50 మంది అభ్యర్థుల్లో 47 మంది డిపాజిట్లు కోల్పోయారు. అంతటి దుస్థితి నుంచి పార్టీ కోలుకుందా అని ప్రశ్నిస్తే కాషాయం నాయకులు అవునని సమాధానమిస్తున్నారు.

ఇదంతా మోదీ పరిపాలన ప్రభావమంటున్నారు. ఐదువేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, తృణమూల్‌ కాంగ్రెసుకు చెందినవారు బీజేపీలో చేరారరని చెబుతున్నారు. కమ్యూనిస్టులపై నిరంతరం కళ్లెర్రజేసే మమతా బెనర్జీ కూడా తన తదుపరి లక్ష్యంగా త్రిపురను ఎంచుకున్నారు. అందుకోసం ఆమె ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారట....!  ఆ రాష్ట్రంలో  ఎలాగైనా తన రాజ్యాన్ని స్థాపించాలని మమతా పట్టుదలగా ఉన్నారట...!  బెంగాల్లో సాధించింది త్రిపురలోనూ సాధిస్తామని  ఆమె బహిరంగంగానే ప్రకటించారు. త్రిపురను తాను అర్థం చేసుకున్నానని, అక్కడి ప్రజలను ప్రేమిస్తున్నానని, కమ్యూనిస్టులు గద్దె దిగే రోజులొస్తున్నాయని దీదీ అన్నారు. వాళ్లిక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో రెండుసార్లు అధికారంలోకి వచ్చాక చిన్న రాష్ట్రమైన త్రిపురను గెల్చుకోవడం పెద్ద కష్టం కాదని ఆమె భావిస్తున్నారు. త్రిపుర భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి మరి.

Show comments