సామాన్యులకు అర్థం కాని 'సుప్రీం' ధర్మసూక్ష్మం...!

న్యాయస్థానాల తీర్పులు కొన్ని గమ్మత్తుగా, విచిత్రంగా ఉంటాయి. కొన్ని తీర్పులు చూస్తే 'ఏమిటంత అన్యాయంగా తీర్పు ఇచ్చారు' అనుకుంటాం. లోకమంతా దోషి అనుకున్న వ్యక్తి నిర్దోషిగా విడుదలవుతాడు. నిర్దోషి అనుకున్న వ్యక్తికి శిక్ష పడుతుంది. జైలు శిక్షలు, జరిమానాల్లో కూడా జనం అంచనాకు, కోర్టు తీర్పులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు విజయవాడలో దశాబ్దం క్రితం జరిగిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో అసలు దోషిని వదిలిపెట్టి సత్యం బాబు అనే అమాయకుడిని ఎనిమిది సంవత్సరాలు జైల్లో పెట్టారు. అతను నిర్దోషి అని తీర్పు ఇచ్చిన హైకోర్టు అతనికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇది విన్న అనేకమంది నోరెళ్లబెట్టారు. ఎనిమిదేళ్లు అన్యాయంగా జైల్లో మగ్గితే కేవలం లక్ష రూపాయలేనా చెల్లించేది? ఇందులో ధర్మ సూక్ష్మమేమిటో సామాన్యులకు అంతుపట్టదు. దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులోనూ సుప్రీం కోర్టు 'ధర్మసూక్ష్మం' ఏమిటో తెలియడంలేదు. సుప్రీం కోర్టు ఏం చెప్పిందో అర్థం కాక అనేక పత్రికల్లో  ఈరోజు (6.4.17)  'జయలలితను దోషిగా ప్రకటించలేం' అని తీర్పు ఇచ్చినట్లు రాశారు. 

అసలు విషయం అంతుపట్టకపోవడంతో గందరగోళం ఏర్పడింది. జయలలితను నిర్దోషిగా కోర్టు ప్రకటించలేదు. అసలు విషయం ఏమిటంటే....దివంగత జయలలిత, ఆమె ప్రియ నేస్తం శశికళ ప్రధాన పాత్రధారులైన రూ.66 కోట్ల అక్రమాస్తుల కేసు విచారణ ఇరవై ఏళ్లు జరిగింది. దీని కథ అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు కర్నాటక హైకోర్టు తీర్పును కాదని ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ, జయ, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా నిర్థారించింది. అయితే విచారణ పూర్తయిన తరువాత తీర్పును వెంటనే వెలువరించకుండా దీర్ఘకాలం రిజర్వులో ఉంచింది.  చివరకు జయలలిత మరణించాక శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి సిద్ధమవుతున్న సమయంలో తీర్పు వెలువరించింది. దాంతో ఆమె నిరాశగా జైలుకు వెళ్లాల్సివచ్చింది. జయలలితను కూడా దోషిగా ప్రకటించినా ప్రత్యేక కోర్టు ఆమెకు విధించిన వంద కోట్ల జరిమానాను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ జరిమానా రద్దు చేయడం తగదని, తీర్పును మళ్లీ సమీక్షించాలని కర్నాటక ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసింది. కాని తాజాగా ఆ పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. 

జయ ఆస్తును జప్తు చేసి వందకోట్లు రికవరీ చేసుకోవడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఫిబ్రవరి 14న సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పుడు జయలలితను కూడా దోషిగానే పేర్కొన్నట్లు అన్ని పత్రికల్లో వచ్చింది. ప్రత్యేక కోర్టు తీర్పును యథాతథంగా సమర్ధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే జయలలిత చనిపోయినందువల్ల ఆమె గురించి ఇక విచారించేది ఏమీ లేదని స్పష్టం చేసింది.  బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పును యథాతథంగా సమర్థిస్తున్నామని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది కాబట్టి  దాని ప్రకారం జయ,శశి జైలు శిక్ష అనుభవించడంతో పాటు జరిమానాలు కట్టాల్సివుంది. జయలలిత వంద కోట్లు, శశికళ పది కోట్లు చెల్లించాలి. జయ చనిపోయారు కాబట్టి జైలు శిక్ష లేదు. కాని జరిమానా ఉంటుంది కదా. ఆమెను దోషిగా ప్రకటించినప్పుడు జరిమానా ఎందుకు రద్దు చేసిందో అర్థం కాదు.

జైలు శిక్ష అనుభవించేందుకు మనిషి సజీవంగా లేదు. జరిమానా వసూలు చేసుకునేందుకు ఏమైంది? దీనిపైనే కర్నాటక ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసింది. జయలలిత జీవించిలేరు కాబట్టి ఆమె జరిమాన సొమ్మును ఆమె ఆస్తులను వేలం వేయడం ద్వారా సమకూర్చుకొని కట్టాలని  తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీం ఆదేశించింది. ఇక చిన్నమ్మ  శశికళ పది కోట్లు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. చివరకు పెద్ద మొత్తంలో ఉన్న జయలలిత జరిమానా రద్దయిపోయి శశికళ జరిమానా మిగిలిపోయింది. జయ జరిమానా రద్దు చేయడంలో ధర్మసూక్ష్మం ఏమిటో...! జయకు దక్షిణ భారతమంతటా ఆస్తులున్నాయి. 

Readmore!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడివిట్‌ ప్రకారం ఆమె ఆస్తులు విలువ 117 కోట్లు. ఈ సంపదంతా శశికళ నటరాజన్‌కు దక్కిందట...! స్థిర, చర ఆస్తులన్నీ శశికళ చేతుల్లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ ఇంగ్లిష్‌ పత్రిక 'ది టెలిగ్రాఫ్‌' జయలలిత మరణించగానే ఓ కథనం ఇచ్చింది. జయలలితకు చెందిన  ఆస్తులకు శశిశళ, ఆమె కుటుంబ సభ్యులు వారసులని టెలిగ్రాఫ్‌ తెలియచేసింది. కాని జయ ఆస్తులకు సంబంధించి అసలు పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇంత ఆస్తులున్నప్పుడు సుప్రీం వందకోట్ల జరిమానా ఎందుకు రద్దు చేసినట్లు? జయ కేసుకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2.79 కోట్లు తమిళనాడు ప్రభుత్వం చెల్లిస్తుందేమో...!

Show comments