ఆ మాట నాన్నకు చెప్పు లోకేష్

ఎవరైనా ఏదైనా జనాలకు చెప్పేముందు వాళ్లు ఆచరించాలి అంటారు కదా? అందుకే ముందు మంత్రి లోకేష్ బాబు తన తండ్రి చంద్రబాబును మార్చుకోవాలి. నిన్నటికి నిన్న కాకినాడ సమీపంలోని గ్రామాల్లో జరిగిన సభల్లో లోకేష్ బాబు మాట్లాడుతూ జనాలకు ఓ పిలుపు నిచ్చారు. సాక్షిపత్రిక చదవడం అంటే సిగరెట్ కాల్చడం కంటే హానికరం అన్నారు. ప్రజల మద్య, కులాల మధ్య, మతాల మధ్య ఆ పత్రిక చిచ్చు పెడుతోందని ఆయన జనాలకు ఉద్భోధించారు. అందువల్ల ఆ పత్రికను చదవడం మానేయమన్నారు.

దీన్ని బట్టి సాక్షిని జనం చదవితే తమకు ఎంత ఇబ్బంది అన్నది లోకేష్ గమనించారనే అనుకోవాలి. సాక్షి చదవితే ప్రభుత్వం లొసుగులు జనాలకు తెలిసిపోతాయాని లోకేష్ భయపడుతున్నారు అనుకోవాలి. అందుకే ఆయన ఆ విధంగా జనాలకు పిలుపునివ్వడం ప్రారంభించారేమో? లేదా గతంలో వైఎస్ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను ఆ రెండు పత్రికలు అంటూ ప్రచారం సాగించినట్లే, లోకేష్ కూడా సాక్షిపై ప్రచారం స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది.

అంతవరకు బాగానే వుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సాక్షి పత్రికను చదువుతారన్నది అందరికీ తెలిసింది. ఆయన సాక్షిని చదువుతూ ఫొటోలకు చిక్కారు. మరి అలాంటపుడు రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రే సాక్షిని చదువుతుంటే, జనాలను చదవవద్దని చెప్పడం అంటే ఏమనుకోవాలి. అందువల్ల లోకేష్ బాబు ముందు తన తండ్రికి చెప్పి, ఆపై జనాలకు చెప్పడం బెటరేమో ?

అవును ఇంతకీ, ఇంత ప్రమాదకరమైన పత్రిక అని సాక్షి గురించి చెబుతున్న ఓ రాష్ట్రమంత్రి, మరి చట్టబద్దంగా దానిపై చర్యలు తీసుకోవచ్చుగా? ఇంత ప్రమాదకరమైన పత్రిక గురించి ప్రెస్ కౌన్సిల్ కు వెళ్లవచ్చుగా? మంత్రిగా అందుబాటులో వున్న చట్టబద్దమైన అవకాశాలు వదులుకుని, ఇలా జనాల్లో ప్రాపగండా చేయడం అంటే ఏమనుకోవాలి?

Show comments