అందరి దృష్టిని ఆకర్షించే సినిమా తీయాలే కానీ తెలుగు సినిమాకి కూడా వందల కోట్ల మార్కెట్ తీసుకురావచ్చునని 'బాహుబలి' చిత్రంతో రాజమౌళి నిరూపించాడు. కాకపోతే ఈ చిత్రం కోసం అయిదేళ్లకి పైగా రాజమౌళి, అతని బృందం కష్టపడ్డారు. ప్రభాస్ మరో సినిమానే చేయకుండా పూర్తి సమయాన్ని దీనికే కేటాయించాడు.
వర్కవుట్ అవుతుందా లేదా అనే లెక్కలు చూడకుండా నిర్మాతలు ధైర్యంగా ఖర్చు పెట్టేసారు. ఆ తర్వాత బాహుబలికి ఒక్కొక్కటీ కలిసొచ్చేసి నేషనల్ లెవల్ ప్రాజెక్ట్ అయిపోయింది. బడ్జెట్ లిమిట్, మార్కెట్ లిమిట్ అనేవి కేవలం అపోహలేనని, సినిమాకి ఎల్లలు లేవని దీంతో ప్రూవ్ అయింది. అయితే ఈ స్కేల్‌లో సినిమాలు తీయడానికి ఎవరూ సాహసించడం లేదు.
మగధీర తర్వాత అంతకుమించిన చిత్రాన్ని మళ్లీ రాజమౌళినే తీసాడు. మిగిలిన ఏ స్టార్ డైరెక్టర్ కనీసం ఆ దిశగా అటెంప్ట్ కూడా చేయడం లేదు. ఇది మన జోన్ కాదన్నట్టు ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడుతూ ఏడాదికో సినిమా తీస్తున్నారు. హీరోలు కూడా అయిదేళ్లు ఒకే సినిమాకి కేటాయించే సాహసానికి దిగలేకపోతున్నారు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయి పెరిగింది సరే, మళ్లీ ఆ స్థానాన్ని చేరుకునే సినిమాలు ఎంతమంది తీస్తారు? ఇది రాజమౌళి ఒక్కడి బాధ్యతేనా!