పవన్ ఫ్యాన్ హత్య: కమ్మ, కాపు గొడవేనా?

‘రాయల్’ ఈ మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలోని బలిజలు పెట్టుకుంటున్న ట్యాగ్ ఇది. తాము శ్రీకృష్ణ దేవరాయల వారసులం అని.. శ్రీకృష్ణ దేవరాయలు తమ కులం వ్యక్తే అని.. అంటూ బలిజలు “రాయల్’’ ను  తమ పేర్ల వెనుక చేర్చుకుంటూ వస్తున్నారు. గత పది, పదిహేనేళ్ల లో ఉత్సాహవంతులు తమ పేర్ల వెనుక ఈ ట్యాగ్ ను తగిలించుకుంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో రెడ్ల కు పేర్ల వెనుక ఆ చిహ్నం ఉంటుంది, ఇక కమ్మ వాళ్ల కు నాయుడు, చౌదరి ట్యాగ్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో జనాభా పరంగా, ఆర్థికంగా శక్తియుక్తులున్న బలిజలు తమకూ ఒక ట్యాగ్ ఉండాలనే తపనతో ఉన్నారు.

మరణించిన యువకుడు వినోద్ రాయల్. బలిజ యువకుడు. చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను ఆరాధ్యంగా చూడటం కూడా ఈ ప్రాంతంలోని ఈ సామాజికవర్గంలోని యువతకు బాగా ఇష్టమైన విషయం. ఇదే సమయంలో… పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసి ఉండవచ్చు గాక.. రాయలసీమ ప్రాంతంలోని కమ్మ వాళ్లు ఇప్పటికే “జనసేన’’ ను గేలే చేస్తారు తప్ప.. దాన్ని గుర్తించడానికి కూడా ఇష్టపడరని వేరే చెప్పనక్కర్లేదు. సినిమాల విషయంలో కానీ, రాజకీయంగా కానీ.. మెగా ఫ్యామిలీని ఏ రకంగానూ సమర్థించదు ఈ వర్గం. వీరి ఫేస్ బుక్ పోస్టులే దీనికి సాక్ష్యం.

హత్య కు గురైన యువకుడిది తిరుపతి అయినా.. హత్య జరిగింది కోలార్ ప్రాంతంలో. కోలార్ మాత్రమే కాదు.. రాయలసీమతో సరిహద్దును పంచుకునే కర్ణాటక లోని చాలా ప్రాంతంలో.. సామాజికంగా రాయలసీమ ప్రాంత పరిస్థితులే ఉంటాయి. బళ్లారి, కోలార్, బాగేపల్లి, చిక్ బళాపుర్ .. ఈ ప్రాంతాలు అధికారికంగా కర్ణాటకే కానీ సామాజికంగా రాయలసీమకూ ఇక్కడకూ పెద్ద తేడా ఉండదు. రాయలసీమలో ఏ కుల సమీకరణాలు ఉంటాయో.. ఈ కర్ణాటక లోని ఈ ప్రాంతాల్లో కూడా అవే పరిస్థితులు ఉంటాయి.

రెడ్డి, బలిజ, కమ్మ, బోయ, కురుబ..ఈ కులాల వాళ్లే ఇక్కడా, అక్కడా ప్రధానంగా ఉంటారు. వీరందరి వ్యవహారికం తెలుగే. తెలుగు రాజకీయాలు, తెలుగు సినిమాలే వీరి శ్వాస. ఇక్కడి పట్టింపులే అక్కడ కూడా. వలస వెళ్లిన వారూ అంతే, అక్కడే సెటిలయిన వాళ్లదీ అదే తీరు. ఇలాంటి నేపథ్యంలో.. కోలార్ ప్రాంతంలో కొనసాగుతున్న కుల పోరే.. వినోద్ రాయల్ హత్యకు దారి తీసిందని స్పష్టం అవుతోంది. అక్కడ కమ్మ, బలిజల ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందని స్పష్టం అవుతోంది. హతుడు, నిందితుడు ఆ రెండు సామాజికవర్గాలకు చెందిన వాళ్లు. ఆయా కులాలకు తగ్గట్టుగా వాళ్లిద్దరూ తమ తమ కులాలకు చెందిన హీరోలను అభిమానులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి పోరులో ఒకరి హత్య జరిగింది. 

ఇక్కడ సినీ అభిమానం హైలెట్ అయ్యింది. ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్లు  ఈ హత్య విషయంలో మారు మాట్లాడకపోవడాన్ని గమనించవచ్చు. వాళ్లు దీన్ని ఖండించనూ లేదు, తేలికగా కొట్టి పడేయనూ లేరు. దీనికి కారణం.. ఖండిస్తే అక్కడ కులానికి ఇబ్బంది, తేలికగా తీసేస్తే.. కాపులు ఓట్లు తెలుగుదేశానికి దూరం అవుతాయి! అందులోనూ ఈవ్యవహారంలో పవన్ జోక్యం చేసుకున్నాడు కాబట్టి.. ఎలా స్పందించినా రచ్చే అవుతుంది. అందుకే.. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి ఆ వర్గాలు. 

మరి ఈ వివాదం లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానంటున్న పవన్ లాబీ పనిచేస్తుందా? లేక మృతుడి కుటుంబీకుల ఆందోళన ఎవరికీ పట్టకుండా పోతుందా? వేచి చూడాలి. 

Show comments