400 కోట్ల రూపాయల 'దంగల్‌'.!

కమర్షియల్‌ సినిమా చేస్తేనే కాసుల పంట పండుతుందా.? హంగులు, ఆర్భాటాలుంటేనే వసూళ్ళు వస్తాయా.? స్టార్‌ హీరో అంటే కేవలం కమర్షియల్‌ సినిమాయేనా.? ఇలా రకరకాల ప్రశ్నలు ఎప్పటికప్పుడు తెరపైకొస్తూనే వుంటాయి.. సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతూనే వుంటాయి. కానీ, ప్రయోగాత్మక సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద కనకవర్షం కురిపించిన సందర్భాలున్నాయి. 

మరీ ముఖ్యంగా బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ ఎంచుకునే కథలు, ఆయన చేసే ప్రయోగాలూ ఎప్పటికప్పుడు వసూళ్ళ పంట పండించేస్తుంటాయి. మొన్న '3 ఇడియట్స్‌' సినిమా అయినా, ఇప్పుడుఏ 'దంగల్‌' సినిమా అయినా, మధ్యలో 'పికె' అయినా, ఇంకొకటయినా.. అమీర్‌ఖాన్‌ స్టార్‌డమ్‌ని విడిచి సాహసం చేయడంతో వచ్చినవే. 

'సుల్తాన్‌' సినిమా వచ్చేసింది, దాదాపు అదే లైన్‌లో మరో 'రెజ్లింగ్‌' మూవీ చేస్తే ఏం ఉపయోగం.? అన్న విమర్శలు వెల్లువెత్తిన వేళ, అమీర్‌ఖాన్‌ 'దంగల్‌' ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట పండాలంటే, సినిమాలో కంటెంట్‌ వుండాలి.. దానికి సరైన ప్రమోషన్‌ వుండాలి.. ఇవన్నీ 'దంగల్‌'కి బాగా సెట్‌ అయ్యాయి. అందుకే, 400 కోట్ల దిశగా 'దంగల్‌' దూసుకుపోతోంది. 

'నాకు నేనే పోటీ..' అంటూ స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి మరీ కెరీర్‌లో దూసుకుపోతున్న అమీర్‌ఖాన్‌ని ఈ విషయంలో ఎవరైనాసరే అభినందించి తీరాల్సిందే. ఇక, ఆ హీరో ఈ హీరో.. ఆ హీరోయిన్‌ ఈ హీరోయిన్‌.. అన్న తేడాలేకుండా, టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న అడ్డుగీతల్లేకుండా 'దంగల్‌' సినిమాకి ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించింది. ఓ మంచి సినిమా సూపర్‌ సక్సెస్‌ అవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి.?

Show comments