మోదీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన త‌లైవా

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయ ప్రవేశంపై త‌మిళ‌నాడు మాత్రమేకాదు యావ‌త్తు ద‌క్షిణాది ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న వేళ అభిమానుల‌తో సూప‌ర్‌స్టార్ స‌మావేశం అంద‌రి ధృష్టిని ఆక‌ర్శించింది. త‌న ఫ్యాన్స్‌తో భేటీ విష‌య‌మై అదిగో ఇదిగో అంటూ ఎన్నో రోజులు నుంచి ఊరిస్తూ వ‌స్తున్న త‌లైవా ఎట్ట‌కేల‌కు సోమ‌వారం చెన్నైలో వారితో క‌లిసి ముచ్చ‌టించారు గానీ అస‌లు విష‌యాన్ని మాత్రం తేల్చ‌కుండా మ‌ళ్లీ వాయిదా వేశారు. ఈ వేదిక మీదే ర‌జిని త‌న రాజ‌కీయ ప్ర‌వేశంపై నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ ఊహించినా దానిపై ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా నాన్చుడు ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారు. అయితే గ‌తంలో కంటే రాజ‌కీయాల‌పై సూప‌ర్‌స్టార్ ఒక క‌చ్చిత‌మైన‌ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్టు ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. 21 ఏళ్ల క్రితం ఒక రాజ‌కీయ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చి అతి పెద్ద పొర‌పాటు చేశాన‌ని భ‌విష్య‌త్తులో అలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌బోద‌ని చెప్ప‌డం ద్వారా ఇక‌పై ఏదో ఒక పార్టీకో..కూట‌మికో స‌పోర్ట్ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిపారేసి త‌న‌ను న‌మ్ముకున్న‌  బీజేపీ పార్టీ, ప్ర‌ధాని మోదీ ఆశ‌ల‌పై చ‌న్నీళ్లు చ‌ల్లాడు అరుణాచ‌లం.

యావ‌త్ భార‌తాన్ని ఒంటిచేత్తో ఏలుతున్న బీజేపీ ద్వ‌యం మోదీ, అమిత్‌షాకు త‌మిళ‌నాడు రాష్ట్రం మాత్రం అంద‌ని ద్రాక్షాగా మిగిలిపోతోంది. ఉత్త‌రాది మొత్తాన్ని గుత్తాగా పాలిస్తున్నా..ద‌క్షిణాదిలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ‌లంగా ఉన్నాత‌మిళ‌నాడులో మాత్రం బీజేపీ ఉనికి చాటుకోలేక‌పోతోంది. ఉత్త‌రాది హిందీ వాస‌న కూడా పొస‌గ‌ని త‌మిళులు ఆపార్టీని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే ర‌జినీ కాంత్ సాయంతో త‌మిళ‌గ‌డ్డ మీద ప‌ట్టు సాధించాల‌ని చూసిన బీజేపీ భావిస్తోంది. త‌మిళ జ‌న‌బాహుళ్యంలో తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్న త‌లైవాను బుట్ట‌లో వేసుకోవ‌డం ద్వారా అక్క‌డ పాగా వేయాల‌ని ఎత్తుగ‌డ‌లు వేసింది. అందుకే అడగకపోయినా హాజీ మ‌స్తాన్ సినిమా వివాదం విష‌యంలో ర‌జినీకి త‌మిళ‌నాడు బీజేపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అయినా కాషాయ‌పార్టీ గురించి క‌బాలి పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేడు. గ‌తంలో డీఎంకేకు మ‌ద్ద‌తివ్వ‌డం త‌న జీవితంలో రాజ‌కీయ ప్ర‌మాదంగా అభివ‌ర్ణించిన ర‌జినీ రాబోయే రోజుల్లో కూడా ఏ పార్టీకి మ‌ద్దతివ్వ‌న‌ని చెప్ప‌క‌నే చెప్పారు. దీంతో చోళ‌నాడులో త‌మ పార్టీ ప్రాభ‌వాన్ని పెంచే మ‌రో స్టార్‌ను వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి బీజేకి ఏర్ప‌డింది.

కాగా ర‌జినీకాంత్ రాజ‌కీయ జోక్యంపై కాస్త పైపైన చూస్తే ... 1996లో త‌మిళ‌నాడులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ర‌జినీకాంత్ క‌రుణానిధి డీఎంకేకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా జ‌య‌ల‌లిత క‌నుక తిరిగి ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రాన్ని ఇక దేవుడే ర‌క్షించాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆ ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ త‌ర‌వాత కొద్ది రోజులు సైలెంట్ అయిన ర‌జినీ  2002లో కావేరీ జ‌లాల అంశంపై ప్ర‌జాఉద్య‌మాన్ని ప్రారంభించాడు. దేశంలో న‌దుల అనుసంధానం చేయాల‌న్న ఆనాటి ఎన్డీఏ ప్ర‌భుత్వ ఆలోచ‌న న‌చ్చి దానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ఈ కార‌ణంగానే 2004 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌న వ్య‌తిరేకి జ‌య‌ల‌లిత  ఎన్డీఏతో పొత్తుపెట్టుకున్న‌ప్ప‌టికీ బీజేపీ,అన్నా డీఎంకే కూట‌మికి స‌పోర్ట్ చేశాడు. రాజ‌కీయాల్లో రాణించాలంటే స‌త్తా, ప్ర‌జాభిమానం ఉంటేనే స‌రిపోద‌ని స‌రైన స‌మ‌యం కూడా రావాల‌ని, అనుకూల టైం లేన‌ప్పుడు ఎన్ని ఉన్నా వృధా అని వ్యాఖ్యానించిన ర‌జిని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు మాత్రం దూరంగా ఉంటూనే వ‌స్తున్నాడు.

అయితే ఇప్ప‌డు జ‌య‌ల‌లిత మ‌ర‌ణం, అన్నాడీఎంకే అంత‌ర్గ‌త‌పోరుతో కుదేలు అవ‌డంతో రాష్ట్రంలో ఏర్ప‌డిన రాజ‌కీయ శూన్యాన్ని గ్ర‌హించి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని చూస్తున్నాడీ మాణిక్ భాషా.రాజ‌కీయాల్లోకంటూ వ‌స్తే కొత్త పార్టీ పెడ‌తాను త‌ప్ప మ‌రేదైనా పార్టీలో చేర‌బోన‌ని అభిమానుల‌ భేటీలో స్ప‌ష్టం చేశాడు. అయితే త‌మిళ‌నాడులో ప్ర‌స్తుత‌మున్న ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వాన్ని కేంద్రం కూల‌దోస్తే త‌ప్ప ఆ రాష్ట్రంలో 2021 దాకా ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు కాబ‌ట్టి త‌న రాజ‌కీయ ప్ర‌వేశంపై అంత తొంద‌ర‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌లైవా భావిస్తున్నాడు.కాగా ర‌జినీ క‌నుక త‌మిళ రాజ‌కీయాల్లో కాలుమోపితే అక్క‌డి రాజ‌కీయాలు మ‌రింత రంజుగా మార‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది.

Show comments