బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కాబట్టేనట

'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ 'వినోదపు పన్ను మినహాయింపు' ఎందుకు ఇచ్చింది.? అన్న ప్రశ్న చుట్టూ పెద్ద రచ్చే గతంలో జరిగింది. 

అయినాసరే, బావమరిది సినిమా కోసం చంద్రబాబు ఏమాత్రం వెనుకాడలేదు. అసలు ఇంకో ఆలోచనే చెయ్యలేదు. 'అడిగారు, ఇచ్చేశాం' అన్న ప్రాతిపదికన పని కానిచ్చేశారు. ఇప్పుడీ విషయం తాజాగా మరోమారు వివాదాస్పదమయ్యింది.

'తెలుగు జాతి ఆత్మగౌరవం..' అంటూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చుట్టూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అదొక కమర్షియల్‌ సినిమా. చేసిన ఖర్చుకంటే భారీగా అమ్మకాలు జరిగాయి. అలాంటి సినిమాకి, వినోదపు పన్ను రాయితీ ఏంటట.? అన్న చర్చ జరగడం సహజమే.

సాక్షాత్తూ మాజీ చీఫ్‌ సెక్రెటరీ, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు ఈ వినోదపు పన్ను మినహాయింపు అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే సమయంలో, 'బాహుబలి-2' సినిమా టిక్కెట్ల ధర పెంపుకి ప్రభుత్వం అనుమతివ్వడాన్నీ ప్రశ్నించారాయన.

నిజానికి, రెండు తెలుగు రాష్ట్రాలూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకి వినోదపు పన్ను రాయితీనిచ్చేశాయి. ఈ రెండు రాష్ట్రాలూ 'బాహుబలి-2' సినిమా టిక్కెట్ల ధరని పెంచుకోవడానికి అనుమతినిచ్చేశాయి. తెరవెనుక ఏం 'కథ' నడిచిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఈ రెండు సినిమాల వెనుక చాలా చాలా పెద్ద తలకాయలున్నాయన్నదే ఆ సీక్రెట్‌.

తాజాగా, టీడీపీ నేత ఒకరు ఓ న్యూస్‌ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో, ముఖ్యమంత్రి బావమరిది పైగా టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ సినిమాకి వినోదపు పన్ను మినహాయిస్తే, ప్రభుత్వంలో వున్న వ్యక్తి ఐవీఆర్‌ కృష్ణారావు ఆక్షేపణ వ్యక్తం చేయడమేంటని ప్రశ్నించేశారు. అద్గదీ అసలు విషయం.

బాలకృష్ణ, చంద్రబాబు బావమరిది పైగా టీడీపీ ఎమ్మెల్యే కాబట్టే 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకి వినోదపు పన్ను మినహాయింపు లభించిందన్నమాట. తెలంగాణలో టీడీపీతో టీఆర్‌ఎస్‌కి రాజకీయ వైరం వున్నా, బాలకృష్ణ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రత్యేకమైన అభిమానం. అలా తెలంగాణలోనూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకి 'మేలు' జరిగిందన్నమాట. 

ఏమిటీ అన్యాయం.? అని ప్రశ్నించినందుకు ఐవైఆర్‌ కృష్ణారావు పదవి కోల్పోయారు.

Show comments