ఎమ్బీయస్‌: పవన్‌ చేస్తున్నదేమిటి?

శుక్రవారం పవన్‌ కళ్యాణ్‌ ఏం చెప్పారో వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, చర్చల ద్వారా టీవీలు హోరెత్తించాయి. ఇవాళ పేపర్లు ఫుల్‌ పేజీ కవరేజితో మోతెక్కించాయి. చెప్పినది సరే, యింతకీ ఆయన ఏం చేయబోతున్నాడో మాత్రం నా కర్థం కాలేదు. జనసేన ప్రతినిథి ఒకాయన శుక్రవారం ఉదయం ఓ టీవీ చర్చలోకి ఫోన్‌ లైన్‌-యిన్‌లోకి వచ్చి 'మేం కాకినాడ సభలో కార్యాచరణ ప్రకటించబోతున్నాం' అని చెప్పారు. కాకినాడలో సభ జరగబోతుందని తిరుపతిలో ప్రకటించినట్లు మరో చోట యింకో సభ జరగబోతుందని ప్రకటించి, అదే కార్యాచరణ అంటారా, లేక మరేదైనా చెప్తారా అని ఎదురు చూశాను.  కార్యాచరణ కాదు కదా, తర్వాతి సభ గురించైనా చెప్పలేదు. ప్రభుత్వవైఖరిని వ్యతిరేకించేవాళ్లు కార్యాచరణ అన్నారంటే నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు, ర్యాలీలు, ప్రదర్శనలు, బంద్‌లు, అధమపక్షం చర్చాసదస్సులు వుంటాయి. పవన్‌ వీటిలో దేన్నీ ప్రకటించకపోవడానికి కారణం ఏమిటి? ఢిల్లీ నుంచి గాని, అమరావతి నుండి గాని ఏదైనా ఒత్తిడి వచ్చిందా? తెలియదు. తెలుసుకునే మార్గమూ లేదు. ఎవరి పాటికి వారు వూహించుకోవాల్సిందే.

కేంద్రం, ఉత్తరాదివారి అహంకారం అంటూ విరుచుకుపడిన పవన్‌ కేంద్రానికి ప్రతినిథి వెంకయ్య నాయుడు అన్నట్లు ఆయనపై ఉరిమారు. వెంకయ్య నాయుడు ఉత్తరాది వారు కారు. ఇక కేంద్ర కాబినెట్‌లో ఆయన మాట ఏ మేరకు చెల్లుబాటు అవుతుందో తెలుసుకునే దాఖలాలు లేవు. ఈ రోజు దేశంలో అత్యంత శక్తిమంతుడు మోదీయే. ఆయనపై అంకుశం మోపడానికి అవకాశమున్నది బిజెపి పార్టీ ఒక్కదానికే. కానీ దాని అధ్యక్షుడూ మోదీ జేబులో మనిషే. మంత్రివర్గంలో వున్న ఏ సహచరుడూ మోదీతో విభేదించడం మాట అటుంచి, చర్చించేవాడు కూడా లేడంటారు. తన శాఖల్లోని అధికారులను నియమించే వెసులుబాటు కూడా వాళ్లకు లేదుట. ఇందిర హయాంలో ఎలా వుండేదో, సేమ్‌ టు సేమ్‌, యిప్పుడలాగే వుందిట. అన్నిటికీ 'ట', 'ట' అని రాయడం దేనికంటె యిలా ఏకపక్షంగా పాలన సాగే రోజుల్లో ఎవరూ బహిరంగంగా పెదవి విప్పరు. మోదీ బలహీనపడ్డాకనే యిలాటివి బయటకు వస్తాయి. మోదీ తలచుకుంటే ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ కాదు ఏదైనా సరే గంటల్లో గుద్దుకుంటూ వచ్చేసేది. తలచుకోలేదు కాబట్టేే ఆంధ్ర యిలా అల్లాడుతోందని అందరికీ తెలుసు. పవన్‌ ఏదైనా అనదలచుకుంటే మోదీని అనాలి. ఆయనకు గొడుగు పట్టి, పక్కవాయిద్యాలపై దరువేస్తే లాభం ఏముంది? కాంగ్రెసుది వెన్నుపోటు, బిజెపిది పొట్టలో పోటు అన్నపుడు కూడా అది బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షాకు తగులుతుంది తప్ప, మోదీకి నేరుగా తగలదు. 

అమరావతి ప్రమేయం గురించి సందేహం ఎందుకంటే 'నాకు టిడిపి ప్రభుత్వంపై గౌరవం వుంది' అంటూ పవన్‌ చంద్రబాబు చుట్టూ కూడా రక్షణ వలయం కట్టేశారు. కొందరు టిడిపి ఎంపీలను మాత్రం తిట్టారు, వాళ్లు రాష్ట్రప్రభుత్వంలో భాగం కాదనుకున్నారేమో! చంద్రబాబును ఏమీ అనకపోవడం కూడా హేతుబద్ధంగా లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మాజీ ప్రధాని యిచ్చిన హామీ, కాంగ్రెసు ముష్టి ఐదేళ్లంది, మేం పదిహేనేళ్లు సాధిస్తాం చూడండి అంటూ చంద్రబాబు ఎన్నికల సభల్లో పదేపదే వాగ్దానం చేశారు. ఏవో మొహమాటాలకు పోయి ఆ హోదాపై యీయన మాట నాన్చితే నష్టం ఎవరికి? ఆయనకు కాదు, రాష్ట్రప్రజలకు! 14 వ ఆర్థిక సంఘం చెప్పింది కాబట్టి... అని జేట్లీ చెపుతూంటే 'మీరు అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల తర్వాత వచ్చిన సంఘం సాకుగా చూపిస్తారేమిటి? అయినా వద్దని అది చెప్పలేదు కదా, చెప్పినా ఆ సిఫార్సు మీరు పట్టించుకోనక్కరలేదు కదా, తక్కిన రాష్ట్రాలకు కొనసాగుతోంది కదా' అని బాబు అడగవద్దా? ఒకసారి హోదా కావాలని, మరోసారి సంజీవని కాదని, యింకోసారి యిస్తే వద్దననని, యిస్తే బాగానే వుంటుంది కానీ, యివ్వకపోతే మనమేం చేస్తాం? అనీ యిలా మాట్లాడుతూంటే యిదెక్కడి అన్యాయం అని పవన్‌ అడగవద్దా? ' కేంద్రం తానుగా ఇవ్వాల్సింది, కానీ యివ్వకపోయినా సర్దుకుంటాం' అంటే రేపు ప్రజల కూడా కట్టాల్సిన పన్నులు కట్టం, సర్దుకోండి అనవచ్చు. మన నియోజకవర్గ ప్రయోజనాల గురించి పోరాడని ఎమ్మెల్యేనే ఛీత్కరిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడని ముఖ్యమంత్రిని కనీసం నిలదీయవద్దా? కేంద్రమంత్రిగా వుంటూ కూడా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీలో యిప్పించలేకపోతున్నాడని సంజీవరెడ్డి విగ్రహాన్ని పడగొట్టారు ఆంధ్రులు. ఉక్కు ఫ్యాక్టరీ ఒక ప్రతిపాదన మాత్రమే. దానికే అంత రియాక్షనుంటే మరి యిప్పుడు పార్లమెంటు సాక్షిగా యిచ్చిన హామీకి విలువ లేకుండా చేయడమేమిటని ఆంధ్రుల తరఫున అడగని ముఖ్యమంత్రిని ఏమనాలి? 

'అడక్కపోవడమేం, నేను ఢిల్లీ పాతికసార్లు వెళ్లాను' అంటారు చంద్రబాబు. అప్పుడెందుకు వెళ్లారో ఏమో కానీ మొన్న ఏదో జరిగిపోతోంది అని హడావుడి జరిగినప్పుడు వెళ్లవచ్చుగా! పుష్కరాల పిలుపుల కోసం స్పెషల్‌ విమానాల్లో వెళ్లినాయన ప్రత్యేక హోదా మరియు లేదా ప్రత్యేక ప్యాకేజీ గురించి తేల్చే తరుణంలో అక్కడకు వెళ్లద్దా? సుజనా చౌదరి మీద వదిలేయడ మేమిటి? సహాయ మంత్రిగా వున్న ఆయన తన కంటె సీనియర్లయిన జేట్లీనీ, వెంకయ్య నాయుణ్నీ కాదనగలడా? ఇలా అయితే కుదరదంటూ గద్దించగలడా? ఆయన మీద ఆర్థిక నేరాల గురించిన కేసులున్నాయి, అటు జేట్లీ ఆర్థికమంత్రి. తను నిప్పు అంటూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడే చంద్రబాబు స్వరం ఆయన అరువు తీసుకోగలడా? బాబే స్వయంగా వెళ్లి ''ఇప్పటికే చాలా ఏళ్లగా యివే నాటకాలూ ఆడుతూ వచ్చాం, సుజనా చౌదరి ఏదో తీపి కబురంటూ చెప్పడం, దానికి కంభంపాటి రేపో ఎల్లుండో అంటూ వంత పాడడం, వెంకయ్య నాయుడు మా ప్రతిభే అనడం, అదే అదనుగా మేమేమో 'మేం హోదాతో బాటు ప్యాకేజీ కూడా తెస్తూ వుంటే యిదిగో యీ కాంగ్రెసు, వైకాపా అడ్డుపడుతున్నాయి' అంటూ వాళ్లమీద నిష్టూరాలు వేయడం, చివరకు మీరు తుస్సుమనిపించడం..! మీరు హిందీలో ఏమంటారో గానీ మా తెలుగులో 'పాడిందే పాటరా పాచిపళ్ల దాసరీ' అంటారు యిలాటి దాన్ని. మేమిక దాసరి వేషం కట్టలేం. మేము జిల్లాకు 350 కోట్లడిగితే ఆ అంకె మాత్రం గుర్తు పెట్టుకుని అది యిచ్చి 7 జిల్లాలకు అదే అన్నారు. ఓ ఎంపీని కొనుక్కోవాలంటే 50 కోట్లు చాలటం లేదు, అలాటిది జిల్లా మొత్తానికి ఏభై అంటే ఏమొస్తుందండీ. పోనీ తెలంగాణ లాగ మేమూ జిల్లాలను విడగొట్టి, ఆ ఏడును పధ్నాలుగు చేస్తే అప్పుడు జిల్లాకు 50 చొప్పున యిస్తారా? లేక 'ఏడు కాదు మీరేం ఏడుపు ఏడిచినా ఆ మూడువందల ఏభైలోనే ఏడవాల'ంటారా? అయినా ఐఐటి, ఐఐఎమ్‌ల కిచ్చినది కూడా మాకు ప్రత్యేకంగా యిచ్చినట్లు చెపితే ఎలాగండి? అన్ని రాష్ట్రాలలోని అలాటి విద్యాసంస్థలకు మీరు యిచ్చేదే కదా! రెవెన్యూ లోటు కూడా మరో 11 రాష్ట్రాలతో బాటు మాకూ చేశారు. పోలవరం సంగతి కూడా విభజన చట్టంలోనే వుంది కదా! దానిలో పరిశీలిస్తానన్న వైజాగ్‌ రైల్వే జోనైనా విదిలించడానికి ఏం పోయేకాలం? ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన నాకు యివన్నీ తెలియనివా? మీరు నన్ను మభ్యపెట్టలేరు.'' అని దబాయించవద్దా? ఎందుకు దబాయించలేదని పవన్‌ ఆయన్ను దబాయించవద్దా?

''అందాల రాముడు'' సినిమాలో అల్లు రామలింగయ్యది తీ(సేసిన) తా(సిల్దారు) పాత్ర. పట్టిసీమలో దిగి తనను కలవడానికి వచ్చిన రైతు మీద విరుచుకుపడతాడు 'ఏవోయ్‌ౖ! సుబ్బులూ - ఎదర గోదారి మేటేసి లంకకట్టి రెండేళ్లయిందని నాకు తెలీదనుకున్నావా - లేపోతే నీబాబు గాడి సొమ్మనుకున్నావా? పొగాకేసుకుని మింగడానికి..'' అని. అతను ''అమ్మమ్మ, ఎంత మాట బాబూ, తవరికి తెలీకుండా, అజలోకి రాకుండా లంకమీద పొగాకు ఏసుకోడమా? ఏదీ ఏసి చూశాను బాబూ! బావుంటే తవరికి సూపిద్దామని..'' అంటూ ఓ పొగాకు బుట్ట అందిస్తూ దాని మధ్యలో లంచం యిస్తాడు. ఇతను చల్లబడి ''ఇదిగో నువ్వు బాగుపడటమే నాకు కావాలిసింది. రూలు ప్రకారం మేం అడుగుతాం.. నువ్వు చెబుతావ్‌ - మేం రాసుకుంటాం.. మిగతావన్నీ యిక అనవసరం..'' అంటూ తేల్చేస్తాడు. ఇప్పుడు ఆంధ్రకు ప్రత్యేక హోదా, ప్యాకేజీ వ్యవహారం కూడా యిలాగే నడుస్తోంది. టిడిపి వాళ్లు ఏదో అడిగేసినట్లు, బిజెపి వాళ్లు యివ్వబోతున్నట్లు, యిప్పటికే చాలా యిచ్చేసినట్లు తెగ నటించేస్తూ వుంటారు. మళ్లీ అంతలోనే వాళ్లేమీ యివ్వలేదని టిడిపి అంటుంది. రూలు ప్రకారం యివ్వాల్సినదానిలో ఎంత యిచ్చారో, యిచ్చిన దానికి లెక్కలు అప్పచెప్పలేదని కేంద్రం చేస్తున్న క్లెయిమ్‌ ఎంతవరకు కరక్టో, శ్వేతపత్రం విడుదల చేయమంటే చేయరు. పదవీకాలంలో సగకాలం యిలాగే సాగిపోయింది. రాష్ట్రానికి దిక్కూదివాణం వున్నట్టు తోచటం లేదు.

ఇలా నడుస్తూండగానే యీ సారి టూ మచ్‌ అయిపోయింది. విభజన చట్టంలో వున్నవి కొన్ని విదిల్చి, ఏదో యిచ్చేశామని కేంద్రం పోజు కొట్టడమేమిటి? ఔనౌను అంటూ చంద్రబాబు స్వాగతించడం, ఆంధ్ర బిజెపి లీడర్లు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌, జేట్లీ, మోదీలకు సన్మానం చేయడమేమిటి? అబ్బే మేం చేసిందేముందండి అనకుండా నిస్సిగ్గుగా వాళ్లు చేయించేసుకోవడ మేమిటి? విభజన చట్టప్రకారం యివ్వవలసినది కూడా రెండున్నరేళ్లగా యివ్వకుండా, యిప్పుడు కూడా యిస్తాంలే అని ప్రకటన చేసినంత మాత్రాన సత్కారాలు చేయాలా? అలా అయితే ప్రతి నెలా జీతాలు యిచ్చినప్పుడల్లా ఆ శాఖాధిపతులు కూడా సత్కారాలు చేయించుకోవాలి. హోదా గురించి గతంలో తాను చెప్పినదంతా మర్చిపోయి, బాబు శాసనమండలిలో 'హోదా వేస్టు, అది తీసుకున్నవాళ్లెవరూ బాగుపడలేదు' అంటూ ప్రకటించడమేమిటి? హోదా అంత పనికిమాలినదైతే పొరుగు రాష్ట్రాలు ఆంధ్రను చూసి ఉలిక్కిపడి అడ్డుపడడం దేనికి? బిహార్‌ కూడా హోదా అడగడం దేనికి? 'హోదా వలన పరిశ్రమలకు లాభం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని గతంలో చెప్పిన విషయం అబద్ధం, మిమ్మల్ని మోసగించాను' అని కూడా బాబు చేర్చేస్తే సరిపోయేది కదా! 

ఇవి ఎప్పుడూ చెప్పుకునే విషయాలే, యీసారి స్పెషలేమిటంటే పవన్‌ కళ్యాణ్‌ అతిథి పాత్ర. సినిమాల్లో అయితే యిలాటి పాత్రను ఎలా వర్ణించాలి? అడుగుతా, అడుగుతా, లేస్తే మనిషిని కాను అంటుంది, మళ్లీ వెళ్లి పడుక్కుంటుంది (సారీ ధ్యానం చేస్తుంది), ఆర్నెల్లకో, పదినెల్లకో ఓసారి వచ్చి గర్జించి, డైలాగులు కొట్టి మళ్లీ బబ్బుంటుంది. ఇది హీరోయిజం కాదు, హీరోయినిజమూ కాదు (ఎందుకంటే హీరోయిన్‌ కనబడినపుడు ఆహ్లాదంగా ప్రవర్తిస్తుంది తప్ప హెచ్చరికలు చేయదు), ఐటమ్‌ గర్లిజమూ కాదు (ఐటమ్‌ గర్ల్‌ డైలాగులు కొట్టదు, మాటిమాటికీ రాదు), సీనియర్‌ నటుడు వేసే అతిథి పాత్రకు కాస్త దగ్గరగా వస్తుంది, ఎందుకంటే వాళ్లు ఉన్న కాస్సేపటిలో తెగ ఓవరాక్షన్‌ చేస్తారు. సరిగ్గా చెప్పాలంటే ఓ సినిమాలో టీవీలో నేరాలు-ఘోరాలు చెప్పే టీవీ యాంకర్‌ అప్పుడప్పుడు కనబడి హెచ్చరికలు చేస్తూంటాడు, అలాటి పాత్ర వేస్తున్నారు పవన్‌. నిజానికి యీయన రాజకీయాల్లోకి వస్తానన్నపుడు నేనెంతో ఆశ పెట్టుకున్నాను, యువతరానికి కదిలించగల సత్తా వున్నవాడని. అప్పటి నా ఆర్టికలు మళ్లీ చదువుకుంటే నాకే సిగ్గేసింది, యింతమందిని చూసి కూడా యితని విషయంలో ఎలా బోల్తా పడ్డానా అని. నిన్న మీటింగులో కూడా చూడండి, జనాలను ఎలా ఉర్రూతలూగించాడో, అంతా చేసి చివరకు క్లయిమాక్సు లేకుండా చప్పగా ముగించాడు. 'మాట తప్పేవారిని జనమే నిలదీయాలి' అంటాడు. జనం మాట సరే, జనసేన మాటేమిటి? నిలదీయడానికి జనం కుతూహలంగా వున్నారు. కానీ వారికి సరైన నాయకుడేడీ? ప్రజల్లో అసంతృప్తిని ఛానెలైజ్‌ చేసే సత్తా ప్రతిపక్ష నాయకుడికి కొరవడింది. ఈయన లాటి వాడు మార్గనిర్దేశం చేయాలి. 'బంద్‌కు వ్యతిరేకం కాదు' అంటూనే 'పాల్గొనడం, పాల్గొనకపోవడం మీ యిష్టం' అంటూ అస్పష్టంగా మాట్లాడడమేమిటి? నాయకుడన్నవాడు ఇదీ దారి అని చెప్పాలి. 

అసలు పవన్‌ వ్యవహారమే అనుమానస్పదంగా నడుస్తోంది. రాజధాని భూముల గురించి ఊళ్లల్లో ఒకటి మాట్లాడతాడు, హైదరాబాదు వచ్చి మరోటి మాట్లాడతాడు. ఈ మధ్యే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏమీ చెప్పటం లేదు, అడగడానికి సమయం కోసం ఆగుతున్నానన్నాడు. ఇంకో రెండున్నరేళ్లల్లో సర్కారు దిగిపోయాక అడుగుతాడా అనిపించింది. ఉపన్యాసాల్లో ఎప్పుడో చచ్చిపోయిన కాంగ్రెసును తిడతాడు. ప్రతిపక్షం సరిగ్గా లేదంటాడు. ఉంటే నీ మీటింగుకి అంతమంది ఎందుకు వస్తారు? ప్రజల్లో నిరాశ అలుముకుంది. వాళ్లను ఎవరు గట్టెక్కిస్తారా అని చూస్తున్నారు. నువ్వు ఆశ చూపుతున్నావు. అంతలోనే గందరగోళంగా మాట్లాడతావు. 'ఓట్లు అడగడానికి వచ్చినపుడు అర్థమయ్యే భాషలో, ఎన్నికయ్యాక అర్థంకాని భాషలో మాట్లాడతార'ని యితర నాయకుల గురించి అన్నది పవన్‌కీ వర్తిస్తుంది. హోదా యివ్వం మొర్రో అని అన్ని భాషల్లో కేంద్రనాయకులు చెప్తూ వుంటే 'ఇస్తాం, యివ్వం ఏదో ఒకటి చెప్పండి. ఇవ్వం అని చెబితే, ఏం  చేయాలో అది చేస్తాం' అనడంలో అర్థముందా? ఇవ్వమని వాళ్లు కుండ మాటిమాటికీ బద్దలు కొడుతూనే వున్నారు. మీ పాటికి మీరు ఏం చేయాలో అది చేస్తారా? లేదా? చేస్తే ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? దాని గురించి చెప్పకుండా వేదిక దిగిపోతే ఎలా? ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్‌ గుర్తింపు వుంది. కానీ ఎన్నికలలో పోటీ చేయదు. ఆఫీస్‌ బేరర్స్‌ ఎవరూ కనబడరు, వినబడరు. అధికార ప్రతినిథి ఎవరూ మాట్లాడరు. ఈయన మాత్రం ఏడాది కోసారి ప్రత్యక్షమై డైలాగులు కొట్టేసి, రాజకీయ తెర వెనక్కి వెళ్లిపోయి, సినిమా తెర ఎక్కేస్తాడు. 

అసలు ప్రస్తుతం అధికారంలో వున్నవాళ్లని నిలదీయకుండా గతం తవ్వితే ఏం లాభం? నిన్న మీటింగులో కూడా కొందరు టిడిపి ఎంపీలను తప్ప టిడిపి విధానాన్ని, యిప్పటిదాకా చూపిన అసమర్థతను విమర్శించలేదు. బిజెపిని సమాధి చేశారని ఆంధ్ర బిజెపి నాయకులను తిట్టాడు. చేసుకుంటే చేసుకుంటారు, వాళ్ల పార్టీ వాళ్ల యిష్టం. బిజెపి ఆంధ్ర యూనిట్‌ మూతపడితే యీయన కెందుకు ఖేదం? ఆయన బిజెపిని తిట్టడమే పెద్ద ఎఛీవ్‌మెంట్‌లా నిన్నంతా టీవీల్లో చర్చలు. తిట్టి ఏం చేశాడన్నది ముఖ్యం. బిజెపి సభలను బహిష్కరించమని పిలుపు నిచ్చాడా? ఆ నాయకుల యిళ్ల వద్దకు వెళ్లి హోదా గురించి శాంతియుత ప్రదర్శనలు చేయమన్నాడా? పోనీ టిడిపి నాయకులకు ఫలానా తారీకులోగా చేయండి, లేకపోతే... అనే అల్టిమేటమ్‌ యిచ్చాడా? ప్రశ్నిస్తానన్నావ్‌ ఏం చేశావ్‌ అని ప్రజలు తనను ప్రశ్నించే సమయం వచ్చేసరికి పవన్‌ బయటకు వచ్చి నాలుగు ప్రశ్నలేసి యోగధ్యానంలోకి వెళ్లిపోయాడు. తన అసంపూర్తి ప్రణాళికకు యిలాటి స్పందన వస్తుందని పవన్‌కు తెలియదంటే నేను నమ్మను. ఆయన చిన్నప్పటినుంచి రకరకాల పుస్తకాలు చదివే రకమనీ, ఆలోచించే వ్యక్తి అని అందరూ చెప్తున్నారు. చిరంజీవిలో ఒక అమాయకత్వం, తెలియనితనం కనబడుతుంది. ఆయన సినిమా కథలను కూడా నాగుబాబు వినేవారట. పవన్‌ చిరంజీవి కంటె ఎక్కువ ఆలోచనాపరుడు, మెరుగైన వక్త. చిరంజీవి రాజకీయాల్లో చాలా తప్పటడుగులు వేసినది, అజ్ఞానం చేతనే అనిపిస్తుంది. కానీ పవన్‌కి అన్నీ తెలిసే యీ విధంగా ప్రవర్తిస్తున్నాడని తోస్తుంది. ఆయన కేదో ఎజెండా వుంది. మధ్యమధ్యలో వచ్చి తనపై ఫోకస్‌ తిప్పుకుని ప్రజల్ని వెర్రిగొఱ్ఱెలను చేయడం అందులో భాగమే. తర్వాతి ఎన్నికల వేళ గొఱ్ఱెల కాపరి అవతారం ఎత్తి యీ గొఱ్ఱెలను ఎటు మళ్లిస్తాడో చూడాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

mbsprasad@gmail.com

Show comments