టీవీ సీరియల్స్‌లో మితిమీరిన హింస

వివిధ టీవీ ఛానల్స్‌లో ప్రసారమవుతున్న సీరియర్స్‌లో మహిళలకు సంబంధించి భయంకరమైన రీతిలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఆడపిల్లలు విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ సీరియల్స్‌లో హీరోయిన్లే విలన్లుగా నటించడంతో పాటు చిన్న పిల్లలు, పెళ్ళి కావల్సిన పిల్లలకు ఎవరిని ఎలా చంపాలో, అత్తగారిని కోడలు ఎలా చూడాలి? కోడలను అత్తగారెలా చంపాలో చేసి చూపిరచి, సమాజానికి నేర్పుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియల్స్‌కు సెన్సార్‌ బోర్డు అంటూ అమల్లో ఉందా? అని ఆమె కాకినాడలో జరిగిన ఓ సమావేశంలో ప్రశ్నించారు. ఇటువంటి సీరియల్స్‌ నిరోధానికి త్వరలో రాష్ట్ర మహిళా కమీషన్‌ ఓ తీర్మానం చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

సినిమాల్లో విలన్లను మించిపోయిన విధంగా టీవీ సిరియల్స్‌లో ఆడ విలన్లు మారారన్నారు. సీరియల్స్‌లో వివిధ సన్నివేశాలు కుట్రతో నిండిపోయి, సమాజం నాశనం అయ్యే విధంగాను, మహిళల్లో ఇంతటి ద్వేషం ఉంటుందా? అన్న అంశాన్ని సమాజానికి చెప్పే విధంగాను సీరియల్స్‌ను చిత్రీకరిస్తున్నారని వాపోయారు. మనకు సంవత్సరాల తరబడి ప్రసారమయ్యే సీరియల్స్‌ కూడా ఉన్నాయన్నారు. పెళ్ళి కావాల్సిన పిల్లలతో వివిధ రకాల వేషాలు వేయిస్తూ హత్యలను ప్రోత్సహించే రీతిలో సీరియల్స్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని ఏ విధంగా చంపాలో, ఏ విధంగా కాల్చాలో, ఏ విధంగా నాశనం చేయాలో సీరియల్స్‌ను చూసి నేర్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో చివరికి పశ్చాత్తాపం చెందినట్టు చూపుతారని, టీవీ సీరియల్స్‌లో కనీసం ఆది కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో జరుగుతున్న గొప్ప గొప్ప సంఘటలను టీవీలలో చూపిస్తున్నారని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే టీవీ ఛానెళ్ళు మంచి కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు కృషి చేయాలని రాజకుమారి హితవు పలికారు.

Show comments