మిత్రుడైనా అష్టకష్టాలు తప్పని బాబు...!

'వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు'...అనే నానుడి ఉంది. ఎవరైనా మన దగ్గరకొచ్చి ఫలాన ఆఫీసులో ఫలాన పని కావడంలేదని అన్నడనుకోండి 'ఏం భయపడకు. అక్కడ మన ఫ్రెండున్నాడు. పనైపోతుంది' అంటుంటాం. మామూలోళ్లకు మనోడంటూ ఉంటే పనులు తొందరగా అవుతాయి. కాని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రంలో అనేకమంది 'మనోళ్లు' ఉన్నా పనులు చేయించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ వగైరా పెద్ద తలకాయలంతా జిగ్రీ దోస్తులు.

ఏపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని బాబు అనేకసార్లు చెప్పారు. 'చంద్రబాబు మాకు సహజ మిత్రుడు' అని మోదీ ఆకాశానికెత్తేశారు. వెంకయ్య నాయుడు 'ఏపీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం' అన్నారు. ఇలా అన్నవారు ఏపీకి సంబంధించిన పనులు జాప్యం చేయకుండా చేసిపెట్టాలి కదా. కాని బాబును అష్టకష్టాలు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారు. కేంద్రంలో చంద్రబాబు భాగస్వామి, మిత్రుడు అయినప్పటికీ బయటివారికంటే ఎక్కువగా లాబీయింగ్‌ చేయాల్సివస్తోంది. 

అందరూ కలిసి ప్రత్యేక హోదా పుట్టి ముంచిన తరువాత ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అని పేరు పెట్టిన ప్రత్యేక ఆర్థిక సాయం వంతు వచ్చింది. కేంద్రం దీన్ని మటాష్‌ చేస్తుందేమోనని బాబు యమ భయపడిపోతున్నారు. ఈ ప్యాకేజీకి ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించని సంగతి తెలిసిందే. ఈ విషయంలో జాప్యం జరుగుతున్నకొద్దీ బాబుకు టెన్షన్‌ పెరుగుతోంది. ప్రత్యేక హోదాపై ఏవో మాయ మాటలు చెప్పి నెట్టుకొస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేయకపోయినా మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకపోతే ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కే.

తాజాగా జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలోనూ ప్రత్యేక ప్యాకేజీ విషయం ప్రస్తావించి దానికి చట్టబద్ధత సాధించే విషయంలో ఎంపీలు  గట్టిగా పట్టుబట్టాలని ఆదేశించారు. సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజుకూ ప్రత్యేకంగా చెప్పారు. ఇప్పటికి రెండు కేబినెట్‌ సమావేశాల్లోనూ ప్రతిపాదన పెట్టినా పని కాలేదు. మొన్నీమధ్య జరిగిన కేబినెట్‌ సమావేశంలోనే తప్పక ఆమోదముద్ర పడుతుందని అనుకున్నారు. కాని ప్రధానికి అర్జంటు పనిబడి వెళ్లిపోయారట...! 

కాని అసలు కారణం అది కాదని, చట్టబద్ధత ప్రతిపాదనకు సంబంధించిన హిందీ ప్రతి కేబినెట్‌ భేటీకి అందలేదని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఈ సిల్లీ కారణం చెబితే జనం నవ్వుతారని ప్రధానికి అర్జంటు పనులుండి వెళ్లిపోయారని ప్రచారం చేస్తున్నారు. కేబినెట్‌ మీటింగ్‌ చాలా రోజుల ముందుగానే నిర్ణయమవుతుంది. అలాంటప్పుడు ప్రధాని వేరే పనులు ఎందుకు పెట్టుకుంటారు? ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని 2016 సెప్టెంబరు మొదటివారంలో ప్రకటించినా ఇప్పటిరకు చట్టబద్ధత కల్పించలేదంటే కేంద్రానికి బాబు పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్యాకేజీ ప్రకటించినప్పటినుంచి దానికి చట్టబద్ధత కల్పించాలని బాబు అడుగుతూనే ఉన్నారు. స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన కరువే. బాబుకు ఇష్టుడైన కేంద్ర మంత్రి సుజనా చౌదరి 'ఫిబ్రవరి 15నాటికి చట్టబద్ధత సాధిస్తాం' అని జనవరి 30న చెప్పారు. కాని పని కాలేదు. ఇప్పుడు మార్చి ఒకటో తేదీ అంటున్నారు. హోదా విషయంలోనూ ఇలాగే అనేక గడువులు పెట్టి తుస్సుమనిపించారు. ఇదే సుజనా చౌదరి ఒకసారి 'వారం రోజుల్లో ప్రత్యేక హోదా తెప్పిస్తాం' అని చెప్పారు.

అప్పటికే అది రాదనే విషయం ఆయనకు తెలిసి కూడా మభ్య పెట్టారు. ఇప్పుడూ అదే జరిగితే ఏం జవాబు చెబుతారు? అడగందే అమ్మయినా పెట్టదంటారు. చంద్రబాబు అడుక్కుంటున్నా కేంద్రం పెట్టని పరిస్థితి ఉంది. ఇదీ బాబు జాతకం. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెసు, బీజేపీ ఎలా ఒక్కటయ్యాయో ప్రత్యేక హోదా ఇవ్వకూడదని బీజేపీ, టీడీపీ ఒక్కటయ్యాయి. మరి ప్యాకేజీకి చట్టబద్ధత కోసం చంద్రబాబు నిజంగానే పట్టుబడుతున్నారా?  ప్రత్యేక సాయం  హోదాతో సమానమన్నారు కాబట్టి తప్పనిసరిగా చట్టబద్ధత కల్పించాలి. హోదా అడిగితే అది ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న సమస్యని చెప్పారు. కాని ఈ ప్యాకేజీకి ఇతర రాష్ట్రాలతో సంబంధం లేదు. కాని చట్టబద్ధత కల్పించడంలో ఉన్న ఇబ్బందులేమిటో చెప్పడంలేదు. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా చట్టబద్ధత అవసరమా? అని బీజేపీ నాయకులు ఒకసారి ప్రశ్నించారు. దీన్నిబట్టే వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.

Show comments