''కొన్ని సినిమాలు కమర్షియల్ విజయం కోసం చేస్తాం.. ఇంకొన్ని సినిమాలు ఆత్మ సంతృప్తి కోసం చేస్తాం.. మరికొన్ని సినిమాలు సామాజిక బాధ్యతగా చేస్తాం.. ఆ మూడో కేటగిరీలోకి తన తాజా చిత్రం 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' వస్తుంది..'' అంటున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్.
'టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ' సినిమా గురించి మొదట ఎవరు విన్నా, 'ఛీ' కొట్టేశారట. స్టార్ హీరో అయి వుండీ, ఇలాంటి చెత్త చిత్రమేంటని వెటకారం చేశారట. ఆ సమయంలో తానెదుర్కొన్న ఛీత్కారాలు, విమర్శలు ఇంకా తనకు గుర్తున్నాయని అంటున్నాడు అక్షయ్‌కుమార్. ఎవరేమనుకున్నాసరే, సినిమాలో కంటెంట్‌ని తాను నమ్మాననీ, సమాజంలో తానూ ఓ పౌరుడిననే భావనతో ఆ సినిమా చేశాననీ, సామాజిక చైతన్యం కోసం తనవంతు బాధ్యత ఇలా సినిమా ద్వారా నెరవేర్చుకున్నానని అక్షయ్‌కుమార్ చెప్పుకొచ్చాడు.
'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి తమవంతు మద్దతుగా 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' సినిమా తెరకెక్కించామని దర్శక నిర్మాతలు, నటీనటులు చెబుతున్నారు. అక్షయ్‌కుమార్ సరసన భూమి పెడ్నేకర్ ఈ సినిమాలో నటిస్తోంది. జూన్ 2న 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' విడుదల కానుంది. కాగా, వెటకారాలు, ఛీత్కారాలు అన్నీ మాయమైపోయి, తమ సినిమాకి ప్రశంసలు దక్కుతాయనీ, అదే నటుడిగా తాను ఈ సినిమాతో సాధించే ఘనవిజయమని అంటున్నాడు అక్షయ్‌కుమార్.