భారత జవానుని నరికారు.. ఇప్పుడేం చేద్దాం!

ఎక్కడా.? వీరులు.. శూరులు ఇప్పుడేం చేస్తున్నారు.? భారతదేశమంతా ప్రశ్నిస్తోందిప్పుడు. యురీ ఘటనకు సర్జికల్‌ స్ట్రైక్స్‌తో భారత సైన్యం బదులు తీర్చుకుంది. 'అది మా ఘనత.. మా నరేంద్రమోడీ ఘనత.. మా బీజేపీ ప్రభుత్వ ఘనత..' అంటూ ప్రచారం చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ, నరేంద్రమోడీ సర్కార్‌.. ఇప్పుడు సరిహద్దుల్లో భారత జవానుని చంపి, ముష్కరులు ముక్కలు చేసిన ఘటనపై స్పందించాలి. 

ఇంకోసారి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌పైనో, లేదంటే పాకిస్తాన్‌పైనో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహిస్తారా.? లేదంటే, పాకిస్తాన్‌కి షరామామూలుగానే హెచ్చరికలు చేసి ఊరుకుంటారో రానున్న రోజుల్లో తేలిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం. సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిజమేనని భారతదేశమంతా నమ్ముతోంది. అదే సమయంలో, సర్జికల్‌ స్ట్రైక్స్‌ని విపక్షాలు రాజకీయం చేయడం కన్నా ఎక్కువగా, అధికార భారతీయ జనతా పార్టీనే రాజకీయం చేసేసింది. 

దాంతో, ఇప్పుడిక భారతదేశం సరైన యాక్షన్‌ని కోరుకుంటోంది. పాకిస్తాన్‌ మీద తీసుకోబోయే ఆ యాక్షన్‌ అత్యంత సీరియస్‌గా వుండాల్సిందేనని భారతదేశమంతా డిమాండ్‌ చేస్తోంది. భారత్‌లో పాకిస్తాన్‌ రాయబారికి సమన్లు పంచడం వంటి తూతూమంత్రం చర్యలతో ఉపయోగంలేదిప్పుడు. రాయబారం ముసుగులో, పాకిస్తాన్‌కి చెందిన ముష్కరులు (హైకమిషనర్‌ అయినా, ఇంకొకరైనా వాళ్ళు చేస్తున్నదీ ముష్కరుల పనే మరి..) భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. 

సర్జికల్‌ స్ట్రైక్స్‌ తర్వాత కూడా భారత్‌ - పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం తగ్గకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మనం, చెప్పాల్సిన తీరులో పాకిస్తాన్‌కి సమాధానం చెప్పలేకపోతున్నామేమోనన్న భావన దేశ ప్రజానీకంలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి పాకిస్తాన్‌ఫై ఖచ్చితంగా 'యాక్షన్‌' జరిగి తీరాల్సిందే. లేదంటే, రోజూ బోర్డర్‌లో కాల్పులు.. భారత సైనికుల మృతి.. అన్న వార్తల్నీ, దేశంలోకి చొరబడ్డ తీవ్రవాదులు.. సైన్యంపై దాడి.. అనే వార్తల్నీ వినక తప్పదు.

Show comments