తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అద్భుతంగా జరిగాయి. ఇందులో ఇంకో మాటకు తావులేదు. ముఖ్యమంత్రి పెద్ద పాత నోట్ల రద్దుపై మాట్లాడారు. వివిధ అంశాలపై విపక్షాలు ప్రశ్నలు సంధించాయి. మంత్రి హరీష్‌రావు సమాధానమిచ్చారు. అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే జరిగింది. పార్లమెంటు సమావేశాలు అత్యంత జుగుప్సాకరంగా జరిగిన దరిమిలా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు సజావుగా సాగడం అందరికీ ముచ్చటేసింది.
రెండో రోజుకి సీన్ మారిపోయింది. ఉదయం సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే సభలోంచి కాంగ్రెస్, టీడీపీ సభ్యుల్ని ఒకరోజుపాటు సస్పెండ్ చేసేశారు. ఐదు నిమిషాలకే సస్పెండ్ చేస్తారా.? ఇలాంటి సభకు రావడం కన్నా, సభకు రావడం మానేసి ప్రజల్లోకి వెళ్ళడం మంచిదన్పిస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. టీడీపీ సభ్యులు (ఎంతమంది వున్నారేంటి.? పార్టీ కండువా వేసుకుని కనిపించేది ఇద్దరే కదా.!) పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రస్తావించడంతో వారినీ సస్పెండ్ చేసేశారు.
ఈ క్రమంలో స్పీకర్ మధుసూధనాచారి నుంచి ఆసక్తికరమైన వ్యాఖ్యలొచ్చాయి. 'పార్టీ ఫిరాయింపుల అంశం మా పరిధిలో వుంది. తగిన సమయంలో చర్యలు తీసుకుంటాం..' అంటూ టీడీపీ, బీజేపీ సభలో చేస్తున్న ఆందోళనపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇంకెన్నాళ్ళు.? రెండేళ్ళు గడిచిపోతోంది.. ఫిర్యాదులన్నీ అటకెక్కాయి.. వ్యవహారం కోర్టులదాకా వెళ్ళింది. ఇంకో రెండేళ్ళలో ఎన్నికలు మళ్ళీ జరుగుతాయి. ఇంకెప్పుడు నిర్ణయం.? అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే.
స్పీకర్ సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందని ముందే ఊహించి వ్యూహాత్మకంగా కాంగ్రెస్, టీడీపీ సభ్యుల్ని సభ నుంచి అధికార పార్టీ బయటకు పంపించేందుకు రంగం సిద్ధం చేసిందనే విషయం స్పష్టమవుతోంది. పార్లమెంటు సమావేశాలది ఒక తీరు.. అక్కడ ప్రధాని అసలు సభకు, తద్వారా దేశానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో పార్లమెంటు సమావేశాల్నే జరగనివ్వలేదు. తెలంగాణ అసెంబ్లీ తీరు ఇంకోలా వుంది. ఇక్కడ, సమాధానం చెప్పగలిగే స్థితిలో వుండీ (బుకాయించడం అని కూడా అనుకోవచ్చు..) సభ నుంచి సభ్యుల్ని సస్పెండ్ చేసేశారు. అధికారంలో వుంటే ఏం చేసినా చెల్లుతుంది.
గతంలో కాంగ్రెసోళ్ళు ఏం చేశారు.? మేం జై తెలంగాణ అంటే, మమ్మల్ని సభలో వుండనిచ్చారా.? అని టీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రశ్నించొచ్చు గాక.! అప్పుడు కాంగ్రెస్ తప్పిదాలు చేసిందనే, ఇప్పుడు టీఆర్‌ఎస్‌కి అధికారం కట్టబెట్టారు. టీఆర్‌ఎస్ కూడా అదే తప్పిదాన్ని దర్జాగా చేస్తాం, అది మా పేటెంట్ హక్కు.. అంటే ఎలా.?