ప్రత్యేక హోదాపై జగన్‌ వ్యూహమేంటి.?

ప్రత్యేక హోదా 'వేడి' చల్లారిపోయింది. కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కి రానుందనే వార్తతో శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాల వరకూ విపరీతమైన 'వేడి' రాజుకుంది. కానీ, క్షణాల్లోనే వ్యవహారం సద్దుమణిగిపోయింది. బీజేపీ తనదైన వ్యూహాలతో ప్రత్యేక హోదా ఆకాంక్షపై నీళ్ళు చల్లేసింది. 

ప్రస్తుతానికైతే ప్రత్యేక హోదా సెగల్ని చల్లార్చగలిగినా, మళ్ళీ మరోమారు ఖచ్చితంగా ఈ బిల్లు రాజ్యసభలో హాట్‌ టాపిక్‌ కానుండడం ఖాయం. అది కూడా ఆగస్ట్‌ మొదటివారంలోనే. ఆ రోజు ఖచ్చితంగా ఓటింగ్‌ జరుగుతుందనే నమ్మకంతో వుంది కాంగ్రెస్‌ పార్టీ. ఈలోగా, మిగతా రాజకీయ అంశాలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోనున్నాయి. ప్రైవేటు మెంబర్‌ బిల్లు గనుక, అది పాస్‌ అయినా, దాన్ని ప్రొలాంగ్‌ చేయడం బీజేపీకి కష్టమైన విషయమేమీ కాదనుకోండి.. అది వేరే విషయం. ఇక, ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు వ్యవహారంలో టీడీపీ షరామామూలుగానే రెండు నాల్కల ధోరణి అవలంభించింది. 

ఇంతకీ, ఈ ఎపిసోడ్‌లో వైఎస్సార్సీపీ వ్యూహాలు ఎలా వుండబోతున్నాయి.? కాంగ్రెస్‌ బిల్లుకి మద్దతివ్వడం వరకూ ఓకే. కానీ, ప్రత్యేక హోదా సెగ చల్లారకుండా చూడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ మీదనే వుంది. ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించే దిశగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇప్పటికే వ్యూహాల్ని సిద్ధం చేసుకుని వుండాలి. కానీ, ఆ దాఖాలే కన్పించడంలేదు. ఇందుకు కారణమూ లేకపోలేదు, కాంగ్రెస్‌లో చిత్తశుద్ధి ఎంత.? అన్నదానిపై క్లారిటీ లేదు మరి.! 

దేశంలోని వివిధ పార్టీల్ని ఒప్పించేశామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. కానీ, రాజ్యసభలో ఓటింగ్‌ జరగాల్సిన సమయంలో, సరైన రీతిలో కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి తెచ్చి వుంటే మొన్న శుక్రవారమే బిల్లు పాస్‌ అయిపోయి వుండేది. రేపట్నుంచి పార్లమెంటు సెషన్లు మళ్ళీ పట్టాలెక్కుతాయి. ఇక్కడే, కాంగ్రెస్‌ చిత్తశుద్ధి ఏంటన్నదానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. 'ఇప్పుడు కాదు కదా, ఆగస్ట్‌ తొలి వారంలో చూసుకుందాం లే..' అన్నట్లు కాంగ్రెస్‌ వ్యవహరించిందంటే, కేవీపీ బిల్లుపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేనట్లే. 

ఆగస్ట్‌ రెండో వారం వరకూ పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం వున్నా, కేవీపీ బిల్లుని దాట వేయించడం, లేదంటే సమావేశాల్ని ముందుగా ముగించడం.. ఇవన్నీ బీజేపీ చేతుల్లోనే వుంటాయి. అందుకే, కాంగ్రెస్‌ పాత్ర ఇక్కడ కీలకం. ఈలోగా ఉద్యమాన్ని ఉరకలెత్తించేసి, మళ్ళీ నిరాశపడటం అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారట.

Show comments