వెంకన్న సన్నిధిలో విచ్చలవిడి పోటుగాళ్లు!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటగిరినాధుని సన్నిధిలో వారు విధులు నిర్వర్తిస్తుంటారు. నిత్యం దైవసన్నిధానంలో.. ఆయన పాదాల చెంతనే.. అదే తిరుమల గిరుల్లో పనిచేస్తారు. మామూలు వ్యక్తులు ఎవరైనా అయితే.. అలాంటి విధులనే భగవత్ ప్రసాదంగా భావిస్తారు. కానీ... తిరుమలలో వాస్తవంగా ఉన్న సినేరియో వేరు! అక్కడ అధికార దండం చేతిలో ఉన్నవారు ఎడాపెడా చెలరేగుతూ ఉంటారు ఓకే... అధికారానికి దగ్గరగా ఉన్న చిన్న ఉద్యోగులు కూడా తమను మించిన పోటుగాళ్లు లేరన్నట్లుగా.. విచ్చలవిడిగా.. నిబంధనలను పట్టించుకోకుండా, ఆదేశాలను ధిక్కరిస్తూ చెలరేగుతూ ఉంటారు. తిరుమల వర్గాలనుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఇదంతా వెంకన్న కనులముందు జరుగుతున్న ప్రహసనం.

వెంకటేశ్వర స్వామికి తానే యజమానిని అని భావించేస్థాయిలో తిరుమలో ఓ అధికారి ఉంటారు. వీఐపీలు, వీవీఐపీలు వస్తే.. వారిలో ఎవరెవరు, ఏయే వేళ్లలో స్వామిని దర్శించుకోవాలో.. లేదో.. అనుమతులు ప్రసాదించే అధికారం ఆయన చేతిలోనే ఉంటుంది. దేవుడి కంటె పూజారి బలమైన వాడనే సామెత చందంగా.. ఇక్కడ వేంకటేశ్వరునికంటె.. సదరు అధికారి చాలా పవర్‌ఫుల్ అనే సంగతి అందరికీ తెలుసు. బ్యూరోక్రాట్ గా ఉన్నతమైన హోదాతో ఆయన ఎలా చెలరేగినా అర్థం ఉందనుకోవచ్చు. కానీ.. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే.. పూవును అల్లుకున్న దారానికి కూడా వాసన అబ్బినట్టుగా ఆయన పేషీలో పనిచేసే అర్భకులకు కూడా కొమ్ములు మొలిచి ఉంటాయి. దేవుడి కంటె తానే గొప్ప అని ఆయన అనుకుంటారో లేదో గానీ.. ఆయనకంటె మేమే గొప్ప అని వాళ్లు భావిస్తూ ఉంటారు. 

అలాంటి చిరుద్యోగుల్లో ఒకరు అహంకారంతో కన్నూమిన్నూ గానక ప్రవర్తిస్తుంటారని సర్వత్రా వినిపించే మాట. సామాన్యుల వెతలు ఎలా ఉన్నాగానీ.. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు అతని వైఖరి పై టీటీడీ ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేశారుట. ఆరోపణలు ఎదుర్కొటున్నది చిరుద్యోగే గనుక.. ఒక్క ఉత్తర్వుతో ఆయనను మరో చోటకు బదిలీ చేసేశారు. పేరుకు బదిలీ జరిగింది గానీ.. సదరు ఉద్యోగి మాత్రం ఆ బదిలీ ఉత్తర్వులు తీసుకోలేదు.. సీటు ఖాళీ చేయనూలేదు. ఏం చేస్తారోచేసుకోండి అన్నట్లుగా మంకుపట్టు పట్టారుట. దానికి తగ్గట్లుగా అతని పైన ఉండే ఉన్నతాధికారి కూడా ఆయనను రిలీవ్ చేయడం లేదుట. ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారులు కూడా చేసేదేమీ లేక.. నిర్లిప్తంగా ఉన్నారుట. తామున్నది భగవత్సేవలో అనే స్పృహ లేకుండా చెలరేగే వారి వైఖరి ఇలాగే ఉంటుంది. కాకపోతే.. అధికారాలు పుష్కలంగా ఉండే ఉన్నతాధికారులూ.. మౌనం పాటించడం అంత శ్రేయస్సు కాదు. 

Show comments