జై తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్ జరిగినా ఉద్యమకారులు అడ్డుకునేవారు. వారి కోసం, చచ్చినట్లు, జై తెలంగాణ అని నినదించేవారు మన హీరోలు. ఇప్పుడు విశాఖలో హోదా సాధన కోసం 26న నిరసన తెలపాలని యువత కోరుకుంటూ వుంటే, మద్దతు తెలియ చేయడానికి మాత్రం మన హీరోలు ముందుకు రాలేకపోతున్నారు.
ఇప్పటి వరకు నిఖిల్, రాజ్ తరుణ్, విష్ణు మినహా మరెవరు మద్దతు ప్రకటించలేదు. రాజ్ తరుణ్ ఈవారమే విశాఖకు షూటింగ్ కు వెళ్తున్నాడు. మహేష్ బాబు దగ్గర నుంచి ప్రభాస్ వరకు మిగిలినహీరోలంతా ఎప్పుడో అప్పుడు విశాఖకు షూటింగ్ కు వెళ్లాల్సిందే. మరి వీళ్లంతా మద్దతు తెలియచేయలేదు కదా? తెలంగాణ ఉద్యమకారుల మాదిరిగానే మన ఉత్తరాంధ్ర ఉద్యమకారులు కూడా షూటింగ్ లు అడ్డుకుంటే..?
అక్కడంత సీన్ లేదని మన హీరోల ధీమా కావచ్చు. లేదా అప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అన్న ఆలోచన కావచ్చు. అంతే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును అందుకోవడం అన్నది ఇండస్ట్రీలోని రెండో వర్గానికి అంత ఇష్టం వుండకపోవచ్చు. అందుకే ఆ రెండో వర్గానిక చెందిన వారు పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించడం లేదు.