జగన్ నడక చంద్రబాబు అడుగుజాడల్లోనే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పర్వం ముగిసింది. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం దిద్దుతున్న బహిరంగ సభ లాగానే... పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ సభలో సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అనేక హామీలను ఆయన ప్రకటించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిమితంగా ఉన్న ఆదాయ వనరుల దృష్ట్యా ఇవన్నీ ఆచరణ సాధ్యమేనా? అని భయం కలిగే స్థాయిలో జగన్ లెక్కకు మిక్కిలిగా హామీలను ప్రకటించారు. 

లోతుగా గమనించినప్పుడు... అంశాలవారీగా కాకుండా స్థూలంగా చూసినప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు తాను ప్రతిపక్షనేతగా ఉన్న రోజుల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు జగన్ కూడా అనుసరిస్తున్నారని అనిపిస్తున్నది. గతంలో చంద్రబాబు చేసిన తప్పులనే చేసిన జగన్, ఇప్పుడు ఆయన దిద్దుకున్న చందంగానే దిద్దుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు గతంలో సీఎంగా ఉండగా.. 2004 ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఉచిత విద్యుత్తు హామీతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక సంచలనం సృష్టించారు. ఉచిత విద్యుత్తు హామీ ప్రజల మీద బాగా పనిచేస్తున్నదని, అది కాంగ్రెస్ కు మేలు చేయబోతున్నదని.. ఎన్నికలకు ముందు జరిగిన అనేక సర్వేలు నిగ్గు తేల్చాయి.

ఆ సమయంలో చంద్రబాబునాయుడు వ్యూహకర్తలుగా ఉన్న పలువురు- చంద్రబాబుతో.. ‘మనం కూడా ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చేద్దాం’ అని సలహా ఇచ్చారు. అయితే చంద్రబాబు ఆ మాటలు చెవిన వేసుకోలేదు. ‘తన ప్రభుత్వం చాలా మంచి పనులు చేసిందని తప్పక గెలుస్తానని’ మొండిగా వాదించారు. ఫలితాలు వచ్చేసరికి భంగపడ్డారు.

2014 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కూడా అచ్చంగా ఇలాంటి తప్పునే చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు రైతులకు రుణమాఫీ హామీతో ప్రకంపనాలు సృష్టించారు. ఆ హామీ ప్రజల మీద పనిచేస్తున్నదనే సంగతి ఎన్నికలకు ముందే సర్వేల్లో అర్థమైంది. వైఎస్ జగన్ వ్యూహకర్తలు, పార్టీలో కీలక నాయకులు ఆయనను కలిసి.. ‘మనం కూడా రుణమాఫీ హామీ ఇచ్చేద్దాం’ అని సలహా ఇచ్చారు. కానీ జగన్ దానిని అప్పట్లో గుడ్డిగా తోసి పుచ్చారు. తనకు ప్రజల్లో తిరుగులేని క్రేజ్ ఉన్నదని.. ఇలాంటి హామీల అవసరం లేకుండానే తాను గెలుస్తానని జగన్ అప్పట్లో ధీమా వ్యక్తం చేశాడు.

ఆరకంగా 2004లో చంద్రబాబు చేసిన తప్పునే, 2014లో జగన్ చేశారు. 2014లో చంద్రబాబు ఏ రకమైన విపరీత హామీలు, వాగ్దానాలతో తన పాత తప్పులను దిద్దుకోడానికి ప్రయత్నించారో.. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే రకమైన విపరీతపు హామీలతో ఓటుబ్యాంకును సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నాయకులు పరస్పరం ప్రత్యర్థులే అయినా.. వారి పోకడలు మాత్రం ఒకే రకంగా కనిపిస్తున్నాయి మరి!

Show comments