చంద్రబాబు- కేసీఆర్ .... దొందూదొందే!

అధికారం ఉన్నప్పుడు ఒక తీరుగా, అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా వ్యవహరించడం అనేది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అధికార దండం చేతిలో ఉన్నప్పుడు... దాన్ని ప్రయోగించి.. తమకు వ్యతిరేకంగా ఒక్క స్వరం కూడా వినిపించకుండా.. ప్రజల గొంతుకలను నులిమేయడానికి ప్రయత్నించడంలో నాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గమనిస్తే.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న వారిని అణచి వేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కూడా దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పకతప్పదు. ఇద్దరూ ఒకే రీతిగా మోనార్క్ లలాగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వం ఎలా వ్యవహరించినా సరే... ఎవ్వరూ దాన్ని ప్రశ్నించరాదు, తప్పులెన్నరాదు, నిరసనలు తెలియజేయరాదు అనేది వారు నమ్ముతున్న సిద్ధాంతంలాగా కనిపిస్తోంది. అందుకే.. అక్కడ ఏపీలో తెలుగుదేశం అధినేత ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను ఏ రీతిగా అణచివేస్తున్నారో... అచ్చంగా అదే రీతిలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అమానుషంగా వ్యవహరిస్తున్నది. నిరుద్యోగ ర్యాలీ తీయడానికి తెలంగాణ జేఏసీ నేతృత్వంలో సంకల్పిస్తే... అనుమతులు నిరాకరించడమే కాకుండా, పాల్గొనే వారందరికీ నేర చరిత్ర ఉన్నదనీ, ఉద్యమంలో అల్లర్లకు పాల్పడే గత చరిత్ర ఉన్నదని సాకులు చూపిస్తూ.. అనుమతిని నిరాకరించి, ఉద్యమం చేయదలచుకుంటున్న వారందరినీ ముందస్తుగా అరెస్టు చేయడం, అరెస్టుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించడం పైన చెప్పుకున్న అభిప్రాయాన్నే కలిగిస్తోంది. 

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి చికాకులు మొదలైనట్లే. ఆయన ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఎన్నడో అయిపోయింది. కానీ సరైన విధానంలేని ప్రతిపక్షాల పుణ్యమాని.. సర్కారు మూడేళ్లు దాటుతున్నా హనీమూన్ పీరియడ్ గానే గడుపుతూ వస్తోంది. కానీ.. ఇప్పుడు తెలంగాణ జేఏసీ ఉద్యమాల బాట పట్టడంతో ఇక చికాకులు మొదలైనట్లే అనుకోవాలి. నిరుద్యోగ ర్యాలీని అరెస్టుల ద్వారా తొక్కేసినంత మాత్రాన యావత్ తెలంగాణ జేఏసీ పోరాట దృక్పథాన్ని తొక్కేసినట్లే అని కేసీఆర్ సర్కారు భావిస్తే వారు పప్పులో కాలేసినట్లే. ర్యాలీ జరిగితే తద్వారా ఉద్యమకారులు సాధించేది ఏమిటి...? తమ డిమాండ్లను యావత్ రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకువెళ్లడం, అందరి నజర్ ఇటువైపు మళ్లేలా చేయడం మాత్రమే! మరి ఇప్పుడు అనుమతి నిరాకరణ, అరెస్టుల పర్వం తర్వాత కూడా.. వారు తమ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతున్నారు. ఈ రగడ వల్ల కూడా అసలు సమస్య అందరి దృష్టికి వెళుతున్నది. ఇదే క్రమంలో రానున్న రోజుల్లో కూడా ఇవే అణచివేత ధోరణులు ప్రతి ఉద్యమం మీద కూడా కొనసాగుతూ పోతే.. ప్రభుత్వం మీద ప్రజల్లో ఏహ్యభావం పుడుతుంది. 

ఏపీలో అచ్చంగా చంద్రబాబు అనుసరిస్తున్న తీరు ఇది. కాపు ఉద్యమం విషయంలో చంద్రబాబు సర్కారు ఎంత అణచివేత ధోరణిని అనుసరిస్తున్నదో తెలుసు. యాత్ర ప్రకటించిన ప్రతి సందర్భంలో.. ముద్రగడ పద్మనాభం ను ఇంటివద్దనే అరెస్టు చేయడం, ఆయన పల్లె నిండా భారీగా పోలీసుల్ని నిత్యం మోహరించి ఉండడం.. వారికి అలవాటు అయిపోయింది. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం అరెస్టులు కూడా అదే రీతిగా జరిగాయి. అనుమతులు లేకపోయినా ర్యాలీ తీస్తాం అనే ప్రకటన చేసినందుకు తెల్లవారుజామునే ఆయనను అరెస్టు చేశారు. తెలంగాణ పోలీసులు ఓ అడుగు ముందుకేసి.. తలుపులు బద్దలు కొట్టి మరీ కోదండరాంను అరెస్టు చేశారు. మరో 25 మంది జేఏసీ నేతల్ని కూడా అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ అణచివేత పర్వంలో అరెస్టు అయిన వారు ఇంకా 600 మందికి పైగా ఉన్నారు. 

చంద్రబాబు- కేసీఆర్.. వేర్వేరు పార్టీలకు చెందిన , వైరి పక్షాలకు చెందిన నాయకులే గానీ.. వారి వ్యవహార సరళి మాత్రం ఒకే తీరుగా ఉంటున్నదని చెప్పాల్సిందే. అందుకే అధికార దండం చేతబూని, దమననీతిని నమ్ముకుంటూ, అణచివేత చర్యలకు పాల్పడే విషయంలో మాత్రం... చంద్రబాబునాయుడు, కేసీఆర్ దొందూ దొందే అని అందరికీ అనిపిస్తోంది. 

Show comments