అభ్యర్థుల భవిష్యత్తు ప్రియాంక చేతుల్లో...!

ఏ పార్టీలోనైనా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత పార్టీ అధినేతే తీసుకుంటారు. ఎన్నికలు వస్తున్నాయనేగానే అనేకమంది టిక్కెట్లు ఆశిస్తారు. అధినేత చుట్టూనే కాకుండా ఆయన (లేదా ఆమె)  కోటరీ చుట్టూ తిరుగుతారు. విపరీతమైన లాబీయింగ్‌ చేస్తారు. ఫలానా వారికి టిక్కెట్లు ఇవ్వాల్సిందిగా నాయకులు అధినేతకు సిఫార్సు చేస్తుంటారు. టిక్కెట్ల విషయంలో పార్టీల అధినేతలపై తీవ్రమైన ఒత్తిళ్లుంటాయి. అందరి మాటలు వినాల్సిందే. అందరి విన్నపాలు ఆలకించాల్సిందే. అన్ని ఒత్తిళ్లు తట్టుకోవాల్సిందే. 

చివరగా సరైన అభ్యర్థులకు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వడానికి అధినేతలు పచ్చ జెండా ఊపుతారు. అన్ని పార్టీల మాదిరిగానే కాంగ్రెసు పార్టీలోనూ ఇదే పరిస్థితి. అధ్యక్షురాలు సోనియా గాంధీ పచ్చ జెండా ఊపందే, ఆమోదముద్ర వేయందే ఏ అభ్యర్థికీ టిక్కెట్టు వచ్చే అవకాశం ఉండదు. కాని వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి దృశ్యం మారిపోయింది. వారణాశి రోడ్‌షోలో అనారోగ్యం పాలైన సోనియా గాంధీ కోలుకున్నట్లే కోలుకొని మళ్లీ అస్వస్థత పాలవడంతో అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత కుమార్తె ప్రియాంక గాంధీ తన చేతుల్లోకి తీసుకున్నారు. 

వాస్తవానికి అధ్యక్షురాలు పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె బాధ్యతలు ఉపాధ్యక్షుడు తీసుకుంటారు. అంటే రాహుల్‌ గాంధీ చూసుకోవాలి. అభ్యర్థులుగా ఎవరు ఉండాలనేది ఆయన నిర్ణయించాలి. కాని అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ప్రియాంకకు అప్పగించినట్లు సమాచారం. ఇలా ఎందుకు జరిగిందో కారణం తెలియరాలేదు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ప్రియాంకకు అప్పగించాలని సోనియా గాంధీ చెప్పారా? రాహుల్‌ చెప్పారా? ఆ బాధ్యత ప్రియాంకకు అప్పగిస్తే బాగుంటుందని నాయకులు అధినేతపై ఒత్తిడి చేశారా? తెలియడంలేదు. 

ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లోనైనా క్రియాశీలకంగా ఉండేది, ఏ నాయకుల జాతకాలు ఎలాంటివో తెలిసేది సోనియా గాంధీ తరువాత రాహుల్‌ గాంధీకే. ఆయా రాష్ట్రాల నాయకులతో ఎక్కువగా 'టచ్‌'లో ఉన్నది రాహులేనని చెప్పొచ్చు. ఇప్పటివరకు పలు ఎన్నికల్లో ఆయన వ్యూహాలు రూపొందించారు. అలాంటప్పుడు అభ్యర్థులకు ప్రియాంక ఎలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారో...! ఇప్పటివరకు ఆమె పార్లమెంటు ఎన్నికలప్పుడు తల్లి, సోదరుడి నియోజకవర్గాలైన రాయబరేలి, అమేధీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం తప్ప రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి కూడా చూపలేదు. 

యూపీ ఎన్నికల్లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తారని, ప్రధాన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని ఇప్పటివరకు అనుకుంటున్న విషయం. ఒక్క యూపీలోనే ప్రచారం చేయించాలా, ఎన్నికలు జరగబోయే ఇతర రాష్ట్రాల్లోనూ తిప్పాలా? అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఆమెకు ఏదైనా పదవి ఇవ్వాలా? వద్దా? అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ప్రియాంక 'క్లియరెన్స్‌ సర్ట్ణిఫికెట్‌' ఇస్తున్నారనేది విశేషమే కాదు విచిత్రం కూడా. ఇప్పటివరకు 80 మంది అభ్యర్థుల తొలి  జాబితా తయారుచేశారని, వారిలో దాదాపు అందరికీ  ప్రియాంక క్లియరెన్స్‌ ఇచ్చారని కాంగ్రెసు నాయకులు చెప్పినట్లు జాతీయ మీడియా సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ ఓకే చేశారట. 

మొదటి జాబితాలో ఉన్నవన్నీ కాంగ్రెసుకు సురక్షిత స్థానాలట. ఆగస్టు నెలాఖరునాటికి అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తారట. సోదరుడు రాహుల్‌ గాంధీతో సమన్వయం చేసుకొని ప్రియాంక తన బాధ్యతను సులభంగా నిర్వహిస్తున్నారని ఒక నాయకుడు చెప్పాడు. అంటే ఇద్దరూ కలిసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారనుకోవాలా? అనారోగ్యంవల్ల సోనియా గాంధీ పనిచేసే స్థితిలో లేని పరిస్థితిలో ప్రియాంక కొత్త నాయకురాలిగా అవతరించిందని, ఆమె పట్ల తమకు విశ్వాసం ఉందని ఓ నాయకుడు చెప్పాడు. అభ్యర్థులను ప్రియాంక ఎంపిక చేస్తోందట...ఏంటి సంగతి? అని యూపీ కాంగ్రెసు అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ను ఓ ఆంగ్ల పత్రిక అడిగినప్పుడు గాంధీ కుటుంబమంతా ఒకే యూనిట్‌ అని, ఎవరో ఒకరు సింగిల్‌గా పనిచేయరని చెప్పారు. 

ఏ విషయంలోనైనా ఆ కుటుంబం ఒకే మాట మీద ఉంటుందన్నారు. తామంతా ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే ఆమె పర్యవేక్షణకే పరిమితమై పార్టీ బాధ్యతలను కొడకుకు, కూతురుకి అప్పగిస్తారనిపిస్తోంది. అసలైతే రాహుల్‌ను అధ్యక్షుడిని చేసి పగ్గాలు ఇవ్వాలనుకుంది. కాని ఆయన సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రియాంకనూ రప్పించింది. నాయకులంతా సోనియా స్ధానంలో ఆమె కూతురే ఉండాలనుకుంటున్నారు. మరి అన్నాచెల్లెళ్లు పొరపచ్చాలు లేకుండా, సమన్వయంతో పార్టీని ఎలా నడుపుతారో చూడాలి. ఇంతకంటే ముందు ప్రియాంకకు ఏం పదవి ఇస్తారనేది ప్రధానం. 

Show comments