సీక్రెట్‌.. టాప్‌ మోస్ట్‌ సీక్రెట్‌

ఆమె ఆషామాషీ వ్యక్తి కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు తెలియాలి కదా. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పాలి. లేదంటే, అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పాలి. అంతేగానీ, ఇంత సస్పెన్స్‌ ఎందుకు.? ఇది 'అరవ అతి'కి పరాకాష్ట అనుకోవాలా.? అంటే, ఆషామాషీ వ్యవహారం కాదిది. కానీ సీక్రెట్‌, టాప్‌ సీక్రెట్‌. అంతే. ఆమె ఆరోగ్యం గురించి చిన్న విషయం కూడా బయటకు పొక్కడంలేదు. 

పరిచయం అక్కర్లేని పేరు అది. జయలలిత.. తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని పేరిది. అక్రమాస్తుల కేసులు ఎదుర్కొన్నా, ముఖ్యమంత్రిగా సంచలన విజయాలు సాధించినా.. అది ఆమెకే సొంతం. కానీ, దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. మనిషన్నాక అనారోగ్యం మామూలే. కానీ, గోప్యత పాటించాల్సిన అనారోగ్యమేంటి.? అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

ఒక రోజు కాదు, రెండ్రోజులు కాదు.. పది రోజులుగా చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆమెకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. తమిళనాడు - కర్నాటక రాష్ట్రాల మధ్య నీటి వివాదం భగ్గుమంటున్నా, జయలలిత తమ రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ప్రకటన చేయలేని పరిస్థితి. ఆమె తరఫున మంత్రులే ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు. 

తాజాగా, విదేశాల నుంచి వైద్య బృందం వచ్చి అపోలో ఆసుపత్రిలో జయలలితకు వైద్య చికిత్స అందిస్తున్నారట. ఆ చికిత్స దేనికి.? అంటే, నో ఆన్సర్‌. ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌, ముంబై నుంచి హుటాహుటిన బయల్దేరారు. ఈ హడావిడి చూసి, ఏదో వినకూడని వార్త వినాల్సి వస్తుందేమోనని రాష్ట్ర ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని అన్నాడీఎంకే పార్టీ నేతలు చెబుతుండడమే తప్ప, జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. 

రెండ్రోజులుగా ఆసుపత్రి వర్గాల నుంచీ జయలలిత ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ రాకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది, ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు, జయలలిత ఆరోగ్యంపై నెలకొన్న సస్పెన్స్‌కి తెరదించాలని. ప్రతిపక్ష నేత కరుణానిధి కూడా జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చేస్తూ, వివరాలు వెల్లడించాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. 

దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఏ రాజకీయ ప్రముఖుడి విషయంలోనూ ఇలా జరగలేదు. జయలలిత విషయంలోనే ఎందుకు జరుగుతున్నట్లు.?

Show comments