తెలుగోళ్ల మధ్య నలుగుతున్న పెద్దాయన...!

'ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా'...అని నందమూరి బాలకృష్ణ సినిమాలో ఓ పాట వుంది. ఇద్దరు హీరోయిన్లు ఒకే హీరోను ప్రేమిస్తే వచ్చే బాధలను ఈ పాట తెలియచేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ పరిస్థితి రాష్ట్ర విభజన సమయం నుంచి ఇలాగే ఇబ్బందికరంగా  ఉంది. సినిమాలో హీరో భామల కారణంగా ఇరుకున పడితే గవర్నర్‌ తెలుగు రాష్ట్రాల్లోని పాలకుల, పార్టీల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన కళ్లెదురుగానే రాష్ట్ర విభజన జరిగింది. ఆ వెంటనే తగాదాలు మొదలయ్యాయి. ప్రభుత్వాల మధ్య తగాదాలే కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా కూడా గొడవ పడిన సందర్భాలున్నాయి. 

రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి పెద్దాయన గవర్నరే కాబట్టి ఏ పార్టీ వాళ్లయినా ఆయన్నే కలిసి 'మా సమస్య పరిష్కరించండి' అనో 'మాకు న్యాయం చేయండనో' అడుగుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్టుకోవడం ఒకటైతే, అధికార, ప్రతిపక్షాలు కొట్టుకోవడం మరొకటి. ఎవ్వరైనా సరే గవర్నర్‌ దగ్గరకే వెళ్లి మీరే ఏదో ఒకటి చేయాలని అడుగుతున్నారు. రెండు రాష్ట్రాల నాయకుల గొడవల మధ్య గవర్నర్‌ నలిగిపోతుండగానే నాయకులు ఆయనపైన ఆరోపణలు చేస్తున్నారు. కొందరు చులకనగా, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. కొందరు ఆయన్ని వివాదాల్లోకి లాగుతున్నారు. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 

రాష్ట్ర విభజన జరిగిన తరువాత చాలాకాలం వరకు ఆంధ్రా నాయకులు గవర్నర్‌పై విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆయనను తెలంగాణ పక్షపాతిగా చిత్రీకరించారు. ఆయన్ని తొలగించాలని కూడా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెసు నాయకులు నరసింహన్‌ను ఆంధ్రా పక్షపాతి అని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెసు నాయకుడు వి.హనుమంతరావు అలియాస్‌ వీహెచ్‌  నరసింహన్‌ను గవర్నర్‌ పదవి నుంచి తప్పించాలని తాజాగా డిమాండ్‌ చేశారు. ఎందుకు? ఆయన ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారట...! గవర్నర్‌ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకొని ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, ఇతర సాయాలు, సమస్యల గురించి మాట్లాడారని, తెలంగాణ గురించి ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. 

ఆయన తెలంగాణ సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. మల్లన్న సాగర్‌ రైతుల సమస్యలను, రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గవర్నర్‌ ప్రధాని దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని వీహెచ్‌ ప్రశ్నించారు. నోటుకు ఓటు వివాదం సమయంలో గవర్నర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా ఉన్నారని ఆంధ్రా మంత్రులు, టీడీపీ నాయకులు విమర్శించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో గవర్నర్‌ తెలంగాణ వైపే మొగ్గారని ఆరోపించారు. నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ విషయంలోనూ వైసీపీ నాయకులు గవర్నర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. 

Readmore!

పార్టీ ఫిరాయింపులను అరికట్టాలంటూ తెలంగాణ టీడీపీ, కాంగ్రెసు నాయకులు పలుమార్లు గవర్నర్‌ను కలుసుకొని విన్నవించారు. కాని ఆయన ఏమీ చేయలేకపోయారు. ఈమధ్య నోటుకు ఓటు కేసు మళ్లీ చురుగ్గా కదలడం మొదలయ్యాక ఆంధ్రా వైసీపీ నాయకులు గవర్నర్‌పై ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్‌భవన్‌కు వెళ్లి ఈ కేసు విషయంలో రాజీ కుదిర్చేందుకు గవర్నర్‌తో మంతనాలు జరిపారని, రాజ్‌భవన్‌ రాజీ భవన్‌గా మారిందని ఆగ్రహించారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న ఏ సమస్య పైనా గవర్నర్‌ రియాక్ట్‌ కావడంలేదని రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులూ విమర్శిస్తున్నారు. 

గవర్నర్‌ ఏమీ పట్టించుకోకుండా గుళ్లకు గోపురాలకు తిరుగుతుంటారనే విమర్శలూ ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన అనేక గొడవల్లో గవర్నర్‌ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సమస్యలను తాను పరిష్కరించలేక కేంద్రం దగ్గరకు వెళితే అక్కడ పాలకులు ఈయనకు క్లాసులు తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతీసారి కేంద్రం వద్దకు రావొద్దని వార్నింగ్‌ ఇచ్చారు కూడా. గత రెండున్నరేళ్లలో గవర్నర్‌ ఇబ్బందులు పడిన చాలా సంఘటనలు జరిగాయి. అలాగే ఆయనపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. 

గొడవల కారణంగా గవర్నర్‌తో భేటీలను 'చంద్రులు' బాయ్‌కాట్‌ చేసిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు ఒకరొచ్చి మరొకరు రాకపోవడమూ జరిగింది.  శ్రీశైలం కరెంటు వివాదంలో రెండు రాష్ట్రాల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఆంధ్రా-తెలంగాణ మంత్రులు మాటల తూటాలు విసురుకున్నారు. కూర్చుని చర్చించుకుందామని గవర్నర్‌ చెప్పినా వినలేదు. దీంతో నిస్సహాయంగా ఉండిపోయారు. ఇలాంటి ఘటనలు అనేకమున్నాయి. తాను గవర్నర్‌ పదవి నుంచి తప్పుకోవచ్చని, అది త్వరలోనే జరగవచ్చని నరసింహన్‌ కొంతకాలం క్రితం చెప్పారు. కాని ఇప్పటివరకు ఏమీ కాలేదు.

Show comments