అరెవో సాంబా.. ఇంకో డిజైనొచ్చింది చూస్కో.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించి మరో డిజైన్‌ వచ్చిందోచ్‌. ఈసారి మాకీ సంస్థ డిజైన్లు కావు, ఆర్‌డీఏ హ్యారీస్‌ సంస్థ తీసుకొచ్చిన డిజైన్ల వ్యవహారమిది. ఏంటో, ఈ డిజైన్ల గోల. ఆ మధ్యన మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లు అదిరిపోయాయంటూ, 'ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌' తరహాలో ఓ డిజైన్ల సముదాయాన్ని రాష్ట్ర ప్రజానీకం ముందుంచింది చంద్రబాబు సర్కార్‌. 'థూ.. అవేం డిజైన్లు..' అంటూ, నిర్మొహమాటంగా జనం ఆ డిజైన్లను తిరస్కరించేశారు. అంతేనా, మాకీ సంస్థ డిజైన్లు పాకిస్తాన్‌ దాకా పాకేశాయి. ఏకంగా, అమరావతిలో అణు కార్యకలాపాలు.. అంటూ పాకిస్తాన్‌ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. 

చంద్రబాబు ఎంపిక చేస్తే ఇలానే వుంటుంది మరి.? ఎంతైనా హైటెక్‌ ముఖ్యమంత్రి కదా, ఆయన ఆలోచనలెప్పుడూ 'లోటెక్‌'లోనే వుంటాయి మరి. అయినాసరే, మాకీ సంస్థకే ఇంకోసారి అవకాశమివ్వాలనుకున్నారు. ఈలోగా ఏమయ్యిందో, పరువు పోతుందనుకుని 'అబ్బే.. డిజైన్లు ఫైనల్‌ అవలేదు.. మళ్ళీ డిజైన్ల కోసం ఆయా సంస్థలను ఆహ్వానిస్తున్నాం..' అని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అలా, ఇప్పుడు కొత్త డిజైన్లు వచ్చి చేరాయన్నమాట. 

పాత డిజైన్లు అయినా, కొత్త డిజైన్లు అయినా.. అసలంటూ ప్రాజెక్టు పట్టాలెక్కాలి కదా. చిన్నదో పెద్దదో ఓ నిర్మాణమంటూ చంద్రబాబు సర్కార్‌, అమరావతి పేరు మీద ప్రారంభిస్తే, 'అమరావతి మన రాజధాని' అన్న భావన రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. అయినా, అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.? 

ప్రస్తుతానికి కొత్త డిజైన్ల వ్యవహారం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. మాకీ డిజైన్లతో పోల్చితే ఇవి కాస్త బెటర్‌.. అన్న భావన కలుగుతోంది. కానీ, ఇంకా రేసులోనే వుంది మాకీ సంస్థ. అప్పట్లో ధర్మల్‌ పవర్‌ ప్లాంట్ల తరహాలో డిజైన్లు ఇచ్చిన మాకీ, ఈసారి ఎలాంటి డిజైన్లు ఇస్తుందో.! ఏమిచ్చినాసరే, మాకీ సంస్థ మీద మహా చెడ్డ ఇంట్రెస్ట్‌ చంద్రబాబు అండ్‌ టీమ్‌కి వున్నట్లుంది.! 

ఇప్పటికే 25 నెలల పుణ్యకాలం గడిచిపోయింది. రాజధాని అమరావతి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్ని డిజైన్లను చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చూపిస్తారో.? 2018 నాటికి రాజధాని తొలి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గతంలోనే చంద్రబాబు సర్కార్‌ ప్రకటించేసింది. సాధ్యమేనా.? అనడక్కండి. అదంతే. 

తాత్కాలిక సచివాలయం సంగతి చూశారు కదా. యుద్ధ ప్రాతిపదికన నిర్మించేశారు. నిర్మాణం పూర్తవకుండానే ప్రారంభించేశారు. జూన్‌ నెలాఖరికి తరలింపు.. అన్నారు, ఇంతవరకు పూర్తిస్థాయిలో తరలింపు జరగని పరిస్థితి. ఎప్పటికి, ఆ తరలింపు పూర్తవుతుందో ఎవరికీ అర్థం కాని దుస్థితి. తాత్కాలిక సచివాలయం పరిస్థితే ఇలా వుంటే, రాజధాని సంగతి ఎంకెలా వుంటుంది.? ఇంకెన్నాళ్ళు చంద్రబాబు ఈ గ్రాఫిక్స్‌ చూపిస్తూ పబ్బం గడిపేసుకుంటారు.?

Show comments