మమ్మీ డాడీ బీడీ కేడీ.!

వెంకయ్య అంతే, వయసు మీద పడ్డంతో పుట్టుకొచ్చిన ఛాదస్తం కావొచ్చు, ఇంకేదన్నా కారణం కావొచ్చు.. ప్రాస కోసం నానా తంటాలూ పడ్తుంటారు. ఆఖరికి తెలుగుదనం గురించి మాట్లాడుతూ మమ్మీ, డాడీలను బీడీ కేడీలతో పోల్చేశారు. అమ్మ అంటే అంతరాల్లోంచి వస్తుందని, మమ్మీ అంటే పెదాల మీద నుంచి వస్తుందని సెలవిచ్చారు వెంకయ్యనాయుడు. 

'మమ్మీ డాడీ బీడీ కేడీ..' అంటూ 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో విడుదల వేడుకలో వెంకయ్యనాయుడు హల్‌చల్‌ చేశారు. 'అమ్మ, నాన్న..' అన్న పిలుపులో అమృతం వున్నమాట వాస్తవం. ఆ పిలుపుకి సాటి ఇంకోటి రాదు. ఏ భాషలోని మాధుర్యం ఆ భాషలో వుంటుంది. అసలంటూ ఇంగ్లీషు భాష, ఇంగ్లీషు పిలుపుల్ని అవమానపరిస్తే ఎలా.? మమ్మీ డాడీ - బీడీ కేడీ.. అనడం ఏమన్నా సబబుగా వుందా.? 

తెలుగుదనం ఉట్టిపడేలా 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా తెరకెక్కుతోందనీ, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గౌతమి పుత్ర శాతకర్ణి అనీ, ఆ చరిత్రను సినిమాగా తెరకెక్కించడం అద్భుతమనీ వెంకయ్యనాయుడు కొనియాడటం వరకూ బాగానే వుందిగానీ, బీడీ - కేడీ మాటలేంటో ఆయనకే తెలియాలి. మైక్‌ అందుకుంటే వదిలిపెట్టరు.. అది పొలిటికల్‌ మీటింగ్‌ అయినా, సినిమా ఫంక్షన్‌ అయినా.. ఈ క్రమంలోనే వెంకయ్య ప్రాస కోసం ఒక్కోసారి ఇదిగో, ఇలా హద్దులు దాటేస్తుంటారు.

Show comments