సీమ సందుల్లో అన్నాదమ్ముల సంగ్రామం!

తను తెలుగుదేశం పార్టీనే అని నొక్కివక్కాణిస్తున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. తన సోదరుడు శిల్పామోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లినా నంద్యాల్లో తను టీడీపీ విజయానికే పని చేస్తానని చక్రపాణి రెడ్డి స్పష్టం చేస్తున్నాడు. మరి ఈ మాటలు నమ్మేవాళ్లు పెద్దగా కనిపించడం లేదు. ఆఖరికి చంద్రబాబు కూడా నమ్మడంలేదు. ఇటీవల ఇఫ్తార్‌ విందు సందర్భంగా చక్రపాణి రెడ్డి అక్కడకు వస్తే తెలుగుదేశం అధినేత ఆయనను పెద్దగా పట్టించుకోలేదు.

ఒకదశలో శిల్పా మోహన్‌రెడ్డి తెలుగుదేశంలోనే ఉంటే చక్రపాణి రెడ్డికి మండలి చైర్మన్‌ పదవిని ఇస్తానని హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి బాబుగారే పట్టించుకోనప్పుడు లోకల్‌ క్యాడర్‌ ఎలా పట్టించుకుంటుంది? ఇప్పటికే అఖిలప్రియ శిల్పా చక్రపాణిరెడ్డిని అస్సలు పట్టించుకోవడం లేదు. పాత శత్రుత్వం ప్లస్‌ కొత్త శత్రుత్వంతో ఆమె చక్రపాణి రెడ్డిని అవమానిస్తోంది. మరి తనవంతుగా ఏదైనా చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు చక్రపాణి రెడ్డి.

మరి సీమలో అన్నదమ్ములు చెరో పార్టీలో ఉండి పోరాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అన్న కుటుంబం ఒక పార్టీ తమ్ముడి కుటుంబం మరో పార్టీలో ఉండి పరస్పరం తలపడిన సందర్భాల్లో కొన్ని ప్రముఖమైనవి ఉన్నాయి. జగన్‌ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నాకా.. తన తల్లిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన సందర్భంలో ఆమెకు వ్యతిరేకంగా పోటీకి దిగింది మరెవరో కాదు.. స్వయానా వైఎస్‌ తమ్ముడే కదా!

ఆ తర్వాత వివేకానంద రెడ్డి వైకాపాలో సర్దుకుపోయాడనుకోండి. ఇక అనంతపురం జిల్లాలో కడపల మోహన్‌ రెడ్డి గతంలో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయగా, ఆయన సోదరుడు కడపల శ్రీకాంత్‌ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీచేశాడు.

ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలో వివిధ నియోజకవర్గాలను ఆక్రమించిన వై. శివరామిరెడ్డి సోదరులు వేర్వేరు పార్టీల్లో పని చేశారు. శివరామిరెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలు కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన సందర్భాల్లో వాళ్ల సోదరుడు బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలిచాడు. ఇప్పుడైతే శివరామిరెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, బాలనాగిరెడ్డి ముగ్గురూ వైకాపాలోనే ఉన్నారు.

మరో నియోజకవర్గం శ్రీశైలంలో కూడా అన్నాదమ్ముల పోరాటం ముందు నుంచే సాగుతోంది, ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వైకాపా తరపున పోటీచేసి తెలుగుదేశంలో చేరిపోయాడు. అయితే ఇప్పుడు శ్రీశైలంలో వైకాపా ఇన్‌చార్జి మరెవరో కాదు బుడ్డా శేషారెడ్డి. సోదరుడైన రాజశేఖర రెడ్డిని శేషారెడ్డి తీవ్రంగా దూషిస్తూ ఉంటారు.

మరి మొన్నటి వరకూ వీళ్లిద్దరూ వైకాపాలోనే ఉండినా, అంతకు ముందు మాత్రం చెరో పార్టీలో ఉండేవారు. రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండగా, శేషారెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. వీళ్లిద్దరూ ఆ రెండు పార్టీల తరపున బరిలోకి దిగి శ్రీశైలం నుంచి పోటీచేసి నప్పుడు ఆ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఏరాసు ప్రతాపరెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారప్పుడు.

Show comments