కమల్‌హాసన్‌ మీద కత్తిగట్టేశారు

తమిళ రాజకీయాలపై ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్న కమల్‌హాసన్‌, ఇప్పటికే అధికార అన్నాడీఎంకే పార్టీకి 'వ్యతిరేకి'గా ముద్ర వేయించేసుకున్నాడు. అసలు అన్నాడీఎంకే పార్టీతో ఎప్పుడూ ఆయనకి సత్సంబంధాల్లేవు. ఆ మాటకొస్తే, జయలలిత జీవించి వున్నప్పుడూ ఆమెపై వివాదాస్పద కామెంట్లేసి.. తన సినిమా 'విశ్వరూపం'కి చిక్కులు కొనితెచ్చుకున్నాడు కమల్‌హాసన్‌. 

తాజాగా, ఇప్పుడు మరోమారు కమల్‌హాసన్‌ మీద తమిళనాడులోని 'అమ్మ' వారసుడు, ముఖ్యమంత్రి పళనిస్వామి కత్తిగట్టేసినట్లే కన్పిస్తోంది. అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో, శశికళ వర్గానికి వ్యతిరేకంగా - పన్నీర్‌ సెల్వం వర్గానికి అనుకూలంగా ట్వీట్లతో హోరెత్తించేశాడు కమల్‌హాసన్‌. మొత్తం సినీ పరిశ్రమ పన్నీర్‌ సెల్వంకి మద్దతిచ్చినా, పళనిస్వామి ముఖ్యమంత్రి అయిపోయారు. అయినా, కమల్‌ ట్విట్టర్‌లో పోరు మాత్రం ఆపలేదు. 

'మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు తగు రీతిలో స్వాగతం పలకండి..' అంటూ ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చాడు కమల్‌హాసన్‌. ఇందులో వెటకారం సుస్పష్టం. ఆ వెటకారంపై మండిపడుతూ, ఇంకొకరితో కేసులేయించింది అధికార అన్నాడీఎంకే పార్టీ. 'ఇండియన్‌ దేశీయ లీగ్‌' పేరుతో కేసులు నమోదయ్యాయి కమల్‌హాసన్‌ మీద. ఈ కెలుకుడు ప్రభావం కమల్‌ తదుపరి సినిమాలపై ఖచ్చితంగా వుంటుంది. కమల్‌ ఎంత గింజుకుంటున్నా.. అక్కడ జరగాల్సిందే జరుగుతుంది. దాన్ని ప్రశ్నించడానికి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా.? అంటే, అదీ లేదు. 

ఇదిలా వుంటే, తన 'విశ్వరూపం-2' సినిమాకి అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయనీ, త్వరలో సినిమాని విడుదల చేస్తానని ఈ మధ్యనే కమల్‌ ప్రకటించాడు. 'విశ్వరూపం'కి సీక్వెల్‌ ఇది. అప్పట్లో 'విశ్వరూపం' ఎదుర్కొన్న రాజకీయ వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అవే వివాదాలు ఇప్పుడు 'విశ్వరూపం-2'ని వెంటాడవన్న గ్యారంటీ ఏంటట.?

Show comments