చిరంజీవితో సునీల్‌ వీణ స్టెప్‌.?

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్‌ కోసం సునీల్‌ పడ్డ కష్టం ఫలించింది. ఎట్టకేలకు సినిమాలో సునీల్‌ ఛాన్స్‌ దక్కించుకున్నాడట. ముందుగా సునీల్‌నే చిరంజీవి ప్రిఫర్‌ చేసినా, కొన్ని కారణాలతో ఫుల్‌ లెంగ్త్‌ కమెడియన్‌ రోల్‌ చేయలేకపోతున్నానని సునీల్‌, చిరంజీవికి చెప్పడంతో, సునీల్‌ని పక్కన పెట్టి అలీని తీసుకున్నారనే ప్రచారం జరిగింది. 

అదెంత నిజమోగానీ, ఇప్పుడు చిరంజీవితో కలిసి సునీల్‌ కమెడియన్‌గా కన్పించడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. సినిమాలో సెపరేట్‌ కామెడీ ట్రాక్‌ చిరంజీవి - సునీల్‌ల మధ్య చిత్రీకరించనున్నారట. ఇది కాకుండా, సునీల్‌ - చిరంజీవి కలిసి ఓ పాటలో వీణ స్టెప్‌ వేయనున్నారనీ, ఆ పాట కోసం చిరంజీవి కోరిక మేరకు లారెన్స్‌ రంగంలోకి దిగుతున్నాడనీ గుసగుసలు విన్పిస్తున్నాయి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో. 

సునీల్‌ ఒక్కడే కాదు, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ కూడా ఈ పాటలో కన్పిస్తాడట, వీణ స్టెప్పు వేసేస్తాడట. ఇదెంత నిజమోగానీ, తెలుగు సినీ రంగంలో వీణ స్టెప్‌ని వాడేసినంతగా ఇంకే స్టెప్‌నీ వాడి వుండరు. ఆఖరికి పవన్‌కళ్యాణ్‌ కూడా, ఇటీవల వచ్చిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా కోసం వాడేశాడు. ఎంతలా అరగదీసేసినా సరే, ఆ స్టెప్‌కి వున్న క్రేజ్‌ వేరప్పా. ఆ క్రేజ్‌తోనే మెగాస్టార్‌ చిరంజీవి నటించే సినిమాకి మళ్ళీ ఆ స్టెప్‌ని ప్లాన్‌ చేస్తున్నారట.

Show comments