వాళ్ళందరికీ రోజాకి పట్టిన గతేనా.?

అసెంబ్లీలో ముఖ్యమంత్రిపైనా, సాటి ఎమ్మెల్యేపైనా నోరు పారేసుకున్నందుకుగాను, సభా సంప్రదాయాల్ని కించపర్చేలా వ్యవహరించినందుకుగాను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే. అయితే, ఇదంతా కుట్రపూరిత చర్య అనీ, తనపై అకారణంగా చర్యలు తీసుకున్నారని రోజా ఆరోపిస్తూ వస్తున్నారు. మరోపక్క, ఆమె అసెంబ్లీకి క్షమాపణ చెప్పారనే ప్రచారమూ జరుగుతోంది. మరోపక్క, కోర్టుల్లోనూ న్యాయపోరాటం చేసిన రోజా, అక్కడా తగిన ఊరట పొందలేకపోయారనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, తాజాగా 12 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు సభా హక్కుల ఉల్లంఘన ఆరోపణల మేరకు నోటీసులను జారీ చేసింది అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ. ఈ నోటీసుల మేరకు 25, 26 తేదీల్లో ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలు, ప్రివిలేజ్‌ కమిటీ ముందు విచారణకు మాజరు కావాల్సి వుంటుంది. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, కోరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గారెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, పాశం సునీల్‌కుమార్‌, కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులు తదితరులు నోటీసులు అందుకున్నవారిలో వున్నారు. 

అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఎన్నిసార్లు మొత్తుకున్నా స్పీకర్‌ స్పందించలేదనీ, అలాగే అధికారపక్షంపై తాము చేసిన ఫిర్యాదుల్నీ పట్టించుకోలేదనీ, అలాంటప్పుడు తమ మీదనే ఎందుకు కుట్రపూరితంగా ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం నినదించడమే తప్పా.? అలాగైతే మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్‌ చేసినా, ప్రత్యేక హోదా కోసం నినదించడం మానేది లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వైవీ విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

ఎవరి వాదనలు ఎలా వున్నా, అసెంబ్లీలో అధికార పక్షం తీసుకునే నిర్ణయాల ప్రకారమే అక్కడ చర్యలుంటాయి. ఇది క్రిస్టల్‌ క్లియర్‌. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అది నైతికతా.? అనైతికతా.? అన్నది వేరే చర్చ. ఏడాదిపాటు సస్పెండ్‌ అయిన రోజా వ్యవహారమే ఇందుకు నిదర్శనం. అసెంబ్లీ నిర్ణయాల్లో న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకోలేని పరిస్థితులు వుండడంతో, 'స్పీకర్‌పై దాడి చేశారు..' అంటూ పైన పేర్కొన్న 12 మంది ఎమ్మెల్యేలపై అధికార పక్షం ఆరోపిస్తున్న దరిమిలా.. ఆ పన్నెండు మందిలో అందరికీ, లేదా కొందరికైనా రోజా తరహా 'శిక్ష' తప్పకపోవచ్చు.

Show comments