భూమా కు ‘పునీత’ హోదా ఖాయం?

“రౌడీ షీటర్’’ ఇదేదో సినిమా టైటిల్ కాదు... ఈ మాటను బాగా వాడారు తెలుగుదేశం నేతలు. సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా భూమా నాగిరెడ్డిపై విరుచుకుపడటానికి తెలుగుదేశం నేతలు ఈ మాటను వినియోగించారు. అసెంబ్లీలో కాలువ శ్రీనివాసులు పలు సార్లు భూమా నాగిరెడ్డిని  రౌడీ షీటర్ గా సంబోధించాడు. ఈ విషయాన్నే చాలా మంది గుర్తు చేశారు...  తెలుగుదేశం వాళ్లకు. భూమా నాగిరెడ్డిని తెలుగుదేశంలో చేర్చుకున్న సందర్భంలో ఒక రౌడీ షీటర్ ను తెలుగుదేశంలో ఎలా చేర్చుకుంటున్నారు? అని కొంతమంది ప్రశ్నించారు.

వైకాపా ఎమ్మెల్యే అయిన భూమా నాగిరెడ్డికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హోదా అది. నంద్యాల మున్సిపాలిటీ మీటింగ్ జరిగిన సమయంలో జరిగిన అలజడి నేపథ్యంలో నాగిరెడ్డిపై రౌడీ షీట్ తెరిచారు. అప్పట్లో అది అన్యాయం అని వైకాపా వాళ్లు మొత్తుకున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకుకూడా అదే అనిపిస్తున్నట్టుగా ఉంది.

తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని చాన్నాళ్లు అయిన నేపథ్యంలో రౌడీ షీటర్ ముద్రను భూమాకు తొలగించడంలో చొరవ చూపుతోందట ప్రభుత్వం. వైకాపా ద్వార సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తెలుగుదేశంలో చేరిన నాగిరెడ్డి పై రౌడీషీట్  ను ఎత్తేయడం గురించి కర్నూలు జిల్లా పోలీసుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారట. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇందుకు సంబంధించిన ఆదేశాలు రావడంతో ఇక భూమాపై రౌడీషీట్ వీగిపోవడమే తరువాయి అని అనుకోవాలి.

ప్రతిపక్షంలో ఉంటే రౌడీ షీటర్లు అయిపోవడం ఎంత సులభమో... అదే వ్యక్తులు అధికార పార్టీ లోకి వస్తే పునీతులు అయిపోవడం కూడా అంతే సులభంగా మారిందన్న గేమ్ ను చాలా సులభంగా ఆడేస్తోంది చంద్రన్న ప్రభుత్వం. ప్రజలు గమనిస్తున్నారన్న భయం భక్తులేమీ లేవు! అంతా బరితెగింపే!

Show comments