గో సంరక్షకులారా.. మీ అభిమానానికో పరీక్ష!

ఎవరో ఆవు మాంసం తిన్నారని.. అనుమానంతోనే వారిని చంపేసేంత అభిమానం మనది. ఆవు గొప్పదనం గురించి అనర్గళంగా ఫేస్‌బుక్‌లో రాయగల, వాట్సాప్ షేర్ చేయగల ధీరులు మనం. ఆవు మీద మీకు అపారమైన అభిమానం. ఆవు అమ్మలాంటిది.. ఆవు దేవత అనే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని వందశాతం పాటిద్దాం. ఆవును అమ్మగా చూసుకుందాం, దేవతలా ఆరాధిద్దాం.

మరి రండి... ముందుకు రండి.. మీ వంతుగా రాయలసీమలో ఆవుల మనుగడకు ఏం సహాయం చేస్తారో చెప్పండి. వాట్సాప్‌లలో, ఫేస్‌బుక్‌లలో ఆవు గొప్పదనం గురించి వ్యాసాలు రాయడం కాదు.. ఇప్పుడు రాయలసీమ రైతాంగం విపత్తును ఎదుర్కొంటోంది. ఈ ఏడాది వేరుశనగ పంట నష్టం అత్యంత తీవ్రంగా ఉంది. కనీసం పశువుల మేత కూడా కష్టం అయిపోయింది. పదెకరాల పంట నుంచి కూడా బండెడు గ్రాసం రావడం లేదు. దీంతో.. ఉన్న ఆవులకు, ఎద్దులకు మేత ఎలా? అనే దిగులు పట్టుకుంది రైతులకు. 

వానలేదు.. పంటలేదు.. దీంతో పశుపోషణ అసలు సాధ్యం అయ్యే పని కాదు. ఆవు పాల ఉత్పత్తిలో రాయలసీమ చాలా గొప్ప పాత్ర పోషిస్తూ వస్తోంది. పశుగ్రాస కొరతతో ఇప్పుడు పశుపోషణ కష్టం అయిపోతోంది. ఆవుల కడుపులు మాడ్చలేరు.. గడ్డి తెచ్చి వేయలేరు.. రెండే మార్గాలు.. రైతు ఆత్మహత్య చేసుకోవాలి, లేదా ఆవులను, ఎద్దులను కబేలాకు తోలాలి. 

ఇది వాస్తవ సమస్య. సీమకు చెందిన వాళ్లకు అవగాహన ఉంటుంది. అవగాహన లేని వాళ్లు ఒక్కసారి రాయలసీమలో పర్యటించవచ్చు. పరిస్థితి తెలుసుకోవచ్చు. మరి రండి.. ఆవు మీద మీ అభిమానం ఎంత, దేవతలాంటి ఆవులకు పశుగ్రాస కొరత వచ్చిన నేపథ్యంలో రైతాంగ కుటుంబాలకు అండగ నిలబడి.. దూర ప్రాంతాల నుంచి అయినా రైతులు గడ్డి తెప్పించుకునేందుకు మీరు సాయంగా రండి. ఆవు గొప్పదనం గురించి ఎన్ని ఫేస్‌బుక్ పోస్టులు పెట్టినా రాని పుణ్యం.. ఒక్క ఆవుకు తగిన పశుగ్రాసాన్ని సమకూర్చి పెడితే వస్తుంది. మరి ముందుకు వచ్చే దమ్ము ఎంత మంది హిందుత్వవాదులకు ఉంది? కబుర్లు చెప్పకుండా.. ఆవులపై ఆత్మీయతను చాటుకునే సత్తా ఎంతమందికి ఉంది?

Show comments