సత్యసాయి తర్వాత.. జయలలితే..

ఆసుపత్రులే రాజకోట రహస్య స్థావరాలుగా మారుతున్నాయి. ప్రముఖులు.. సామాన్యుల ఆదరణ చూరగొన్న వారు.. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయిన సందర్భాల్లో, వారి పరిస్థితి విషయమించిన సందర్భాల్లో… తీవ్రమైన ప్రతిష్టంభన, అసలు విషయాలను వెల్లడించకుండా హైడ్రామా నడిపించడం.. ఇది వరకూ పుట్టపర్తి సత్యసాయి బాబా శివైక్యం సందర్భంలోనూ ఇలాంటి హై డ్రామానే నడిచింది. ఇప్పుడు జయలలిత అనారోగ్యం విషయంలో నడుస్తున్న హైడ్రామా సత్యసాయి ఉదంతాన్ని గుర్తు చేస్తోంది.

సత్యసాయి ని ఆయన సొంత ఆసుపత్రిలోనే ఉంచి.. ఆయన మరి లేరన్న విషయాన్ని ప్రకటించడంలో ఆశ్రమ వర్గాలు, ఆయన వారసులు హైడ్రామాను నడిపించారు. ఆయన తుదిశ్వాస ఎప్పుడు విడిచాడు? ఆ విషయాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఏయే వ్యవహారాలను సర్ధిపెట్టుకున్నాకా.. సత్యసాయి మరిలేరన్న విషయాన్ని ప్రకటించారు? అనేది ఇప్పటికీ మిస్టరీనే.

సత్యసాయి పై మహోన్నత స్థాయిలో నమ్మకాన్ని కలిగిన ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించాయి ట్రస్టు వర్గాలు. సాయి శివైక్యం అనంతరం షిర్డీ స్థాయిలో ఎదగాల్సిన పుట్టపర్తి, ఇప్పుడు ఉనికి పాట్లు పడుతోందంటే.. దానికి కారణం సాయి ఆశ్రమవర్గాలే అనడానికి సందేహించనక్కర్లేదు. నాటి ప్రభుత్వం కూడా ఆ హైడ్రామాలో తమవంతు పాత్రను పోషించింది.

ఇక ఇప్పుడు జయలలిత విషయంలోనూ అలాంటి ప్రతిష్టంభనే నెలకొంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వం కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ.. ఇంత వరకూ బాధ్యతాయుతమైన ప్రకటనలేవీ చేయలేదు. సెప్టెంబర్ 22వ తేదీన జయ ఆసుపత్రి పాలైతే.. తొలి రోజుల్లో ఆమెకు అస్సలేం కాలేదన్నారు, ఆ తర్వాత ఆమె ను ఐసీయూలో పెట్టామన్నారు, ఎవ్వరూ కలవడానికి వీల్లేదన్నారు. అలా కొన్ని రోజుల ప్రతిష్టంభన అనంతరం.. ఆమె కోలుకుంటోందని ప్రకటనలు చేశారు.

మరి డిశ్చార్జి ఎప్పుడు అంటే.. ఆమెకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు అని వైద్యులు ప్రకటించడం విడ్డూరం. అలా ఆమె కోలుకుంటోందని ప్రకటిస్తూనే.. గుండెపోటుకు గురైందనే మాట చెప్పారు. ఇక ఈ వ్యవహారంలో ప్రభుత్వం కూడా సరిగా వ్యవహరించడం లేదనేది కాదనలేని విషయం. ఒకవైపు హై అలర్ట్ మరోవైపు హైడ్రామా.. ఈ వ్యవహారంలో తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలు ఏదో గూడుపుఠానీ నడుపుతున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.

ఇక డాక్టర్లేమో.. తమ చేతుల్లో ఏమీ లేదు, అంతా దైవాధీనం అనేశారు. క్రమం చేస్తున్న ఈ ప్రకటనలు జయలలిత అభిమానుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఒక రాష్ట్ర ప్రజల ఆరాధ్య నేత విషయంలో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. జయ ఆరోగ్యం విషయంలో పుకార్లకు తావిస్తోంది ప్రభుత్వం. ఆ పుకార్లు ఎలాంటి పరిణామాలకు అయినా దారి తీయవచ్చు. మొదటి నుంచి ప్రభుత్వం ఈ విషయాన్ని ఎరిగి నడుచుకోవాల్సింది.  

Show comments