‘సాక్షి’ తెలుగుకు ఇంగ్లిష్ తెగులు!

ఒకవైపు ‘ఈనాడు’ పత్రిక వారి వికృత అనువాదాలతో తెలుగు పాఠకులు బిక్కచచ్చిపోతున్నారు. ఇంగ్లిష్ పదాలను తెలుగులోకి అనువదించే క్రమంలో వారు అను’వధి’స్తున్నారు. వాళ్లు ఏ రోజు ఏ ఇంగ్లిష్ పదాన్ని ఏ రకంగా తెలుగులోకి అనువదిస్తారో భయమేస్తూ ఉంటుంది. ఇంగ్లిష్ పదాలకు తెలుగులో సమానార్థాలు వాడాలన్న తపన మంచిదే కానీ.. ఆ అనువాదాలు మరీ కృతకంగా ఉండటంతో, వికృత సమాసాలను వినియోగించడంతో వారి తెలుగుపై తెలుగు వారి నుంచే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. 

ఇక మరో తెలుగు పత్రికారాజం ‘సాక్షి’ మరో రకంగా తెలుగుకు తెగులు పుట్టిస్తోంది. ఈ రోజు అనగా.. శనివారం.. “సాక్షి’’ ఫ్యామిలీ పేజ్ లో బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రచురించారు. 

నిజమే.. జ్వాలకు తెలుగు రాకపోవచ్చు. ఆమె  తను చెప్పదలుచుకున్న విషయాలను ఇంగ్లిష్ లోనే చెప్పి ఉండవచ్చు. అంతమాత్రానా.. మొత్తం ఇంగ్లిష్ లోనే రాసి పబ్లిష్ చేస్తారా?!

ఈ ఇంటర్వ్యూ ఆసాంతం.. ఇంగ్లిష్ ను తెలుగులో రాశారు అంతే! ఏదో ఊతం కోసం కొన్ని ఆంగ్ల పదాలను వాడుకోవడం తెలుగు జర్నలిజంలో జరుగుతున్నదే. మరి కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగులో అర్థాలే ఉండవు కాబట్టి.. వాటినీ అలాగే వాడుకోవచ్చు. కానీ.. ‘సాక్షి’ ఇంగ్లిష్ తెగులు మాత్రం  పతాక స్థాయికి వెళ్లింది.

ఆ ఇంటర్వ్యూలో ఎన్ని ఇంగ్లిష్ పదాలు ఉన్నాయో.. వాక్యాలు వ్యాక్యాలనే ఇంగ్లిష్ లోనే ఎలా రాసేశారో.. ఎర్ర ఇంకుతో అండర్ లైన్ చేయగా, అంతా రక్తపాతమే అయిపోయింది.

ఇంగ్లిష్ పదాలను వాడుతూ తెలుగు రాస్తే.. తామేదో గొప్ప వాళ్లం అని చదివే జనాలు అనుకుంటారని తెలుగు విలేఖరులు భ్రమలో ఉన్నారా? లేక తమకు ఇంగ్లిష్ వచ్చన్న విషయాన్ని ఇలా చెప్పుకోదలిచారా? అంతగా ఇంగ్లిష్ వచ్చి ఉంటే.. ఎంచక్కా ఆంగ్ల జర్నలిజంలోకి వెళ్లిపోవచ్చు. కానీ తెలుగు పాఠకులను ఇలా హింస పెట్టడం ఎందుకు?

రాసిన జర్నలిస్టు మాత్రమే కాదు.. దీన్ని దిద్దిన సబ్ ఎడిటరు, ఈ ఫీచర్స్ ఎడిటరు, ఎడిటరు కూడా.. ఈ తెగులుకు బాధ్యత వహించాల్సిన వ్యక్తులే!

దయగల ‘సాక్షి’ ఉద్యోగులు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే.. జ్వాలకు ఇంగ్లిష్ వచ్చు, మీ రిపోర్టర్ కూ ఇంగ్లిష్ వచ్చు.. కానీ మీది తెలుగు పత్రిక అనే ఆశతో కొనే పాఠకులు ఉంటారు. తెలుగులో చదవాలనే కోరికతో పేపర్ ను కొనే వాళ్లుంటారు. వాళ్లకు తెలుగు మాత్రమే వచ్చు..  వాళ్ల కోసమే మీరు పని చేస్తున్నారు. కావున ఆ విషయాన్ని అర్థం చేసుకుని.. కొంచెం తెలుగులో వార్తలు రాస్తే బావుంటుంది. మ్యానిక్యూర్, పెడీక్యూర్, పర్సనల్ హైజీన్.. అంటూ మీరు రాస్తూ పోతే, వాటి అర్థాల కోసం డిక్షనరీలు వెదుక్కోవడం తెలుగు పాఠకుల పని కాదు. 

ఇక రాసిన ఇంగ్లిష్ లో కూడా ఎన్ని దోషాలు ఉన్నాయో లెక్క పెడితే అదో ప్రహసనం అవుతుంది. ఇంగ్లిష్ లో ‘బాటిల్’ ‘బ్యాటిల్’ అనే పదాల మధ్య చాలా తేడా ఉందని ‘సాక్షి’ జర్నలిస్టులు తెలుసుకోవాలి. 

Show comments