ఇంకా సమయం రాలేదు...!

'అనుకున్నామని జరగవు అన్ని....అనుకోలేదని ఆగవు కొన్ని'...అన్నారు ఆచార్య ఆత్రేయ ఓ పాటలో. పెద్దవాళ్లు 'ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది' అంటారు. 'ఆ సమయమొస్తే నువ్వు వద్దన్నా ఆగదు'...అంటారు కొందరు. విజయాలు దక్కనివారు అందుకు తమ లోపాలేమిటో, పొరపాట్లేమిటో చెప్పరు. 'టైమ్‌ రాలేదు' అంటారు. తెలుగులో ఇంకో సామెత ఉంది. 'కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదు' అంటారు. కక్కు మనకు ముందుగా చెప్పి రాదు. వస్తే దాన్ని ఆపలేం. పెళ్లి కూడా అంతే. అది కుదరాలేగాని కుదిరితే ఆగదు. ఇలా 'సమయం' గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. 

కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ గురించి కూడా కాంగ్రెసు నాయకులు 'ఇంకా సమయం రాలేదు' అని చెబుతున్నారు. దేనికి సమయం రాలేదట...! రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చునేందుకు, ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఇంకా సమయం రాలేదని చెబుతున్నారు. ఆ సమయమేదో వారే నిర్ణయించుకోవాలని కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. రాహుల్‌ కాంగ్రెసు అధ్యక్షుడు కావాలనే కోరిక, ప్రియాంక యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రావాలనే కోరిక రెండూ చాలా కాలం నుంచి ఉన్నాయి. 

కాని ఎప్పటికప్పుడు ఇవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇందుకు ఇతర కారణాలు అనేకమున్నా 'సమయం రాలేదు' అని చెప్పుకోవడం చాలా సులభంగా ఉంటుంది. రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి తగినవాడు కాడని అభిప్రాయపడేవారు కాంగ్రెసులో అనేకమంది ఉన్నారు. ఓసారి ఆయన  పార్లమెంటు సమావేశాలు జరిగేముందు చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోయినప్పుడు ఆయన అధ్యక్షుడిగా పనికిరాడని అన్నవారిలో దిగ్విజయ్‌ సింగ్‌ కూడా ఉన్నారు. రాహుల్‌ విఫల నాయకుడనే ముద్ర పడటంతో ఆయన అధ్యక్షుడైతే కాంగ్రెసు పార్టీకి భవిష్యత్తు ఉండదనే సెంటిమెంటు పార్టీలో వ్యాపించింది. ఇక ప్రియాంక గాంధీపై ఇందుకు భిన్నమైన అభిప్రాయముంది. 

పార్టీ పగ్గాలు ఆమెకు ఇస్తే మరో ఇందిరా గాంధీ అవుతుందని నాయకులు అంటున్నారు.  వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నందున ఆమె చేత ప్రచారం చేయించాలని పార్టీ నిర్ణయించింది. కాని ఆమెను ప్రచారానికి మాత్రమే పరిమితం చేయకుండా కీలక బాధ్యతలు అప్పగించాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి కాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలంటున్నారు. తాజాగా రాహుల్‌ గాంధీ 'నా సోదరి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే చూడాలనుంది' అని వ్యాఖ్యానించారు. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆమె ఇష్టమని, ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని చెప్పారు. దిగ్విజయ్‌ కూడా ఇదే అన్నారు. 

ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే ప్రత్యక్ష రాజకీయల్లోకి వచ్చేందుకు జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఇంకా సమయం రాలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని కాకినాడలో సభలో ఆవేశంగా ప్రకటించిన ఈ హీరోకు అందుకు ఇంకా టైమ్‌ రాలేదు. సభ నిర్వహించిన చాలా రోజులైనా ఆయన ఏమీ మాట్లాడటంలేదు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు.  రెండు సినిమాల్లో తీరిక లేకుండా ఉన్న పవన్‌ అవి పూర్తయ్యాకనే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ప్రత్యేక ప్యాకేజీ (వాస్తవానికి ప్రత్యేక సాయం) పైన ఇప్పటికే చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకుల, వెంకయ్య నాయుడు, బీజేపీ నేతల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. 

మూడు నాలుగు భారీ సభలు పెట్టి అమిత్‌ షా తదితర పెద్ద లీడర్లు కూడా ప్రచారం చేయబోతున్నారు. పవన్‌ రంగంలోకి దిగేనాటికి ప్రజలు 'ప్రత్యేక సాయం  బాగానే ఉంది కదా'..అనుకునే పరిస్థితి ఏర్పడుతుందేమో...! ఇక తెలంగాణలో టీడీపీ, కాంగ్రెసు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ లాగిపారేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు కూడా. దీనిపై టీడీపీ హైకోర్టులో వేసిన పిటిషన్లపై దానికి అనుకూల నిర్ణయం వెలువడింది. ఫిరాయింపుదారులపై (అనర్హత వేటు వేయడానికి) మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకరును కోరింది. 

జంప్‌ జిలానీలపై అనర్హత వేటు పడటం, ఉప ఎన్నికలు జరగడం, తాము గెలవడం ఖాయమని 'పచ్చ' నాయకులు సంబరపడుతున్నారు. హైకోర్టు నిర్ణయం ఏపీ స్పీకరునూ ప్రభావితం చేయొచ్చని, కాబట్టి టీడీపీలోకి ఫిరాయించిన ఇరవైమంది వైకాపా ఎమ్మెల్యేలపై వేటు పడొచ్చని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ వేటు వేయకపోతే 'సరైన సమయం'లో హైకోర్టుకు వెళతామని అన్నారు. అయితే ఆ సమయం ఎప్పుడో చెప్పలేం. వైకాపా ఎమ్మెల్యేలు ఫిరాయించి చాలా కాలమైంది. అయినా ఇప్పటివరకు కోర్టుకు వెళ్లేందుకు సమయం రాలేదు. తెలంగాణలో పరిస్థితి చూశాక కోర్టుకు వెళ్లాలనే ఆలోచన కలుగుతోంది. జీవితంలోనైనా, పాలిటిక్స్‌లోనైనా తగిన సమయం రాందే పనులు జరగవు...!

Show comments