రాజీనామా అస్త్రం సంధించిన బొజ్జల!

తనను మంత్రి పదవి నుంచి తొలగించడం పట్ల ఆవేధన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై రాజీనామా అస్త్రం సంధించాడు బొజ్జలగోపాల కృష్ణా రెడ్డి. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్పీకర్ కోడెలకు పంపించారాయన. అనారోగ్యం కారణాలను చూపి తనను మంత్రి పదవి నుంచి తొలగించారని, అలా అయితే తను ఎమ్మెల్యే పదవికి కూడా పనికిరానని పేర్కొంటూ బొజ్జల లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. తనకు మంత్రిగానే కాదు, ఎమ్మెల్యేగా ఉండే అర్హత కూడా లేదని, తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది.

మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన అసంతృప్తి సెగలు తెలుగుదేశం పార్టీలో హాట్ హాట్ గా ఉన్నాయి. మూడేళ్ల తర్వాత జరిగిన విస్తరణలో ఫిరాయింపుదారులకే పెద్ద పీట పడే సరికి పార్టీలోని పాత కాపులు భగ్గుమంటున్నారు. పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లు, పదవులు కోల్పోయిన వాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల  ప్రాపర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖను పంపించారు. ముందు రోజు కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని మరీ బాబును కలిసి తన పదవి గురించి విజ్ఞప్తి చేసుకున్నాడట బొజ్జల. అయినా బాబు తొలగించడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారట. అయితే.. ఇది ఉత్తుత్తి రాజీనామానే అనుకోవాల్సి వస్తోంది. దీన్ని ఆమోదించే అవకాశాలు ఏ మాత్రమూ లేవు.

Show comments