చిరంజీవికి అన్నీ లైన్‌లోనే వున్నాయట

150వ సినిమా అనే ప్రచారం జరుగుతున్నా, ప్రస్తుతానికి చిరంజీవి చేస్తున్నది 151వ సినిమా. 'బ్రూస్‌లీ' సినిమానే 150వ సినిమాగా చిరంజీవి ప్రకటించేసిన విషయం విదితమే. ఆ లెక్కన తమిళ 'కత్తి'ని రీమేక్‌ చేస్తున్న చిరంజీవి, దీనికి ఇవ్వాల్సిన నెంబర్‌ 151. నెంబర్‌ ఏదైతేనేం, బాస్‌ ఈజ్‌ బ్యాక్‌.. అని అభిమానులు సరిపెట్టుకుంటున్నారు. 150 అంటే ల్యాండ్‌ మార్క్‌ గనుక, 'బ్రూస్‌లీ' ఫెయిలయ్యింది గనుక, 'కత్తి' రీమేక్‌ని ప్రస్తుతానికి 150గా అభిమానులు భావిస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. 

'కత్తి' తర్వాతి సంగతేంటి.? అంటే, ముందు 'కత్తి' రీమేక్‌ ప్రేక్షకుల ముందుకు రానివ్వండి.. అంటున్నారు చిరంజీవి. ఆ తర్వాత ఎలాగూ వరుసగా సినిమాలుంటాయని హింట్‌ ఇచ్చేశారు. పైగా, చకచకా సినిమాలు చేసెయ్యాలనే తపనతో వున్నారట మెగాస్టార్‌. పూరి జగన్నాథ్‌తో చేయాల్సిన సినిమా బహుశా 'కత్తి' రీమేక్‌ తర్వాత వుంటుందన్నది తాజా ఖబర్‌. ఆ సినిమాపై పూరి ఇంకా ఆశలు వదులుకోలేదు. చిరంజీవి కూడా ఆ సబ్జెక్ట్‌ మీద ఇంట్రెస్ట్‌తోనే వున్నట్లు తెలుస్తోంది. 

ఇక, నిర్మాతగా తన కుమారుడు రామ్‌చరణ్‌ చాలా కష్టపడాల్సి వస్తోందని చిరంజీవి వాపోతున్నారు. అక్కడ 'ధృవ' సినిమా పనుల్లోనూ, ఇక్కడ తన సినిమా నిర్మాణంలోనూ రామ్‌చరణ్‌ బిజీగా వుండడం తనకు కొంచెం బాధగానే వుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. మిగతా విషయాలెలా వున్నా, 'కత్తి' రీమేక్‌ తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తానని హామీ ఇవ్వడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. అయితే, 'కత్తి' రీమేక్‌ పట్టాలెక్కించడానికే చిరంజీవి చాలా టైమ్‌ తీసుకున్నారు. మరి, తదుపరి సినిమాలు లైన్‌లోనే వున్నా, ఆ లైన్‌ ఎప్పటికి ముందుకు కదిలేనో.! 

Show comments