టీడీపీ టీ కప్పు తుపాను ముగిసినట్టే..!

పుష్కరాల ఆహ్వానాలంటూ ఢిల్లీ వెళ్లాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక  ప్రత్యేక హోదా అంశంపై ప్రధానమంత్రిని ఏపీ ఎంపీలు కలవబోతున్నారని మూడ్రోజుల నుంచి కొనసాగిన హడావుడి కూడా ఈ రోజుతో ముగిసింది. ఇక ఉభయ సభల సమావేశాల్లో కూడా ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతల ఢిల్లీ అప్ డేట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

పుష్కరాల పిలుపుల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు.. మోడీకి కూడా స్పష్టం చేశారట.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇరు పార్టీలూ మునిగిపోతాయని! మరి నిన్నటి వరకూ ప్రత్యేక హోదా అంశంతో మాకు సంబంధం లేదు.. ఇది ఇవ్వకపోతే బీజేపీకే ప్రమాదం అని పచ్చ చొక్కాలు వాదించేవి. బీజేపీ ఏపీని మోసం చేస్తోందంటూ వీరు విరుచుకుపడే వారు. అయితే బాబు మాత్రం రెండు పార్టీలూ మునుగుతాయి జాగ్రత్త అని హెచ్చరించారట. మరి ఇది నిజంగా నిజమే అయితే మంచిదే. ఇలా భయపడి అయినా.. బీజేపీ వాళ్లు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తారు.

అలాగక ఏదో.. పచ్చ లీకేజీలా ఈ మాట ప్రచారంలోకి వచ్చి ఉంటే.. చివరకు ఈ లీకేజీలో బాబు వెర్షన్ నిజం అవుతుంది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తేల్చకపోతే అందుకు తెలుగుదేశం కూడా ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.

ఇక మూడు రోజులుగా ప్రధానమంత్రితో తెలుగుదేశం ఎంపీల సమావేశం గురించి హడావుడి సాగింది కానీ.. పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు ఆ సమావేశం. ఉద్ధండ పిండాలన్నీ వెళ్లి మోడీ ని కలిస్తే.. వారికి ఆయన పది నిమిషాలు కేటాయించారట. మరి పది నిమిషాల్లో వీళ్లేం చెప్పి ఉంటారు.. ఆయనేం చెప్పి ఉంటారు.. అని ఆరా తీస్తే .. “మీ బాధ నా బాధ కాదా..’’ అన్నారట ప్రధానమంత్రి! మీరు ఏం చెప్పకండి.. నాకు అంతా తెలసు.. మీకు న్యాయం చేస్తా.. అనే మాటనే “మీ బాధ నా బాధ కాదా’’ అన్న ఏకైక  డైలాగ్ తో చెప్పి పంపించాడట మోడీ. ఇంతటితో ఎంపీల హడావుడి కూడా ముగిసింది.

ఏతావాతా.. హెచ్చరించడాలు.. విజ్ఞప్తి చేయాడాలకు ఈ రోజుతో ముగింపును ఇచ్చారు తెలుగుదేశం ఎంపీలు, తెలుగుదేశం అధినేత. లోక్ సభ, రాజ్యసభలో కూడా  ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం స్పందించడాన్ని ఆపేసింది. మరి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీల టీకప్పు తుపాను ఇంతటితో ముగిసింది.. ఇక కొన్నాళ్లు ఎవరి పనులు వాళ్లవి.. మళ్లీ మరోసారి, మళ్లీ ఇదే హడావుడి.. అప్పుడు ఇవే హెచ్చరికలు, ఇవే రాజీలు. ఇంకో రెండేళ్లు ఇలాగే..? 

Show comments