లోకేషా.. తాతల గోలలో లాజిక్ మరిచావా..!

మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు నాకండి.. అని తెలుగులో ఏనాడో వారసత్వ వ్యవహారాలపై, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్లపై సామెతను చెప్పారు. ఆ సామెతకు అనుగుణంగా నడుచుకొంటున్నట్టుగా ఉన్నాడు నారా లోకేష్ బాబు.

మహానాడు ప్రసంగంలో తన తాత గురించి, తన తనయుడి తాత గురించి చెప్పుకొచ్చాడు చంద్రన్న తనయుడు. ‘నేను పుట్టే నాటికి నా తాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా తనయుడు పుట్టే నాటికి వాడి తాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు..’ అనేది లోకేష్ బాబు ఉవాచ.

మరి ఇది ఏ రకంగా గొప్పదనమో లోకేష్ బాబు మరింతగా వివరించాల్సి ఉంది. అయినా.. ఇక్కడ లోకేష్ బాబు లాజిక్ తప్పిన వైనం స్పష్టంగా అర్థం అవుతూనే ఉంది. అదెలాగంటే.. లోకేష్ తనకు తాతగా ఎన్టీఆర్ ను, తన తనయుడికి తాతగా చంద్రబాబును ప్రస్తావించరని అనుకోవాలి.

తన విషయంలో తల్లి యొక్క తండ్రిని, తన తనయుడి విషయంలో మాత్రం తన తండ్రిని లోకేష్ ప్రస్తావించాడు. సూటిగా చెప్పాలంటే.. లోకేష్ కు తాత నారా ఖర్జూర నాయుడు అవుతాడు తప్ప ఎన్టీఆర్ కాడు. ఎన్టీఆర్ కూడా తాతే కానీ, అది వేరే ముచ్చట. ఒకవేళ ఎన్టీఆర్ నే తాతగా పేర్కొనాలని లోకేష్ అనిపిస్తే.. తన తనయుడి కి తాతగా బాలయ్య ను ప్రస్తావించాలి. 

ఏదేమైనా.. లోకేష్ బాబు కొన్ని విషయాల్లో నారా వారసుడిగా, కొన్ని విషయాల్లో నందమూరి వారసుడిగా చెప్పుకొంటున్నాడు. హైందవ సంప్రదాయంలో, తెలుగిళ్లలో తల్లి యొక్క తండ్రి గొప్పదనాన్ని ఎవ్వరూ అంటించుకోరు. తండ్రి యొక్క తండ్రి వారసత్వమే ఘనం. అందుకు భిన్నంగా లోకేష్ మాత్రం ఎన్టీఆర్ మనవడిని అని చెప్పుకోవడానికి తాపత్రయ పడుతూ.. నారా ఖర్జూర నాయుడిని అది కూడా ది గ్రేట్ చంద్రబాబు తండ్రిని మాట మాత్రమైనా తలవకుండా ఉన్నాడు పాపం! ముఖ్యమంత్రి అయ్యుంటేనా తాతనా?

Show comments