'లడ్డూ' కావాలా 'పవర్‌'స్టారూ.!

'లడ్డూ..' అంటూ ఆ మధ్య సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత 'పవర్‌'స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ బీభత్సమైన సాంగ్‌ని కూడా విడుదల చేసేశారు. ప్రత్యేక హోదాకి కేంద్రం పాతరేసిన వైనంపై నిప్పులు చెరిగేస్తూ, 'పాచిపోయిన లడ్డూ..' అంటూ ప్రత్యేక ప్యాకేజీపై విరుచుకుపడిపోయారు. అప్పట్లో పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక హోదా పేరుతో బీజేపీ మీద చేసిన యాగీ అంతా ఇంతా కాదు.! కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపైనా పవన్‌కళ్యాణ్‌ విమర్శలతో చెలరేగిపోయారు. 

రోజులు మారాయి.. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ రూటూ మారింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాస్తా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కానున్న దరిమిలా, వెంకయ్యనాయుడుగారికి 'శుభాకాంక్షలు' తెలిపేశారు పవన్‌కళ్యాణ్‌. వెంకయ్యను తెలుగు బిడ్డగా అభివర్ణించేశారు. నిజమే, తెలుగు గడ్డ మీద నుంచి రాజకీయ నాయకుడిగా జాతీయ స్థాయికి ఎదిగినందున, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోనున్న దరిమిలా, మామూలుగా అయితే ఆయనకు ప్రతి తెలుగు వ్యక్తీ శుభాకాంక్షలు తెలపాల్సిందే. 

కానీ, తెలుగు నాట ప్రత్యక్ష రాజకీయాలకు ఆయనెప్పుడో దూరమైపోయారు. రాజ్యసభకు కర్నాటక నుంచి ప్రాతినిథ్యం వహించారు, ఆ తర్వాత గుజరాత్‌కి చెక్కేశారు. అయినాసరే, తెలుగు గడ్డ మీద వెంకయ్యకు మమకారం తగ్గిపోలేదుట.! ఎలాగైతేనేం, వెంకయ్య కేంద్ర మంత్రి పదవి నుంచి ఉపరాష్ట్రపతి పదవికి ప్రమోషన్‌ పొందుతున్నారు. ఇది నిజంగానే ప్రమోషనా.? అన్నది వేరే విషయం. 

పవన్‌కళ్యాణ్‌, వెంకయ్యనాయుడికి 'శుభాకాంక్షలు' తెలపడమే ఆసక్తికరం. పైగా, తెలుగు బిడ్డ.. అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు జనసేన అధినేత, వెంకయ్యనాయుడికి పత్రికా ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, బీజేపీకి సైతం అభినందనలు తెలిపేశారు పవన్‌కళ్యాణ్‌. తెలుగువారంతా గర్వపడాల్సిన విషయమని పేర్కొన్నారండోయ్‌.! 

ఇదంతా చూస్తోంటే, 'ఏం బాబూ పవన్‌కళ్యాణ్‌.. నీక్కూడా లడ్డూ కావాలా.?' అన్న భావన కలుగుతోంది ప్రతి ఒక్కరికీ. రాజకీయ పార్టీ అధినేతగా 'కర్టసీ' కోసం పవన్‌కళ్యాణ్‌, ప్రకటన ఇచ్చి ఊరుకోవడం వరకూ ఫర్లేదుగానీ, ఆ ప్రకటనలో అవసరం లేని 'అతిశయోక్తులు' కొత్త అనుమానాలకు తావిస్తాయ్‌ మరి.! బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జనసేన, మళ్ళీ ఇప్పుడు బీజేపీ వైపుగా అడుగులు వేస్తోందనడానికి ఇదొక నిదర్శనంగా భావించొచ్చా.?

Show comments