కెప్టెన్ ప‌ద‌వి ఊడిన‌ట్టేనా?

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్‌ కుమార్‌రెడ్డికి ప‌ద‌వి గండం ప‌ట్టుకుంది. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యానికి మారుపేరు అని చెప్పుకునే కాంగ్రెస్‌లో వ‌ర్గాలు, విభేదాలు చాలా స‌హజం. దీనికి తెలంగాణ కాంగ్రెస్ అతీతమేమీ కాదు. ఇంకా చెప్పాలంటే టీ కాంగ్రెస్ ఇప్పుడు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టు త‌యారైంది. 

పేరుకు పీసీసీ అధ్య‌క్షుడ‌నే మాటే గానీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఆ స్థాయిలో పెత్త‌నం చ‌లాయించ‌లేక‌పోతున్నాడు. సొంత న‌ల్గొండ జిల్లాలోనే స‌హ‌చర ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వ‌ర్గం నుంచి ఉత్త‌మ్ ఆది నుంచి పూర్తి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నాడు. దీనికి తోడు చాలా మంది సీనియ‌ర్లు ఉత్త‌మ్‌కు స‌హ‌క‌రించ‌డం లేదు.

తాజాగా రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా టీ కాంగ్రెస్ నేత‌లంతా మూకుమ్మ‌డిగా ఉత్త‌మ్‌ను మార్చాల‌ని ఆయ‌న‌కు విన్న‌వించుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌కు నిర‌స‌న‌గా ఆర్గ‌నైజ్డ్ ఉద్య‌మాల‌ను నిర్మించ‌డంలో ఉత్త‌మ్ విఫ‌ల‌మ‌వ‌య్యార‌ని ఫిర్యాదు చేశారు.

రైతు రుణ‌మాఫీ, ఆత్మ‌హ‌త్య‌లు, గిట్టుబాట ధ‌ర‌, ప్రాజెక్టు నిర్వాసితుల అంశాల్లో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డంలో కెప్టెన్ ఫెయిల్ అయ్యార‌ని వెంట‌నే ఆయ‌న స్థానంలో ఇంకొక‌రిని నియ‌మించాల‌ని టీ కాంగ్రెస్ నాయ‌కులు యువరాజును కోరారు. కెప్టెన్ ప‌నితీరు ప‌ట్ల క్షేత్ర స్థాయిలో కార్య‌క‌ర్త‌లు చాలా అస‌హ‌నంగా ఉన్నార‌ని, కొంద‌రు పార్టీ వీడి టీఆర్ఎస్‌, బీజేపీల్లో చేరుతున్నార‌ని ఫిర్యాదు చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ సార‌ధ్యంలో బ‌రిలోకి దిగితే ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని కూడా రాహుల్‌ను బెద‌ర‌గొట్టారు. దీంతో ఢిల్లీ వెళ్లిన త‌ర‌వాత అధిష్టానంతో చ‌ర్చించి దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు. 

ఈ నేప‌ధ్యంలో మంగ‌ళ‌వారం ఢిల్లీలో సోనియాగాంధీ అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ(సీడ‌బ్ల్యూసీ) మీటింగ్ జ‌రిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి వ‌చ్చిన రాహుల్ ఈ సంద‌ర్భంగా త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాలు తెలియ‌జేశారు. ఇదే సంద‌ర్భంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చాల‌న్న డిమాండ్‌ల‌ను కూడా రాహుల్ వ‌ర్కింగ్ క‌మిటీ ముందు ప్ర‌స్తావించ‌గా దీనిపై సుధీర్ఘంగా చ‌ర్చించిన క‌మిటీ ఉత్త‌మ్‌కు మంగ‌ళం పాడాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

అయితే ఉత్త‌మ్‌కు మ‌రో చివ‌రి అవ‌కాశం ఇచ్చిచూడాల‌ని సోనియాగాంధీ వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. మొత్తం మీద చూస్తే ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి కెప్టెన్ ప‌ద‌వి దాదాపు చేజారిన‌ట్టేన‌ని పార్టీలో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు సంబ‌ర‌ప‌డుతున్నాయి. 

ఉత్త‌మ్‌ను తొల‌గించాల్సి వ‌స్తే కొత్త పీసీసీ అధ్య‌క్షుడు రేసులో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, గీతారెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, డీకే అరుణ పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి.

Show comments