ఈ ఫ్రైడే రిలీజ్..జనసేన మీట్

ప్రతి శుక్రవారం..టాలీవుడ్ కు సినిమా పండగే. చిన్న సినిమాలో, పెద్దవో ప్రతి శుక్రవారం ఒకటో, రెండో, ఇంకా ఎక్కువగానో విడుదలవుతుంటాయి. ప్రతి వారం సంగతి ఎలా వున్నా, బాగా హైప్ వచ్చిన పెద్ద సినిమాలు వస్తుంటే మాత్రం భలే ఆసక్తిగా వుంటుంది. ఆ శుక్రవారానికి నాలుగైదు రోజులు ముందుగానే ఆ సినిమా ఫీవర్ అలుముకుంటుంది. టాలీవుడ్ జనాలు ఏ ఇధ్దర్ని పలకరించినా, ఆ సినిమా మచ్చట్లే వినిపిస్తాయి.

టాలీవుడ్ టాప్ స్టార్ ల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కాకినాడ పబ్లిక్ మీటింగ్ కూడా ఈ విధమైన ఆసక్తినే రేకెత్తిస్తోంది. కో ఇన్సిడెన్స్ నో, లేదా ఫ్రైడే రిలీజ్ అని అలవాటైన వ్యవహారం వల్లనో, మరే కారణం వల్లనో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తన కాకినాడ మీటింగ్ ను 9వ తేదీ శుక్రవారమే జరపుతున్నారు. ఇందుకోసం ఈస్ట్ గోదావరిలో వ్యవహారాలు ఊపందుకున్నాయి. 

పవన్ చాలా తెలివిగానే ఈస్ట్ గోదావరిని వెన్యూగా ఎన్నుకున్నారు. ఈస్ట్ గోదావరిలో పవన్ కు వెన్నుదన్ను అయిన కాపుల ఆధిక్యత బాగా వుందన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన అత్యథిక కాపు నాయకులు ఆ జిల్లాకు చెందినవారే. అందుచేత పవన్ సభకు జనసేకరణ అన్నది ప్రత్యేకమైన కార్యక్రమం కాబోదు. సో, సభ విజయవంతం అన్నది జస్ట్ చాలా క్యాజువల్ విషయమే.

అంతే కాదు, తెలుగుదేశం పార్టీకి పక్కలో బల్లెం మాదిరిగా తయారవుతున్న ముద్రగడ పద్మనాధం కాకినాడకు, అక్కడికి సమీపంలోని కిర్లంపూడికి చెందినవారే. అదీ కాక, మళ్లీ వైకాపా ఇక్కడ బలోపేతం కావాలని కాస్త గట్టిగా ప్రయత్నిస్తోంది. కాకినాడ, ద్వారపూడి, అనపర్తి ప్రాంతంలో కాస్త బలంగా వున్న రెడ్డి కమ్యూనిటీకి, కాపులను కూడా తోడు చేసుకుంటోంది. ముద్రగడకు వైకాపాకు ఇంటర్ లింక్ వుందన్నది తెలుగుదేశం అనుమానం కాదు, ఆరోపణ కూడా. అందువల్ల అలాంటి చోట పవన్ సభ పెట్టి, ఒక విధమైన బల ప్రదర్శన చేయడం అంటే వారికి చెక్ చెప్పడమే. 

పేరుకు హోదా సభ, ఆత్మగౌరవ నినాదం వుంటే వుండొచ్చు గాక. కానీ రాజకీయ సర్కిళ్లలో వినిపిస్తున్న జనసేన స్ట్రాటజీ వేరుగా వుంది. 2019 నాటికి ప్రతిపక్ష వైకాపా బలంగానూ, తెలుగుదేశం పార్టీ బలహీనంగానూ వున్న 20 నుంచి 50 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం వుందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకోసం జనసేన కసరత్తు కాకినాడతో ప్రారంభం అవుతోందన్నది రాజకీయ వర్గాల అంచనా. అందుకే ఇప్పుడు కాకినాడ పవన్ సభపై అందరి కళ్లు వున్నాయి. 

ఎందుకంటే, తిరుపతి సభ అన్నది టీజర్ లేదా ట్రయిలర్ లాంటిది. దీనిపై వచ్చిన రెస్సాన్స్ ను రియాక్షన్ ను బట్టే పవన్ కాకినాడ సభ ప్రసంగం ఆధారపడి వుంటుంది. ఈ ప్రసంగం బట్టి, పవన్ భవిష్యత్ కార్యాచరణ ఎలా వుండబోతుందన్నదానిపై  ఓ స్పష్టత వస్తుంది. తిరుపతి స్పీచ్ అనే ఆ టీజర్ కమ్ ట్రయిలర్ ఏమీ పెద్ద గొప్పగా లేదన్నది వాస్తవం. ఎప్పటిలాగే పవన్ తన అన్ విజిబుల్ మెంటార్ బాబు ప్రాప్టింగ్ మేరకే స్పీచిచ్చారని అర్థమైపోయింది. పవన్ ను వివిధ కారణాలతో అభిమానించే వారికి ఆ ప్రసంగం అద్భుతంగా వుంటే వుండొచ్చు. అది వేరే సంగతి.

సో, కాకినాడ సభలో అయినా పవన్ క్లారిటీ అయిన ప్రసంగం ఇస్తే కనుక, ఆయన రాజకీయ పయనం పై ఓ అయిడియా వస్తుంది. లేదా ఆయన స్టయిల్ లో జంప్ లు జంప్ లుగా, దేన్నీ పూర్తిగా వివరించకుండా, విమర్శిస్తూ, అంతలోనే పొగుడుతూ, అంతలోనే ఖండిస్తూ, ఇలా చిత్తానికి సాగితే, కేవలం తన అభిమాన జనాలను తనతో పట్టి వుంచుకుని, తెలుగుదేశం అండతో వచ్చే ఎన్నికలకు రెడీ అవ్వడం తప్ప, మరో ఎజెండా ఏదీ పవన్ కు లేదని స్పష్టమైపోతుంది.

లేదూ, హోదా మీద, చంద్రబాబు, వెంకయ్యల నాలుక మడత ధోరణిని కనుక నిజంగా చీల్చి చెండాడితే, పవన్ డిఫరెంట్ పాథ్ లో ముందుకు వెళ్లబోతున్నారని అనుకోవడానికి చాన్స్ వుంటుంది. కానీ ఈ కాకినాడ సినిమాకు అంత సీన్ వుంటుదని రాజకీయ వర్గాలు అయితే ప్రస్తుతానికి భావించడం లేదు.

Show comments