నంద్యాల నాటకం: కండువాలు మారుతున్నాయంతే

అది 2014 ఎన్నికల నాటి చిత్రం.. నంద్యాలలో భూమా వర్సెస్‌ శిల్పా.! ఇప్పుడిది 2017 ఉపఎన్నిక చిత్రం. ఇప్పుడూ నంద్యాలలో భూమా వర్సెస్‌ శిల్పా. ఏం మారిందయ్యా.? అంటే, నాయకులు కండువాలు మార్చారంతే. అంతకు మించి ఏమీలేదు. నిన్న మొన్నటిదాకా చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌.. ఇప్పుడా కన్‌ఫ్యూజన్‌ కూడా దాదాపుగా తొలగిపోయింది. మొత్తంగా అటు వర్గం, ఇటు వర్గం పక్కాగా వుంది. మారిందల్లా పార్టీ కండువాలు మాత్రమే. 

రాజకీయమంటేనే ఓ పెద్ద నాటకం. ఆ నాటకంలో పాత్రధారులు మారతారంతే. నాటకం ఎప్పటికీ మారదనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 'ఊసరవెల్లి' పేరుని ప్రస్తావించి, దాన్ని తక్కువ చేయడం ఎందుకుగానీ, రాజకీయ నాయకులు పార్టీల జెండాలు మారుస్తున్న తీరు, ఆ మార్చడానికి వారు చెబుతున్న కారణాల తీరు చూస్తోంటే, సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకోవాలంతే.! 

మంత్రిపదవి కోసం భూమావర్గం, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ చేస్తుందా.? కేవలం ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం శిల్పావర్గం, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి జంప్‌ చేస్తుందా.? నవ్విపోదురుగాక మనకేటి 'డాష్‌ డాష్‌' అన్నట్టు వ్యవహరిస్తున్నారు నంద్యాలలో రాజకీయ ఉద్ధండులు.! మేమే గెలిచేస్తామని మీసాలు మెలేస్తున్నారు.. తొడలు కొట్టేస్తున్నారు కూడా.! అవును, ఎప్పుడూ రాజకీయ నాయకులే గెలుస్తారు, ఓడిపోయేదెప్పుడూ ప్రజలే. 

లేటెస్ట్‌గా రంగు మార్చుతున్నది టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి. టీడీపీలో ఆయనగారికి తగిన ప్రాధాన్యత దక్కడంలేదట. 'ప్రాధాన్యత' అంటే ఏంటో మరి.! అన్నగారు టీడీపీని వీడి, వైఎస్సార్సీపీలోకి వెళ్ళినప్పుడు 'ఇదే రైట్‌ టైమ్‌, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చెయ్యొచ్చు..' అనుకున్నారు చక్రపాణి. ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబు తలపండిపోయిందాయె.! తెలివిగా చక్రపాణిని పక్కన పెట్టేశారు. అన్నగారి దారిలోనే, చక్రపాణి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. 

ఈలోగా, టీడీపీ నేతలు అలర్ట్‌ అయ్యారు, డ్యామేజీ కంట్రోల్‌ చర్యలు చేపట్టారు. ఇవి కంటితుడుపు చర్యలే. ఇంకోపక్క, ఇప్పటిదాకా చక్రపాణిని విమర్శించిన వైఎస్సార్సీపీ నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టేశారు. ఆయన, వైఎస్సార్సీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది కూడా.! పార్టీ ఫిరాయింపులపై ఇప్పటిదాకా గుస్సా అయిన వైఎస్సార్సీపీ, ఎమ్మెల్సీ అయిన చక్రపాణిని తమ పార్టీలో ఎలా చేర్చుకుంటుందట.? 

అంతా బాగానే వుందిగానీ, నంద్యాలలో శిల్పామోహన్‌రెడ్డి గెలిచినా వైఎస్సార్సీపీలోనే వుంటారన్న గ్యారంటీ ఏంటి.? ఒకవేళ భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచానా, ఆయనా టీడీపీతోనే అతుక్కుపోతారని నమ్మగలమా.? ఛాన్సేలేదు. రాజకీయం ఆడే వింత నాటకంలో ప్రజలు జస్ట్‌ ప్రేక్షకులు మాత్రమే.. ప్రేక్షకులే కాదు, బాధితులు కూడా వాళ్ళే.

Show comments