అమెరికాలోనూ అదే రాజకీయమా.?

చీమ కుట్టిందిరో.. అయితే, అది వైఎస్‌ జగన్‌ పనే.! అవును, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అన్ని విషయాల్లోనూ ఇదే తీరున 'కలవర'పాటుకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వున్నా, అమెరికాలో వున్నా, చంద్రబాబుని వైఎస్‌ జగన్‌ ఫోబియా వీడటంలేదు. పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా, పరువు బజార్న పడితే అది కాస్తా 'వైఎస్‌ జగన్‌' కుట్ర అని ఆరోపించడం, చంద్రబాబుకి అలవాటే. విదేశాల్లోనూ చంద్రబాబు ఇదే తీరుతో ఆందోళన చెందుతున్నారు చిత్రంగా. 

ప్రస్తుతం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తున్నారు. అదేనండీ, అమెరికాలో పర్యటిస్తున్నారాయన. అక్కడాయనకు ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నుంచి చుక్కెదురవుతోందట. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందట. కానీ, అమెరికాలో చంద్రబాబుకి అక్కడి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందట. వైఎస్సార్సీపీ మద్దతుదారులు, చంద్రబాబుకి వ్యతిరేకంగా పోలీసులకు పిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదులో పస లేదని పోలీసులు తేల్చేశారట. 

అసలేం జరుగుతోందక్కడ.? అమెరికాలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు గనుక, కథనం ఎలాగైనా వండి వడ్డించేయొచ్చు.. అన్నది టీడీపీ అనుకూల మీడియా వాదన. కానీ, వైఎస్సార్సీపీ - టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. వైఎస్సార్సీపీ అమెరికా విభాగం, తాము చంద్రబాబు అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తేల్చి చెప్పింది. టీడీపీలోని గ్రూపు తగాదాలు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనీ, వర్గాలుగా విడిపోయి టీడీపీ నేతలే కొట్టుకుంటోంటే, ఆ పాపం వైఎస్సార్సీపీ మీద నెట్టేయాలని టీడీపీ చూస్తోందని వైఎస్సార్సీపీ అమెరికా విభాగం కన్వీనర్‌ స్పష్టం చేశారు. 

మరోపక్క, సోషల్‌ మీడియా షరామామూలుగానే చంద్రబాబు అమెరికా టూర్‌ని కడిగి పారేస్తోంది. గతంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా విశాఖలో చేసుకున్న ఒప్పందాలనే, ఇప్పుడు అమెరికాలోనూ రిపీట్‌ చేస్తూ, పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్న వైనాన్ని నెటిజన్లు కడిగి పారేస్తున్నారు. అవును మరి, చంద్రబాబుకి విదేశీ పర్యటనలు కొత్త కాదు.. 'ఎంఓయూ' అన్న పదానికే అర్థాన్ని మార్చేశారాయన. లక్షల కోట్ల పెట్టుబడులొచ్చేశాయని చెప్పుకుంటున్న చంద్రబాబు, వాటిల్లో ఎన్నింటిని నిజం చేసి చూపించారట.?

Show comments